విద్యుత్‌ షాక్‌తో.. కాటేస్తున్న కంచె! | Dangerous Current Fencing In Rangareddy | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో.. కాటేస్తున్న కంచె!

Published Mon, Sep 30 2019 7:38 AM | Last Updated on Mon, Sep 30 2019 7:39 AM

Dangerous Current Fencing In Rangareddy - Sakshi

పంట పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ఒకరు, పశువులను కాసేందుకు వెళ్లి మరొకరు, పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ఇంకొకరు.. ఇలా ఎంతో మంది అమాయకులు పొలాల వద్ద విద్యుత్‌ షాక్‌తో మృతిచెందుతున్నారు. కొంతమంది రైతులు అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేను చుట్టూ విద్యుత్‌ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలియని పక్కరైతులు కంచెకు తగిలి ప్రాణాలు విడుస్తున్నారు. పొలాల వద్ద కరెంట్‌ షాక్‌ ఏర్పాటు చేయడం వలన కలిగే నష్టంపై సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. 

సాక్షి, వికారాబాద్‌: అడవి పందుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ తీగలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కంటికి కనిపించనంత సన్నని వైర్లను పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసి వీటికి కరెంట్‌ షాక్‌ పెడుతున్నారు. ఈ తీగలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఓవైపు విద్యుత్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో పొలాలకు ఇష్టానుసారంగా విద్యుత్‌ షాక్‌లు పెడుతున్నారు. దీంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా 42 మంది విద్యుత్‌ షాక్‌తో మృతిచెందారు. వీరిలో 30 మంది రైతులే ఉండటం గమనార్హం. విద్యుత్‌ స్తంభాలు పాతడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా కొంతమంది రైతులు మరణిస్తే.. పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ షాక్‌ బారిన పడి ఎక్కువ శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాల రక్షణకు విద్యుత్‌ తీగలు వేయడమే పరిష్కారమా..? అనే విషయాన్ని రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో పంట పొలాల చుట్టూ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయరాదనే విషయాన్ని సంబంధిత అధికారులు హెచ్చరించకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఇలాగే కొనసాగే ప్రమాదముంది. 

ఇటీవల జరిగిన సంఘటనలు.. 

  • ఐదు నెలల క్రితం ధారూరు మండల పరిధిలోని కొండాపూర్‌కుర్దు గ్రామానికి చెందిన అల్లాడి సుధాకర్‌రెడ్డి అతని భార్య ఇందు పంట పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందారు. పాత విద్యుత్‌ వైర్లను తొలగించి కొత్త వైర్లు బిగించిన విద్యుత్‌ సిబ్బంది పాతవైరును తొలగించకుండా వదిలేశారు. ఎర్త్‌ కోసం ఏర్పాటు చేసిన మరోవైరు వేలాడుతూ ఈ వైర్లకు తాకడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  
  • కూలీకోసం వెళ్లిన ఓ మహిళ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్‌ మండలం గుండేపల్లిలో గత శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజిలమ్మ ఇదే ఊరికి చెందిన మరో రైతు పొలానికి కూలీ పనికి వెళ్లింది. రైతు తన జొన్న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలను తగిలిన ఆమె ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి.   
  • బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు విద్యుత్‌ షాక్‌ గురై చనిపోయిన సంఘటన ఈ నెల 23న చోటు చేసుకుంది. వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచెను గమనించకుండా వెళ్లిన శివకుమార్, నర్సింలు షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. 
  • యాలాల మండలం దౌల్తాపూర్‌ అనుబంధ గ్రామమైన గిరిజాపూర్‌లో శ్రీశైలం అనే రైతు తన పంట పొలానికి విద్యుత్‌ సరఫరా సరిచేసుకునే క్రమంలో కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయాడు.  
  • ఆరు నెలల క్రితం తాండూరు మండలానికి చెందిన ఓ యువకుడు విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి పిల్లలు పట్టుకుంటే ప్రమాదమని ఆ తీగలను పక్కకు వేసే ప్రయత్నం చేశాడు. తీగలకు సరఫరా ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో రెండు చేతులు, రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి.   
  • గత వారం రోజుల క్రితం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లిలో మాన్య అనే వ్యక్తి విద్యుత్‌ షాక్‌ తగిలి చనిపోయాడు. ఇదే గ్రామనికి చెందిన ఓ రైతు పంట పొలానికి వేసి విద్యుత్‌ వైర్లు తగలడంతో మృత్యువాత పడ్డాడు.    


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement