సోషల్ మీడియాలో యువతితో పరిచయం..
ప్రేమ పేరుతో మోసగించి..నగరానికి రప్పించి లైంగిక దాడి
ఆపై..ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నం
చివరి నిమిషంలో ఎయిర్‌పోర్టులో పట్టుకున్న మహంకాళి పోలీసులు
రాంగోపాల్‌పేట్: సోషల్ మీడియాలో ఓ యువతిని పరిచయం చేసుకుని..ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలతో లోబర్చుకుని..లైంగిక దాడికి పాల్పడి..ఆ్రస్టేలియా పారిపోయేందుకు యత్నించిన ఓ యువకుడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. 10 నిమిషాల్లో విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జనగాం జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన బండారం స్వామి (29) బీఎస్సీ పౌల్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి పంజాబ్, రాయ్‌పూర్‌లలోని పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నత ఉద్యోగాలు చేశాడు. గత కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లాక ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌లో పనిచేసే 27 ఏళ్ల యువతితో స్నేహం చేశాడు. ఇలా ఇద్దరూ ఒకిరికొకరు సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ వచ్చాడు.
నగరానికి రప్పించి..
ఇదిలా ఉండగా..స్వామి తండ్రి గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో తండ్రిని చూసేందుకు జూన్ 26వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో రాయ్‌పూర్‌లోని యువతికి ఫోన్ చేసి..పెళ్లి చేసికుంటానని, హైదరాబాద్ వస్తే తన తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళతానని స్వామి నమ్మబలికాడు. దీంతో ఈ నెల 2వ తేదీన ఆ యువతి రాయ్‌పూర్ నుంచి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది.
3వ తేదీ ఉదయం 11 గంటలకు బోయిన్‌పల్లిలో బస్సు దిగి ఉండగా..తన ద్విచక్ర వాహనంపై వెళ్లి రిసీవ్ చేసుకుని..అంతకు ముందే పార్క్‌లేన్‌లోని ఓ హోటల్ 4వ అంతస్తులో బుక్ చేసిన హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి స్వామి ఆ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు హోటల్‌లోనే ఉంచి..తన తల్లిదండ్రులు ఊరు వెళ్లారని, 10 రోజుల తర్వాత వస్తానని నమ్మించి 5వ తేదీన మళ్లీ ఆ యువతిని రాయ్‌పూర్ పంపించాడు. ఆ తర్వాత యువతి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పాటు తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి లాంటివి ఏమి లేవని చెప్పాడు.
దీంతో ఆ యువతి స్థానిక ఎస్పీని సంప్రదించగా ఆయన రాయ్‌పూర్‌లోని విధానసభ పోలీసులకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాడు. యువతితో పాటు హైదరాబాద్ చేరుకున్న అక్కడి పోలీసుల సమాచారం మేరకు 29వ తేదీన సాయంత్రం మహంకాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ పరశురాం, ఎస్‌ఐలు జాన్ పరదేశి, వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా పాస్‌పోర్టు తదితర వివరాలు సేకరించారు.
10 నిమిషాల్లో ఎగిరిపోయేందుకు సిద్ధం..
నిందితుడు స్వామి సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు శ్రీలంక మీదుగా ఆ్రస్టేలియా వెళ్లిపోతున్నాడన్న సమాచారం మహంకాళి పోలీసులకు 8 గంటలకు తెలిసింది. వెంటనే పోలీసులు ఎయిర్‌పోర్టులోని సీఐఎస్‌ఎఫ్, శంషాబాద్ ఆర్‌జేఐఏ పోలీసులకు చేరవేశారు. నిందితుడు 5 గంటలకే ఎయిర్‌పోర్టు చేరుకుని చెక్ ఇన్, ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని లాంజ్‌లో వేచిచూస్తున్నాడు. ఇంకో పది నిమిషాల్లో విమానం ఎగిరిపోతుందనే సమాయానికి హుటాహుటిన లోపలికి వెళ్లిన పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment