వానొచ్చె...మన్యం మురిసె
- ముమ్మరంగా వ్యవసాయ పనులు
- మేలు చేసిన భారీ వర్షం
పాడేరు: నిన్నటి వరకు ఎండలు మండిపోతూ పలు చోట్ల వరినారు మళ్లు వాడిపోతున్న సమయంలో బుధవారం అర్థరాత్రి మన్యంలో కురిసిన భారీ వర్షం ఖరీఫ్ వ్యవసాయానికి ఎంతో మేలు చేసింది. మన్యమంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములన్నీ తడిసి ముద్దయ్యాయి. పల్లపు భూముల్లోని నీటి నిల్వలు అధికమయ్యాయి. మెట్ట ప్రాంతాల భూములు కూడా దుక్కి పనులకు అనుకూలంగా మారాయి.
మొదటి దఫా దుక్కులు చేపట్టి దమ్ము పనులకు సిద్ధమవుతున్న సమయంలో కురిసిన భారీ వర్షం గిరిజన రైతాంగాన్ని ఎంతో ఆనంద పరుస్తుంది. గురువారం ఉదయాన్నే వాన తెరిపినివ్వడంతో రైతులంతా వ్యవసాయ పనులకు పరుగులు తీశారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి దుక్కు పూర్తయిన చోట వరినాట్లకు ఈ భూములను సిద్ధం చేసి పనులను చేపట్టారు. వరి నారుకు కూడా వర్షాలు అనుకూలమయ్యాయి. దమ్ము పనులు పూర్తయిన చోట వరినాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట వ్యవసాయ పనులకు కూడా గిరిజనులు శ్రీకారం చుట్టారు.
మన్యం చల్లబడింది...
అర్థరాత్రి నుంచి విస్తారంగా మన్యం అంతటా భారీ వర్షం కురవడంతో ఏజెన్సీ తడిసి ముద్దయ్యింది. పాడేరు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోను ఉదయం 10 గంటల సమయంలో ఏకధాటిగా వర్షం కురిసింది. పాడేరు మండలంలో 45.4 మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో 17.6 మి.మీ, పెదబయలులో 16.2 మి.మీ, హుకుంపేటలో 4.2 మి.మీ, డుంబ్రిగుడలో 5 మి.మీ, అరకులోయ 10.2 మి.మీ, జి.మాడుగులలో 20.2 మి.మీ, చింతపల్లిలో 6.2 మి.మీ, జీకేవీధిలో 11.8 మి.మీ, కొయ్యూరులో 2.2 మి.మీల వర్షపాతం నమోదైంది. సాయంత్రం వరకు తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురుస్తునే ఉంది.