వేసవిలో, పొలంలో పంటలు లేనప్పుడు భూసార పరీక్షలు చేయించుకోవాలి. వీటి ద్వారా భూమిలోని సారాన్ని తెలుసుకొని తదనుగుణంగా ఎరువులు వేయాలి.
భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించే ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు తదితరాలను తీసివేయాలి.
పార లేదా తాపీని ఉపయోగించి మట్టి నమూనాను సేకరించవచ్చు.
"V' ఆకారంలో 6-8 అంగుళాల లోతు వరకు గొయ్యి తీసి.. గొయ్యిలో ఒక పక్కగా అంగుళం మందాన అడుగు వరకు మట్టి తీయాలి.
ఇదేవిధంగా 8-10 చోట్ల నమూనాలు సేకరించి ఒక శుభ్రమైన గోనెపట్టా మీద వేసి బాగా కలపాలి.
మట్టి తడిగా ఉంటే నీడలో కాగితం పైన గానీ, గుడ్డపైన గానీ ఆరబెట్టిన తర్వాత గడ్డలు చిదిపి.. మట్టిని బాగా కలపాలి. తర్వాత మట్టిని వృత్తాకారంగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించి ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారేయాలి.
ఈ విధంగా అరకిలో మట్టిని సేకరించి శుభ్రమైన గుడ్డ సంచిలో వేసి రైతు వివరాలు రాసి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.
షేడ్‌నెట్స్: వేసవి కాలంలో షేడ్‌నెట్ల కింద కూరగాయల సాగును లాభదాయకంగా చేపట్టవచ్చు. అన్ని రకాల కూరగాయల సాగుకు 35% షేడ్‌నెట్లను ఉపయోగించాలి.
50% షేడ్‌నెట్లను ఉపయోగించి వేసవిలో సాగుకు అనుకూలం కాని పుదీనా, కొత్తిమీర లాంటి వివిధ రకాల ఆకుకూరలు లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు.
ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూరగాయ పంటలపై వేసిన షేడ్‌నెట్లను తొలగించాలి. లేకపోతే పూత, కాపు తగ్గిపోతుంది.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551
మొండికేసిన తెల్లమచ్చల వ్యాధి
వెనామీ రొయ్యల చెరువుల్లో విలయం సృష్టిస్తున్న తెల్లమచ్చల వ్యాధి ఉధృతి ఐదారు వారాలైనా తగ్గడం లేదు. సాధారణంగా ఈ వ్యాధి 2 వారాల్లో సమసిపోయేది. సాగు విస్తీర్ణం, సీడ్ సాంద్రత పెరగడం కూడా ఇందుకు ఓ కారణం.
హేచరీల నుంచి వ్యాధి రహిత రొయ్య పిల్లల(ఎస్‌పీఎఫ్)ను తెచ్చిన రైతుల కల్చర్ క్షేత్రస్థాయిలో సజావుగా సాగడం లేదు. ఈ అనుభవం దృష్ట్యా మరో మార్గం తెల్లమచ్చల వ్యాధి నిరోధక శక్తి కలిగిన తల్లి రొయ్యల(ఎస్‌పీఆర్)ను రైతులకు అందుబాటులోకి తెవడమే.
వెనామీ చెరువులను తెల్లమచ్చల వ్యాధి అతలాకుతలం చేస్తున్నప్పటికీ అదృష్టవశాత్తూ ఈఎంఎస్ లక్షణాలు ఎక్కడా కనపడకపోవడం గమనార్హం.
తెల్లమచ్చల వ్యాధిని తగ్గించడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి వ్యాక్సిన్లు, మందులు, ప్రోబయోటిక్స్ లేవు.
2005-09 మధ్య టైగర్ కల్చర్ కనుమరుగై వ్యాధుల ఉధృతి తగ్గింది. గత 3,4 ఏళ్లలో వెనామీ సాగు సజావుగా సాగడానికి ఇదే కారణం.
- ప్రొ. పి. హరిబాబు (98495 95355),
మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
వేసవిలో పశువుల సంరక్షణ పద్ధతులివీ..
ముర్రా, మాలి జాతి గేదెలు, ఇంగ్లిష్ ఆవులు ఎండకు తాళలేవు. వేసవి తీవ్రత వల్ల పాల దిగుబడి తగ్గుతుంది, ఎద లక్షణాలు కనిపించవు, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది.
చుట్టూ చెట్లుండే పాకల్లో పశువులను కట్టేస్తే మంచిది. గోనె సంచులను తడిపి పాకలకు వేలాడదీయాలి. ఉ. 10 గంటల్లోపు, సా. 4 గంటల తర్వాత మేతకు వదలాలి.
వేడి వల్ల జీర్ణ రసాయనాల ఉత్పత్తి తగ్గుతుంది. చల్లటి నీటితో కడిగితే వీటి ఉత్పత్తి బాగుంటుంది.
ఇంగ్లిష్ ఆవులకు వేసవిలోనూ పచ్చిమేత వేయడం తప్పనిసరి.
గేదెలను ఒకటి, రెండు సార్లు నీటితో కడగాలి. మధ్యాహ్నం 2,3 గంటలు చెరువు నీటిలో పడుకునే వీలు కల్పించాలి. పాలు తీసే ముందు నీటితో కడగడం వల్ల పాల దిగుబడి కొద్దిమేర పెరిగే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.
వేసవిలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లుండే దాణా పెట్టకూడదు. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే దాణా పెట్టాలి.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
వ్యాధి సోకిన చేపలను గుర్తించడం ఇలా..
వ్యాధిసోకిన చేపలను వ్యాధి నిర్థారణ కోసం నిపుణులకు వద్దకు తీసుకెళ్లడంలో రైతులు మెలకువలు పాటించాలి.
వ్యాధి లక్షణాలు స్పష్టంగా ఉండి, బతికి ఉన్న చేపలను నిపుణులకు చూపిస్తే వ్యాధి నిర్థారణ, చికిత్స సులువు అవుతాయి. చనిపోయి, కుళ్లకుండా తాజాగా ఉన్న చేపలనూ చూపించవచ్చు.
నీటి ఉపరితలంపైన, గట్ల వెంట నీరసంగా ఈదుతున్న చేపలు, ఎగురుతున్న చేపలు, ఈత తప్పుగా ఈదుతున్న చేపలు సాధారణంగా వ్యాధులకు గురైనవై ఉంటాయి. వీటి సేకరణ ఉదయపు వేళల్లో సులభం.
వ్యాధికి గురైన చేపలపై కురుపులు, గాయాలు, రక్తం చెమరింపు ఉంటాయి. మొప్పలపై పరాన్న జీవులుంటాయి. రంగు మారిపోయి ఉంటుంది.
- డా. రావి రామకృష్ణ (98480 90576),
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి),
సాక్షి టవర్‌స, 6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com
ఈ వారం వ్యవసాయ సూచనలు
Published Mon, Apr 7 2014 5:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement