ఢిల్లీ ఆప్ సర్కార్‌లో కీలక మంత్రులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే డజనుకుపైగా మంత్రిత్వ శాఖలను ఒంటిచేత్తో నడిపి సమర్థవంతమైన నాయకురాలిగా నిరూపించుకున్న అతిశికి సరైన మన్నన దక్కింది. మధ్యప్రదేశ్‌లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాలపాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
సోషలిస్ట్ విప్లవయోధులు మార్క్స్, లెనిన్ పేర్లను కలిపి అతిశి తల్లిదండ్రులు ఆమెకు ‘మార్లెనా’ పేరును జోడించారు. అయితే రాజకీయరంగ ప్రవేశానికి ముందే 2018లో మార్లెనా పదాన్ని తన పేరు నుంచి అతిశి తొలగించుకున్నారు. రాజకీయ నామధేయం పోయినా ఈమెకు రాజకీయాలు బాగా అబ్బడం విశేషం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల కోసం పాటుపడి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు శాఖలను నిర్వర్తించిన పాలనా అనుభవం సీఎంగా ఆమెకు అక్కరకు రానుంది.
రాజకీయ ప్రవేశం
2013లో ఆప్ పార్టీలో చేరారు. 2013లో ఆప్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ ఇమేజ్ పెరిగేలా ముసాయిదా కమిటీకి అతిశి కీలక సూచనలు ఇచ్చినట్లు చెబుతారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో జల సత్యాగ్రహం దీక్ష చేపట్టి పార్టీలో ముఖ్యురాలిగా మారారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా సేవలందించారు. 2019లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. అయితే అక్కడి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీలోని కాల్‌కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు.
పలుశాఖలకు మంత్రిగా: మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 ఫిబ్రవరిలో విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నీ తానై ఆర్థికశాఖసహా 14 మంత్రిత్వ శాఖల బాధ్యతలు తన భుజస్కంధాలపై మోశారు. 2024లో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
అతిశి ఒకప్పుడు రిషివ్యాలీ టీచర్
కురబలకోట(అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్‌లో అతిశి గతంలో టీచర్‌గా పనిచేశారు. 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా చేశారు. 6, 7 తరగతులకు ఇంగ్లీషు టీచర్‌గా పనిచేశారు. తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషివ్యాలీ స్కూ ల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషివ్యాలీ స్కూల్‌ను స్థాపించారు. – సాక్షి, నేషనల్‌డెస్క్
జననం: 1981 జూన్ 8
తల్లిదండ్రులు: విజయ్ సింగ్, త్రిప్తా వాహీ(వీళ్లిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు)
భర్త: ప్రవీణ్ సింగ్ (పరిశోధకుడు, విద్యావేత్త)
విద్యార్హతలు: ఢిల్లీలోని
స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి టాపర్‌గా నిలిచారు. చెవెనింగ్ స్కాలర్‌షిప్ సాయంతో ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్‌షిప్‌తో ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment