
కోల్‌కతా: దేశ సరిహద్దు వెంట రాష్ట్ర భూభాగాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) అజమాయిషీ పరిధిని కేంద్రం పెంచిన అంశాన్ని ఢిల్లీలో తేల్చుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టంచేశారు. హస్తిన పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దు వెంట 15 కి.మీ.లకు బదులుగా 50 కి.మీ.ల పరిధి వరకూ సోదాలు, అరెస్ట్‌లకు బీఎస్‌ఎఫ్‌కు అధికారాలు కట్టబెడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీతో భేటీలో లేవనెత్తుతానని మమత చెప్పారు. ‘ బీఎస్‌ఎఫ్ పరిధిని పెంచి మోదీ సర్కార్ సరిహద్దు రాష్ట్రాలపై తమ అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది’ అని మమత ఆరోపించారు. త్రిపురలో హింసాకాండ, బెంగాల్‌లో తృణమూల్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ వర్గాల దాడుల అంశాలనూ ప్రధానితో చర్చిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘ త్రిపురలో హింసపై మానవహక్కుల సంస్థలు, వామపక్ష సంఘాలు ఇంతవరకూ నోరు మెదపకపోవడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది’ అని మమత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment