సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్): అడవి పందుల నుంచి మొక్కజొన్న చేనును రక్షించుకునేందుకు విద్యుత్ తీగతో అమర్చిన కంచె ఓ రైతు ప్రాణం తీయడంతో పాటు మూడు మేకల మృతికి కారణమైంది. ఈ సంఘటన మండల పరిధి ఛాగల్లు శివారు కమ్మరిపేటలో గురువారం చోటుచేసుకుంది. కమ్మరిపేటకు చెందిన పెసరు సోమయ్య(50) చిన్నాన్న పెసరు మల్లయ్య.. గ్రామానికి చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేస్తున్న మల్లయ్య అడవి పందుల సమస్య నివారణకు చేనుచుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేసుకున్నాడు.
గురువారం సాయంత్రం మేకలను తోలుకుని అటువైపు వచ్చిన పెసరు సోమయ్య చేను పక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మూడు మేకలు సైతం విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఎస్సై రమేష్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సోమలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment