షాకిస్తున్న నిర్లక్ష్యం | Power Shock Deaths in YSR Kadapa | Sakshi
Sakshi News home page

షాకిస్తున్న నిర్లక్ష్యం

Published Fri, Sep 13 2019 12:57 PM | Last Updated on Fri, Sep 13 2019 12:57 PM

Power Shock Deaths in YSR Kadapa - Sakshi

మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె పొలాల్లో ఒరిగిపోయిన స్తంభాలు

వెలుగులు పంచాల్సిన విద్యుత్‌ స్తంభాలు..తీగలు కొందరి బతుకు లను విషాదంలోకి నెడుతు న్నాయి. తరచూ జరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలకు పలువురు మృత్యువాత పడుతున్నారు. గత మూడు నెలల్లో ఒక్క రాయచోటి డివిజన్‌ పరిధిలోనే ఎనిమిది ప్రమా దాలు జరిగాయి. తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యు దాఘాతం సంఘటనల వెనుక విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సకాలంలో స్పందించ డంలో అలసత్వం ప్రదర్శించుతుండ టంతో ప్రమాదాల సంఖ్య పెరుగు తోంది. గత ఐదేళ్లలో సుమారు 200 మంది విద్యుత్‌ ప్రమాదాల్లో చనిపోవడమే ఇందుకు తార్కాణం.

కడప అగ్రికల్చర్‌/రాయచోటి : విద్యుత్‌ సరఫరా నిర్వహణ తీరు అధ్వానంగా తయారైంది. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది.  విద్యుత్‌శాఖ అధికారుల..సిబ్బంది ముందుచూపుతో స్పందించకపోవడం వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి.  జిల్లాలో తరచూ విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో వాలిపోయిన స్తంభాలు...దిగువకు వేలాడుతున్న  తీగలు, ఎర్త్‌లేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. సకాలంలో సరైన ప్రణాళికలు తయారు చేయకపోవడం, కాంట్రాక్టర్లు పనులు చేసే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిబంధనలుపాటించకుండా నల్లరేగడి, ఒండ్రుమట్టి, ఇసుక నేలల్లో విద్యుత్‌ స్తంబాలు పాతడంతో అవి కొద్దికాలానికే ఒరిగిపోయాయి. వాటిని వెంటనే సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేలాడుతున్న తీగలను కనీసం సరిచేయాలనే స్పృహ లోపిస్తోంది.  అవి కొందరి పాలిట యమపాశాలవుతున్నాయి. ప్రమాదం జరిగినా వెంటనే స్పందించడం లేదు. కడప, రాయచోటి, పులివెందుల, మైదుకూరు, యర్రగుంట్ల, కమలాపురం డివిజన్ల పరిధిల్లోని మండలాల్లో విద్యుత్‌ స్తంబాలు ఒరిగిపోయి కనిపిస్తున్నాయి. తరచూ మూగజీవాలు విద్యుదాఘానికి బలవుతున్నాయి. మనుషులు కూడా మత్యువాత పడుతున్నారు. రాత్రిపూట గాలులకు విద్యుత్‌ తీగలు చెట్లను తాకుతూ ప్రమాద సంకేతాలు పంపుతున్నా చర్యలు తీసుకోవడం లేదు.

వాలిన విద్యుత్‌ స్తంబాలు....నేలను తాకుతున్న తీగలు..
గ్రామీణ ప్రాంతాల్లో  8,9,11,12 మీటర్ల పొడవున్న స్తంభాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్తంభానికి ..స్తంభానికి మధ్య 45–60 మీటర్ల దూరం ఎడం ఉండాలి. కానీ 60 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో గుంతలు తీసి స్తంభాలను ఏర్పాటుచేస్తున్నారు. దీనివల్ల స్తంబాలు వాలిపోయి, తీగలు వేలాడుతున్నాయి. స్తంభాలను పాతే సమయంలో ప్రమాణాలు పాటించడంలేదనే విమర్శలున్నాయి. నల్లరేగడి, ఇసుక, బంకమట్టి నేలల్లో గుంతలు తీసి కంకర, సిమెంటు, ఇసుక కలిపిన కాంక్రీటు వాడకుండా నేరుగా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో గుండు రాళ్లు వేసి మట్టి కప్పుతుండడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. దీంతో చిన్నపాటి గాలి, వర్షాలకే తీగలు తెగి పడిపోతున్నాయి.

తప్పని ప్రమాదాలు..
విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, అడ్డంకులు రానివ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కొన్నిచోట్ల బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడంలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. దెబ్బతిన్న స్తంబాలను, లైన్లను గుర్తించి ప్రణాళికబద్దంగా వ్యవహరించకపోవడంతో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతినెల రెండో శనివారం, ఆదివారం సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేస్తున్నామని అ«ధికారులు చెబుతున్నా...  అవన్నీ తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. నగరం, మున్సిపాలిటీల్లో కొంతమేరైనా స్పందిస్తున్నా మండల, గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు సక్రమంగా చేపట్టడం లేదు.  కడప నగరంలోనూ, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర పట్టణాల్లో అక్కడక్కడ ట్రాన్స్‌పార్మర్ల వద్ద రాత్రి పూట నిప్పు రవ్వలు వెదజల్లుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు.

ఐదేళ్లలో 200 ప్రాణాలు గాలిలో
ఐదేళ్లలో 50 మంది విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి రికార్డులకు ఎక్కని సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. నాలుగేళ్ల కిందట సుండుపల్లి మండల పరిధిలో మామిడి తోటలో విద్యుత్తు ప్రమాదానికి గురై నలుగురు చనిపోయారు. వారి వివరాలు లేవు. 2013–14లో విద్యుదాఘాతానికి ఎనిమిమంది,  2014–15లో 9 మంది,  2015–16లో ముగ్గురు.. ..2016–17లో ఒకరు చనిపోయారు. 8 పశువులు మత్యువాతపడ్డాయి. 2017–18లో 18 మంది, ఈఏడాది ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. విద్యుత్‌శాఖ తప్పిదముంటే రూ.5 లక్షలు, పశువులకు మార్కెట్‌ ధరను బట్టి లెక్కకట్టి పరిహారం అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.స్టార్టర్‌ లేదా. మోటారు వల్లగాని ప్రమాదం సంభవిస్తే పరిహారం రాదని చెబుతున్నారు. అధికారుల తప్పిదాలను మాత్రం బయటపెట్టక పోవడం గమనార్హం.

పాడెగేదె మృతితో ఉపాధి కోల్పోయాం
నాకు ఇద్దరు కుమారులు..ఒక పాడిగేదెపై ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటి దగ్గరలో ఒక విద్యుత్‌ స్తంభముంది. ఏం జరిగిందో తెలియదు గాని గతనెల 27వ తేదీన ఆ స్తంభం నుంచి విద్యుత్‌ సరఫరా అయింది. అదే సమయంలో మాగేదె దానిని తాకింది. అంతే వెంటనే ప్రాణాలు కోల్పోయింది. మాకు ఉపాధి దూరమైంది. విద్యుత్‌ శాఖ అధికారులు ఆదుకోవాలని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా చూడాలి. – జింకల మాభి, రామచంద్రాపురం, కడప

తప్పక చర్యలు తీసుకుంటాం...
ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. ఆయా డివిజన్, సబ్‌ డివిజన్‌ అధికారులతో చర్చిస్తాం. సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దురదృçష్టవశాత్తూ ప్రమాదాలు జరగడం బాధాకరం. మా  శాఖ తప్పిదం ఉంటే తప్పని సరిగా బాధ్యత వహిస్తాం.   –శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ ఇంజనీరు, జిల్లా విద్యుత్‌శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement