రెచ్చిపోతున్న నేరగాళ్లు ఖాకీలపైనే కాల్పులు
సామాన్యుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత లేకుండాపోతోంది. నేరగాళ్లు తెగించి కాల్పులకు దిగుతుండడమే ఇందుకు కారణం. ఇటీవల చోటుచేసుకున్న ఈ పరిణామం పోలీసు శాఖ సిబ్బందిని కలవరానికి గురి చేస్తోంది. అయితే పోలీసులకే దిక్కులేకపోతే వారు తమకు ఎలా రక్షణ కల్పిస్తార ని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, పెట్రోలింగ్ వాహనాలతో పోలీసులు నిరంతరం గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ నగరంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు తమ ఆయుధాలను ఏకంగా పోలీసులపైనే గురిపెడుతున్నారు. శనివారం రాత్రితోపాటు సోమవారం తెల్లవారుజామున పోలీసు కానిస్టేబుళ్లపై జరిగిన దాడి ఘటనలే ఇందుకు ఉదాహరణ. ఢిల్లీ పోలీసులు స్మార్ట్ పోలీసులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం దేనికీ జంకడం లేదు. మరోవైపు ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇటీవలి కాలంలో ఇటువంటివి కనీసం 12 జరిగి ఉంటాయని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
తమను అడ్డగించడానికి ప్రయత్నించినా లేదా వెంబడించినా లేదా అనుమానించినా పోలీసు సిబ్బంది ప్రాణాలను తీయడానికి నేరగాళ్లు ఎంతమాత్రం వెనకాడడం లేదు. నగర శివారు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి కన్నాట్‌ప్లేస్‌లో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై నేరగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ దాడి వెనుక డ్రగ్ మాఫియా ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఇదిలాఉంచితే ఈ నెల రెండో తేదీన నగరంలోని ద్వారకా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసులు ఆపి ప్రశ్నించినందుకు ముగ్గురు సాయుధులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌తోపాటు హోంగార్డుకూడా చనిపోయాడు. గత నెల 27వ తేదీన మౌజ్‌పుర్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని బైకర్లు...పోలీస్ కానిస్టేబుల్‌ను అతని సర్వీస్ రివాల్వర్‌తోనే కాల్చిచంపిన సంగతి విదితమే.
విధుల్లోఉన్న పోలీస్ కానిస్టేబుళ్లపై అడపాదడపా జరుగుతున్న దాడులు పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల జాబితాను రూపొందించాలంటూ ఏసీపీలు, డీసీపీలను వారు ఆదేశించారు. ఈ ప్రాంతాల వద్ద సాయుధ బలగాలను మోహరించాలని పోలీసులు యోచిస్తున్నారు. అయితే నగరంలో ఆయుధాల అక్రమ సర ఫరాను పూర్తిగా అడ్డుకోలేకపోతున్నామనే విషయాన్ని వారు అంగీకరించారు. దేశంలో నాటు పిస్తోళ్ల తయారీ ఇటీవలి కాలంలో తగ్గిపోయినప్పటికీ తక్కువ ధరకు ఆయుధాలు ఎక్కడ లభిస్తాయనే సమాచారం నేరగాళ్లకు అందుతూనే ఉందని, పొరుగు రాష్ట్రాల్లో తయారయ్యే నాటు పిస్తోళ్లు నేరగాళ్ల చేతుల్లోకి చేరుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు సిబ్బందిపై దాడులకు అనేక కారణాలున్నాయని వారు అంటున్నారు.
నేరగాళ్ల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఔటర్ ఢిల్లీలోని విజయ్ విహార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున నేరగాళ్లు పోలీసులపైనే దాడి చేశారు. ఒకరిని కాల్చిచంపారు. మరొకరిని తీవ్రంగా గాయపరిచారు. మోటారుసైకిల్‌పై గ స్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు రాత్రి రెండు గంటల సమయంలో ఎల్ బ్లాక్‌లోని ఏడో వీధిలో కొందరు వ్యక్తులు ఆటోలో కూర్చుని ఉండడాన్ని గమనించారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అందుకు వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో కానిస్టేబుళ్లు తమ ద్విచక్ర వాహనంపైనుంచి దిగి ఆటోలో కూర్చుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తులు...పోలీసులను అత్యంత సమీపం నుంచి పిస్తోలుతో కాల్చడమే కాకుండా వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా తీసుకుని పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ జగ్బీర్ అక్కడికక్కడే మరణించాడు. మరో కానిస్టేబుల్ నరేందర్‌కు వీపులో గాయైమైంది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసు అధికారులు చెప్పారు.