విద్యుత్ షాక్‌తో మృతిచెందిన తండ్రీకుమారులు
ఖమ్మం జిల్లా: ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. రఘునాదపాలెంకు చెందిన బానోత్ శంకర్(45), అతని కుమారుడు వెంకటేష్(19)లు 11కేవీ వైర్లు తగిలి మృతిచెందారు. వివరాలు..రఘునాథపాలెంకు చెందిన వీరికి సొంత ట్రాక్టర్ ఉంది. తండ్రీ కుమారులు ఈరోజు(సోమవారం) మధ్యాహ్నా సమయంలో రఘునాథపాలెంలోని గణేష్ టౌన్‌షిప్ పక్కన ఉన్న ఓ రైతు వ్యవసాయ భూమిని కిరాయికి దున్నేందుకు వెళ్లారు. ఆ భూమిలో 3 రోజులక్రితం 11కేవీ వైరు తెగిపడి ఉన్నట్లు గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు.
విద్యుత్ శాఖ సిబ్బంది ఆ వైరుకు కరెంట్ సరఫరా కావడం లేదు అని చెప్పటంతో వెంకటేష్ ఆ వైరుకు పక్కకు వేద్దామని పట్టుకున్నాడు. దాంట్లో కరెంటు సరఫరా జరుగుతున్న విషయం తెలియక విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడికి ఏదో జరిగిందని 11 కేవీ వైరు దగ్గరకు వెళ్లి పట్టుకోగా తండ్రి కూడా మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటనతో రఘునాధపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు జీవితాలు బలయ్యాయని గ్రామస్తులు తండ్రీకుమారుల మృతదేహాలను ఖమ్మం కలెక్టరేట్ ముందు పెట్టి నిరసన తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment