ఎంజీఎం: కూతురు పుట్టిన రోజును జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా బయల్దేరారు. కారులో మంచిచెడులు.. పుట్టిన రోజు ప్లానింగ్ చర్చించుకుంటూ వస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం వారి గమ్యస్థానం చేరకముందే అనంతలోకాలకు చేర్చింది. అమ్మా, నాన్న, నానమ్మను బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఇక్కడ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లలో ఉన్న వారు వీరి మరణవార్త విని షాక్‌కు గురయ్యారు.
ఏడాదిన్నర క్రితమే తండ్రిని కబళించిన కరోనా..
వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ఎల్లంకుల గోపీనాథ్ (38) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భార్య శ్వేత రమ్యశ్రీ (32), పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. తండ్రి ఏడాదిన్నర క్రితం కరోనా బారిన పడి చనిపోయాడు. దీంతో తల్లి తారకేశ్వరి (56)ని బెంగళూరుకు తీసుకెళ్లాడు. గోపీనాథ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు సాహిత్, కూతురు హాసిని. హాసిని గతేడాది జన్మించింది. ఈనెల 25న తనది మొదటి పుట్టిన రోజు. అందరి బంధువుల మధ్య వైభవంగా జరుపుకుందామని అనుకున్నారు. దీంతో వరంగల్‌లో ఓ ఫంక్షన్‌హాల్‌ను కూడా బుక్ చేశారు. ఈమేరకు ఇక్కడి బంధువులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.
గోపీనాథ్ కుటుంబంతో సహా శనివారం సొంత కారులో ఉదయం వరంగల్‌కు బయల్దేరారు. దూర ప్రయాణం కావడంతో మధ్యమధ్యలో ఆగుతూ వస్తున్నారు. విధి చిన్నచూపు చూసింది. మార్గమధ్యలో శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపంలో అదుపుతప్పి కల్వర్టు దిమ్మెను వేగంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న గోపీనాథ్‌తో పాటు ముందు సీట్లో కూర్చున్న భార్య శ్వేత రమ్యశ్రీ (32) తీవ్రంగా గాయపడి కారులోనే ప్రాణాలు వదిలారు. గాయపడిన తారకేశ్వరీ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారులు సాహిత్, హాసిని అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు గోపీనాథ్ సోదరుడు దుబాయ్‌లో ఉంటారని తెలిసింది. ముగ్గురి మృతదేహాలను వరంగల్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లలో బంధువులు ఉన్నారు.
వర్ధన్నపేట ఘటన మరువకముందే..
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా వర్ధన్నపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో పెరకవాడకు చెందిన ఒకే కుటుంబంలోని దంపతులతోపాటు వారి కొడుకు మరణించిన విషయం తెలిసిందే. ఆఘటన మరువకముందే ఎల్లంబజార్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆ.. చిన్నారులకు దిక్కెవరు?
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు, నానమ్మను సైతం కోల్పోయిన ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు వారికి దిక్కెవరంటూ బంధువులు.. ఆ ప్రాంతవాసులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నా పుట్టినరోజు ఎవరు చేస్తారు?
అమ్మా.. నాన్న.. 25న నా మొదటి పుట్టిన రోజు కదా..
గ్రాండ్‌గా చేయాలని ఎన్నో ప్లాన్‌లు వేసుకున్నారు.
సొంతింటి దగ్గర చేస్తేనే అందరూ వస్తారని చెప్పారు..
మన వాళ్లందరినీ పిలుద్దామని.. ఫోన్లు కూడా చేశారు.
అందరం కలిసి ఆనందంగా కారులో బయల్దేరాం..
నానమ్మ కథలు చెబుతుంటే ఊహల్లో ప్రయాణించా..
నిద్రపోతూ..లేస్తూ.. అన్నయ్యను అల్లరి పట్టిస్తూ వస్తున్నా..
ఇప్పుడు నేను ఆస్పత్రిలో ఉన్నా.. ఏమైందో తెలియట్లేదు..
నేనొక బెడ్‌పై, అన్నయ్య మరో బెడ్‌పై..
మాకు ఏమేమో పెట్టారు.. సూదులు గుచ్చుతున్నారు.
నొప్పిగా ఉంది.. అమ్మ నాకు పాలివ్వట్లేదు..
మీ అమ్మా.. నాన్న దేవుడి దగ్గరకు వెళ్లారంటున్నారు
మా దేవుళ్లు మీరే కదమ్మా..
మరి మమ్మల్ని వదిలి ఎక్కడికెళ్లారు?
ఇప్పుడు నాకు, అన్నయ్యకు దిక్కెవరు?
నా పుట్టిన రోజును ఎవరు జరుపుతారు?
– శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్న, నానమ్మను కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి మాటలొస్తే తన ఆవేదనకు అక్షర రూపమిది..
Comments
Please login to add a commentAdd a comment