CCTNS
-
పక్కాగా జీరో ఎఫ్ఐఆర్ అమలు
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ మరోసారి చర్చకు వచ్చింది. పోలీసు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. దిశ హత్య కేసు అనంతరం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి గత నెలాఖరునే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పోలీస్స్టేషన్లలో తప్పకుండా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అందులో పొందుపరచనున్నారు. నేడో, రేపో ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఆదేశాలు చేరనున్నాయి. ఈ ఏడాది 200పైనే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్‌లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్ కేసుతో జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది. కానీ తెలంగాణ పోలీసులు ఈ కేసులో మాత్రం సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం) ద్వారా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ను బదిలీ చేయడం గమనార్హం. మహిళలు, యువతులు అదృశ్యమైన సందర్భంలో వెంటనే స్పందిస్తారు. విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్ఎస్ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్‌తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి. -
సీసీఎస్ ‘చేతికి’ సీసీటీఎన్ఎస్!
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు విభాగాలు–ఏజెన్సీల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, నేరాల నిరోధం, కేసులను కొలిక్కి తీసుకురావడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తున్న వ్యవస్థే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్). దేశంలోని ఇతర నగరాల కంటే తెలంగాణలో, రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల కంటే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఇది వేగంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిని త్వరితగతిన పూర్తి చేయడానికి పర్యవేక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ నగర పోలీస్ కమిసనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులకు అప్పగించారు. ఇటీవల సీసీఎస్ సందర్శనకు వచ్చిన ఆయన ఈ విషయం ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి నిత్యం అనేక మంది సిటీకి వచ్చిపోతుండటం, స్థిరపడటం జరుగుతోంది. ఇలాంటి వారిలో కొందరు నేరచరితులై ఉండి, ఇక్కడా అలాంటి వ్యవహారాలే నెరపుతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాత నేరగాళ్ల జాబితా మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. వీరితో పాటు గతంలో ఇక్కడ నేరం చేసినా బయటి రాష్ట్రాల వారి వివరాలు సైతం రికార్డుల్లో ఉంటాయి. అయితే కేవలం ఆయా రాష్ట్రాల్లో మాత్రమే నేర చరిత్ర ఉండి, తొలిసారిగా ఇక్కడ నేరం చేసిన వివరాలు మాత్రం అందుబాటులో ఉండట్లేదు. ఈ రికార్డులన్నీ ఆయా రాష్ట్రాలకే పరిమితం కావడంతో ఈ సమస్య ఎదురవుతోంది. సీసీటీఎన్ఎస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన రికార్డులు, వివరాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి. ఫలితంగా ఓ వ్యక్తి దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో అరెస్టయినా, ఎవరికి వాంటెడ్‌గా ఉన్నా క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఓ అనుమానితుడు, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్ర, ఇతర ఆధారాలను సెర్చ్ చేయడం ద్వారా వారి వివరాలు, చిరునామా సహా పూర్తి సమాచారం పొందవచ్చు. అయితే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అన్ని పోలీసుస్టేషన్లతో పాటు ఏజెన్సీలు రికార్డులను ఆన్లైన్ చేయాలి. అరెస్టు చేసిన నిందితుల వివరాలు, జారీ అయిన నాన్–బెయిలబుల్ వారెంట్లు తదితరాలు మాత్రమే కాదు... చివరకు నిందితులు వెల్లడించిన నేరాంగీకార వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు సంబంధించిన రికార్డులు సైతం ఆన్లైన్ కావాలి. దీనికోసం నగర పోలీసు విభాగం గడచిన కొన్నేళ్లుగా ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగుతోంది. ఇప్పుడు అరెస్టు చేసిన వారి వివరాలు, దర్యాప్తు చేస్తున్న కేసుల అంశాలతో పాటు పాత వాటినీ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయా ఠాణాలు, విభాగాలకు చెందిన ఈ–కాప్స్ సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. నగరానికి సంబంధించి దీని అమలు విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతలను నగర కొత్వాల్ అంజనీకుమార్ సీసీఎస్‌కు అప్పగించారు. ఈ విభాగంలో ఉన్న ఏసీపీ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు కొందరిని ఎంపిక చేసి ఒక్కొక్కరిని ఒక్కో ఠాణాకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరు తరచూ ఆయా ఠాణాలకు వెళ్లడంతో పాటు ప్రతి నిత్యం సీసీటీఎన్ఎస్ అమలు తీరును పర్యవేక్షిస్తుండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండింటి సమన్వయానికి... సాంకేతికంగా రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా మూడు కమిషనరేట్లు ఉన్నాయి. అయితే భౌగోళికంగా మాత్రం ఇవి కలిసే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రాంతంలో నేరం చేసిన వారు మరో చోట దాక్కోవడం, ఓ కమిషనరేట్‌కు చెందిన ముఠాలు మరో చోట పంజా విసరడం జరుగుతోంది. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలులోకి వచ్చే లోగా భారీ నేరాలు జరిగినప్పడు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో సమన్వయం కోసం పోలీసు ఉన్నతాధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సీసీఎస్ ఆధీనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన కేసులు, భారీ నేరాల విషయంలో సైబరాబాద్ అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యతలను సీసీఎస్ స్పెషల్ టీమ్–1కు, రాచకొండతో కో–ఆర్డినేషన్ బాధ్యతను సీసీఎస్ స్పెషల్ టీమ్–2కు అప్పగించారు. నగర నేర పరిశోధన విభాగం ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కమిషనరేట్లలో ఉన్న సైబర్ క్రైమ్ ఠాణాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయనున్నారు. ఈ చర్యలు కేసులను త్వరగా కొలిక్కి తీసుకురావడంతో పాటు నేరాల నిరోధానికి ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
పోలీస్ @ అప్డేట్
అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకోవడం జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా 15 వేల పోలీస్స్టేషన్లు, ఐదు వేలకు పైగా పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలను అనుసంధానించేలా చేపట్టిన సీసీటీఎన్ఎస్ వంటి ప్రాజెక్టులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరింత అవగాహన కల్పించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఏసీపీ, డీఎస్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు. సాక్షి, నిజామాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఇటీవల నిజామాబాద్ నగరం నడిబొడ్డున స్వైర విహారం చేసింది. నగరంలోని జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడి., వాహనంలో దర్జాగా నవీపేట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వాహనాన్ని వదిలేసి ద్విచక్ర వాహనాలపై సమీపంలో ఉన్న మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తరచూ ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్న పక్కా ప్రొఫెషనల్స్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడం జిల్లా పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి వివరాలు, కదలికలు జిల్లా పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడే సీసీటీఎన్ఎస్ (క్రిమినల్స్, క్రైం ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం) ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 15 వేల పోలీస్స్టేషన్లు, ఐదు వేలకు పైగా పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలను అనుసంధానించేలా చేపట్టిన సీసీటీఎన్ఎస్ వంటి ప్రాజెక్టులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరింత అవగాహన కల్పించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారులకు అధునాతన టెక్నాలజీపై రెండు రోజుల పాటు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరగనున్న అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. ఇప్పటికే టీఎస్‌కాప్ వినియోగం.. ఇప్పటికే టీఎస్ కాప్, సీసీటీఎన్ఎస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, పోలీసు అధికారులు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ఆ శాఖ చర్యలు చేపట్టింది. సిబ్బందికి టెక్నాలజీకి సంబంధించి అవగాహన కల్పించారు. తాజాగా మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అప్డేట్స్పై ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. పోలీసుశాఖ వినియోగిస్తున్న టీఎస్‌కాప్ వంటి ప్రత్యేక యాప్‌తో వాహన తనిఖీలు చేసినప్పుడు, అనుమానాస్పద వాహనాల వివరాలను ఆన్లైన్లో వీక్షించేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి ప్రతిరోజు విడుదలవుతున్న వారి వివరాలను కూడా ఆన్లైన్లో చూసుకునేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. తద్వారా తరచూ నేరాలకు పాల్పడే స్వభావం కలిగిన వారి కదలికలపై, ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు జరుగుతున్న ప్రాంతాలను ఆన్లైన్లో పొందుపరడం ద్వారా ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాల (క్రైంప్రోన్ ఏరియాలు)పై, తరచూ ఒకేచోట దొంగతనాలు, దాడులు, హత్యలు జరుగుతున్న ప్రాంతాలను ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీసులు నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుంది. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే 2002 నుంచి నమోదైన కేసుల వివరాలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక యాప్‌లో గన్‌లైసెన్సులు, క్రిమినల్ ఆల్బమ్, కోర్టు కేసుల వివరాలు ఇలా అన్ని అంశాలను కూడా ఆన్లైన్లో పొందుపరిచారు. -
ఒకే చోట.. నేరస్తుల డేటా
సాక్షి, హైదరాబాద్: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో ఇక కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా భాగం కానున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)తోపాటు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసే అధికారం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ వద్ద ఉన్న నేరస్తుల సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లో పొందుపర్చనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ.. ఎవరు.. ఏ నేరం చేసినా.. వాటి వివరాలు, ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్ఎస్లో అందుబాటులో ఉండనున్నాయి. నేర సమాచారాన్ని ఒకే వ్యవస్థ కింద మార్పిడి చేసుకునేలా సీసీటీఎన్ఎస్ వేదికను ఈ–గవర్నెన్స్ ద్వారా 2009లో కేంద్రం రూపొందించింది. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్లో రాష్ట్రాల పోలీస్ శాఖలు మాత్రమే స్టేక్ హోల్డర్లుగా ఉంటూ వచ్చాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు సంస్థలను కూడా సీసీటీఎన్ఎస్లో డేటా అప్లోడ్ చేసేలా ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంతో నేరస్తుల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. సమస్తం.. సీసీటీఎన్ఎస్లోకి.. సీబీఐ, ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కేసులు, నేరస్తుల సమస్త సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లోకి అప్లోడ్ చేయనున్నాయి. అలాగే రాష్ట్రాల్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ విభాగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లాంటి ప్రత్యేక యూనిట్లు సైతం కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ డ్యాష్‌బోర్డులో పొందుపర్చాల్సి ఉంటుంది. సీసీటీఎన్ఎస్ ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టు తీర్పులు, కోర్టు కొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్‌తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్‌లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలులో తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. -
పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం, ఎప్పటికప్పుడు డాటా షేరింగ్‌లోనూ మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవిగుప్తా ఈ అవార్డును స్వీకరించారు. రవిగుప్తా, ఆయన బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అవార్డు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రవిగుప్తాతో పాటు, ఆయన బృందాన్ని అభినందించారు. -
మెరుగైన సేవల కోసమే సీసీటీఎన్ఎస్
అనంతపురం సెంట్రల్ : సీసీటీఎన్ఎస్ (క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం) తో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని డీఎస్పీలకు సీసీటీఎ¯Œన్ఎస్పై రెండ్రోజుల అవగాహన సదస్సును ఎస్పీ ప్రారంభించారు. పోలీసు వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ డిటెక్షన్, సమాచార సేకరణ, దేశమంత వివిధ పోలీసు సంస్థల మధ్య సమన్వయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి సీసీటీఎ¯ŒSఎస్ ప్రాజెక్టును రూపకల్పన చేశారని ఎస్పీ తెలిపారు. ఈ గవర్నె¯Œ్స సూత్రాలను అమలు చేయడం ద్వారా పోలీసుల పనితీరు, దర్యాప్తును శాస్త్రీయంగా మెరుగుపర్చొచని చెప్పారు. -
సీసీటీఎన్ఎస్లో ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: సైబర్ నేరాలను కట్టడి చేయడానికి చేపట్టిన ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత తీవ్రతరం చేశారు. ఇలాంటి మోసాలను నియంత్రించే నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు పలు రాష్ట్రాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో ఢిల్లీ పోలీసులు కూడా చేరనున్నారు. ఢిల్లీతోపాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర త్వరలోనే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక తెలిపింది. సైబర్ నేరాల వివరాల సేకరణ, భద్రపర్చడం, పునరుద్ధరణ, విశ్లేషణ, బదిలీ, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం 2009లో సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి ఎన్సీఆర్బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు సైబర్ నేరాల సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్లు, రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వాలకు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సీసీటీఎన్ఎస్ పనితీరు గురించి ఎన్సీఆర్బీ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రాజన్ వర్మ మాట్లాడుతూ ‘ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ నమోదు చేసే ఎఫ్ఐఆర్లు, పోలీసుల కదలికల వంటి సమాచారాన్ని సీసీటీఎన్ఎస్ నెట్‌వర్క్‌కు అప్లోడ్ చేస్తారు. పాస్వర్డ్ ఉపయోగించడం ద్వారా స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ విభాగాలు ఈ సమాచారాన్ని పొందుతాయి. దీనివల్ల నేరగాళ్లను పట్టుకోవడం సులువుగా మారుతుంది. వాళ్లు తమ స్థావరాలను వేరే చోటికి తరలించినా తెలిసిపోతుంది. నేరగాళ్ల గత చరిత్ర పూర్తిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ల నేరాలను న్యాయస్థానాల్లో నిరూపించడం తేలిగ్గా మారుతుంది’ అని వివరించారు. ఈ-పాలన విధానం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సీసీటీఎన్ఎస్ సమగ్ర వ్యవస్థను రూపొందించిందని రాజన్ తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 16 రాష్ట్రాలు సీసీటీఎన్ఎస్లో చేరాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే సైబర్ నేరాలను ఛేదించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం సంక్లిష్టమైన పనేనని రాజన్ అన్నారు. ఇందుకు ఈ-నెట్వర్కింగ్ అప్లికేషన్లపై సమగ్ర శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే నెట్‌వర్క్‌ల అనుసంధానంలో ఇప్పటి వరకు చాలా ప్రగతి సాధించామన్నారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లోని 21,502 పోలీసు స్టేషన్లలో 14,485 స్టేషన్ల సమాచారాన్ని బీఎస్ఎన్ఎన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. మిగతా స్టేషన్ల సమాచారాన్ని త్వరలోనే అనుసంధానిస్తామని ఎన్సీఆర్బీ తెలిపింది. జాతీయ డేటా కేంద్రాన్ని రాష్ట్రాల డేటా కేంద్రాలతో అనుసంధానించడానికి ఎన్సీఆర్బీ బీఎస్ఎన్ఎల్తోపాటు ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల సేవలు తీసుకుం టోంది. కేంద్ర హోంశాఖ చేపట్టిన జాతీయ ఈ-పాలన ప్రణాళిక కింద సీసీటీఎన్‌ఎస్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాలకు ఈ ఏడాది మార్చి వరకు రూ.540 కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇది వరకే రూ.334.81 కోట్లు ఖర్చయ్యాయని రాజన్ వివరించారు.