సీసీటీఎన్‌ఎస్‌లో ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: సైబర్ నేరాలను కట్టడి చేయడానికి చేపట్టిన ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత తీవ్రతరం చేశారు. ఇలాంటి మోసాలను నియంత్రించే నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు పలు రాష్ట్రాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్)లో ఢిల్లీ పోలీసులు కూడా చేరనున్నారు. ఢిల్లీతోపాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర త్వరలోనే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్‌బీ) నివేదిక తెలిపింది.
సైబర్ నేరాల వివరాల సేకరణ, భద్రపర్చడం, పునరుద్ధరణ, విశ్లేషణ, బదిలీ, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం 2009లో సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి ఎన్సీఆర్‌బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు సైబర్ నేరాల సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్లు, రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వాలకు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సీసీటీఎన్‌ఎస్ పనితీరు గురించి ఎన్సీఆర్‌బీ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రాజన్ వర్మ మాట్లాడుతూ ‘ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ నమోదు చేసే ఎఫ్‌ఐఆర్లు, పోలీసుల కదలికల వంటి సమాచారాన్ని సీసీటీఎన్‌ఎస్ నెట్‌వర్క్‌కు అప్‌లోడ్ చేస్తారు. పాస్‌వర్డ్ ఉపయోగించడం ద్వారా స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ విభాగాలు ఈ సమాచారాన్ని పొందుతాయి.
దీనివల్ల నేరగాళ్లను పట్టుకోవడం సులువుగా మారుతుంది. వాళ్లు తమ స్థావరాలను వేరే చోటికి తరలించినా తెలిసిపోతుంది. నేరగాళ్ల గత చరిత్ర పూర్తిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ల నేరాలను న్యాయస్థానాల్లో నిరూపించడం తేలిగ్గా మారుతుంది’ అని వివరించారు. ఈ-పాలన విధానం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సీసీటీఎన్‌ఎస్ సమగ్ర వ్యవస్థను రూపొందించిందని రాజన్ తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 16 రాష్ట్రాలు సీసీటీఎన్‌ఎస్‌లో చేరాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే సైబర్ నేరాలను ఛేదించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం సంక్లిష్టమైన పనేనని రాజన్ అన్నారు. ఇందుకు ఈ-నెట్‌వర్కింగ్ అప్లికేషన్లపై సమగ్ర శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే నెట్‌వర్క్‌ల అనుసంధానంలో ఇప్పటి వరకు చాలా ప్రగతి సాధించామన్నారు.
ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లోని 21,502 పోలీసు స్టేషన్లలో 14,485 స్టేషన్ల సమాచారాన్ని బీఎస్‌ఎన్‌ఎన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. మిగతా స్టేషన్ల సమాచారాన్ని త్వరలోనే అనుసంధానిస్తామని ఎన్సీఆర్‌బీ తెలిపింది. జాతీయ డేటా కేంద్రాన్ని రాష్ట్రాల డేటా కేంద్రాలతో అనుసంధానించడానికి ఎన్సీఆర్‌బీ బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ఇతర ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ల సేవలు తీసుకుం టోంది. కేంద్ర హోంశాఖ చేపట్టిన జాతీయ ఈ-పాలన ప్రణాళిక కింద సీసీటీఎన్‌ఎస్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాలకు ఈ ఏడాది మార్చి వరకు రూ.540 కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇది వరకే రూ.334.81 కోట్లు ఖర్చయ్యాయని రాజన్ వివరించారు.