సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని టీడీపీ నేతలు దందాలు కొనసాగించారు. రాయలసీమకు చెందిన కీలక నేతలపై నమోదైన కేసులు, వాటి వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. కేసులు నమోదైన వారిలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్నవారే అధికం. వీరితో పాటు టీడీపీతో పొత్తు కట్టి ఎన్నికల బరిలోకి వస్తున్న జనసేన నేతలూ ఉన్నారు.
భూతగాదాలు, కిడ్నాప్‌లు, సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పలు స్టేషన్లలో వారిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. గతేడాది వరకూ సాగిన ఈ గూండాగిరీపై “రాజధానిలో రాయలసీమ గూండాలు’ అని మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి.
మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డి, మాజీమంత్రి భూమా అఖిల ప్రియ, కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్ టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేశ్, బంధువు టీజీ విశ్వప్రసాద్, ఆదోని జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మల్లికార్జునపై వేర్వేరు ఘటనల్లో కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు జేసీ పవన్ కుమార్‌రెడ్డి, సీఎం రమేశ్ నాయుడుపై కూడా కేసులు ఉన్నాయి.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డిపై
సినీ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్ కిడ్నాప్ వ్యవహారంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డిపై రెండున్నరేళ్ల కిందట బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శివగణేశ్‌కు ప్రొద్దుటూరులో 2.5 ఎకరాల స్థలం ఉంది. వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని పరిష్కరించేందుకు వరదరాజులరెడ్డి బంధువు రామచంద్రారెడ్డి ద్వారా శివగణేశ్, కొండారెడ్డిని ఆశ్రయించారు. కొండారెడ్డి పంచాయతీ తెంపారు. దీంతో ఎకరం స్థలాన్ని కొండారెడ్డికి ఇచ్చేలా శివగణేశ్ ఒప్పందం చేసుకున్నారు.
ఆ ప్రకారం ఇచ్చిన స్థలం కాకుండా శామీర్‌పేటలో భూములను తమకే రాయించాలని కొండారెడ్డితో పాటు అతని గన్‌మెన్లు, 18 మంది అనుచరులు శివగణేశ్‌ను బెదిరించారు. ఇందుకు శివగణేశ్ ససేమిరా అనడంతో ఎర్రమంజిల్‌లో కిడ్నాప్ చేసి సినీఫక్కీలో సిటీ మొత్తం తిప్పి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. దీంతో శివగణేశ్ అప్పటి హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్‌తో పాటు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.14కోట్ల విలువైన ఈ భూకబ్జా వ్యవహారంలో కొండారెడ్డిపై సెక్షన్ 452, 341, 386, 506, 120బి–రెడ్‌విత్, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై పలుస్టేషన్లలో :
దీపక్‌రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయనా అల్లుడు. 2012లో టీడీపీలో చేరారు. అప్పట్లో ఎన్నికల అఫిడవిట్‌లో రూ.6,781.05 కోట్ల ఆస్తులను చూపించి, అవి వివాదాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి రూ.3.27 లక్షల వార్షికాదాయం ఉండే వ్యక్తి రూ.6,781 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారు? భారీస్థాయిలో ఆస్తులు సంపాదించేందుకు భూకబ్జాలు, సెటిల్‌మెంట్లే కారణమన్న ఆరోపణలున్నాయి.
కబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక్షన్ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక్షన్ 447 కింద గతంలో కేసులు నమోదయ్యాయి. కొందరిపై దాడి చేశారని సెక్షన్ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక్షన్ 148 కింద మరో కేసు నమోదైంది. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి.
గతంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దీపక్‌రెడ్డిని అరెస్టు కూడా చేశారు. మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో “సాక్షి’ ఫోటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు ఉన్నాయి. జేసీ బ్రదర్స్ అండతోనే దీపక్‌రెడ్డి అప్పట్లో పేట్రేగిపోయారనే ఆరోపణలున్నాయి.
జేసీ పవన్, సీఎం రమేశ్‌పై కేసు నమోదుకు ఫిర్యాదు
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని 2016లో హైదరాబాద్‌లో కేసు నమోదైంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో అప్పట్లో వేర్వేరుగా ఒలంపిక్ అసోసియేషన్లు నడిపారు. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను అంతకు ముందు అసోసియేషన్‌లోని పురుషోత్తం వర్గం 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసింది. ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి నిధులు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
రూ.100 కోట్ల స్థలంపై టీజీ కుటుంబం కన్ను
బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పార్క్ నిర్మిం చేందుకు 2005లో 2.5 ఎకరాల స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించారు. ఇందులో రెండెకరాల్లో నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే నిలిపేశారు. తక్కిన అరెకరం(2,250గజాలు) ఖాళీగా ఉంది. దీనిపై వీవీఎస్ శర్మ అనే వ్యక్తి కన్నుపడింది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ స్థలాన్ని కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్ టీజీ భరత్ బంధువు టీజీ విశ్వప్రసాద్ చౌకగా కొనుగోలు చేశారు. దీన్ని స్వాదీనం చేసుకునేందుకు ఆదోని, మంత్రాలయంలో 50 మంది, హైదరాబాద్‌లో మరి కొంతమందిని తీసుకుని మొత్తం 63 మందితో స్థలంలోకి వెళ్లి గేటు పగలకొట్టి సెక్యూరిటీ ఆఫీసర్ నవీన్‌పై దాడికి పాల్పడ్డారు.
ఓ కంటైనర్ ఆఫీసును తీసుకుని వెళ్లి అక్కడ ఉంచారు. దీంతో నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఏ–1గా టీజీ విశ్వప్రసాద్, ఏ2గా వీవీఎస్ శర్మ, ఏ3గా సుభాశ్ పోలిశెట్టి, ఏ–4గా అల్లు మిథున్‌కుమార్, ఏ–5గా టీజీ వెంకటేశ్, ఏ–13గా మల్లికార్జున అలియాస్ మల్లప్ప పేర్లు చేర్చారు. ఆ తర్వాత టీజీ వెంకటేశ్ పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు.
టీజీ విశ్వప్రసాద్ ధమాకా, బ్రో సినిమాల నిర్మాత. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు. ఈయన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదోని నుంచి జనసేన టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏ–13 మల్లప్ప 2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఆదోని నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏ3 సుభాశ్ పోలిశెట్టి అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా జనసేన కన్వినర్.
Comments
Please login to add a commentAdd a comment