పత్తాలేని విత్తనం | Kharif action plan ready | Sakshi
Sakshi News home page

పత్తాలేని విత్తనం

Published Tue, May 24 2016 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Kharif action plan ready

కావాల్సినవి 79,900 క్వింటాళ్లు
వచ్చినవి 1700 క్వింటాళ్లు
జిల్లాకు చేరని ఎరువులు
నెలాఖరుకల్లా   50 శాతం విత్తనాలు.. జేడీ
ఈసారీ తిప్పలు తప్పవేమోనని రైతుల ఆందోళన

 

ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇప్పటికే వేసవి దుక్కులు చురుగ్గా సాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ మొదటి వారానికల్లా తొలకరిపలుకరిస్తే నారు మళ్లు పోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కానీ డిమాండ్ తగ్గట్టు విత్తనాలు.. ఎరువులు ఇప్పటికీ జిల్లాకు చేరలేదు. నెలాఖరు కల్లా50 శాతం అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా విత్తనాల కోసం తిప్పలు తప్పవేమోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

 

విశాఖపట్నం :  జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు కాగా, గతేడాది 2,08,988 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆచరణ కొచ్చేసరికి కేవలం 1.75 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ 1.99 లక్షల హెక్టార్లలో సాగుచేయాలన్న పట్టుదలతో వ్యవసాయ శాఖ ఖరీఫ్ యాక్షన్  ప్లాన్ సిద్ధంచేసింది. లక్షకు పైగా హెక్టార్లలో వరి, 37వేల హెక్టార్లలో చెరకు, 42 వేల హెక్టార్లలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు), 17 వేల హెక్టార్లలో అపరాలు సాగుచేయాలని నిర్ణయించారు.  2014-15 ఖరీఫ్‌లో వరి 2,97,123 మెట్రిక్‌టన్నులు దిగుబడి రాగా, 2015-16లో 3,28,754 ఎంటీలకు పెరిగింది. 2016-17లో  3,07,958 ఎంటీలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు.


సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి
వరి, చెరకు, రాగులు, తృణ ధాన్యాలు, మొక్కజొన్న, ఆయిల్ సీడ్స్ ఇలా అన్నింటి విస్తీర్ణం గతంలో కంటే పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు ఒకేరకం విత్తనాలు వరుసగా వాడితే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉండడంతో ఈ సారి కొత్తరకాలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించారు. దుక్కుల సమయంలో భూసారాన్ని పెంచేందుకు చల్లే పచ్చిరొట్ట విత్తనాలు (జిలుగు, జనుము, పిల్లి పెసర) ఈ ఏడాది 1427 క్వింటాళ్లకు ఇండెంట్ పెడితే ఇప్పటి వరకు 680 క్వింటాళ్ల విత్తనాలొచ్చాయి.

 
అరకొర విత్తనాలు

ఎలాంటి సబ్సిడీ లేని పదేళ్లు పైబడిన ఆర్‌జీఎల్ 2537, ఆర్‌జీఎల్ 2538, బీపీటీ 5204, బీపీటీ 3291 రకాల 23 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుందని అంచనా వేసిన వ్యవసాయ శాఖ  వీటి కోసం ఏపీ సీడ్స్‌కు ఇండెంట్ పెట్టింది.  ఆర్‌జీఎల్ 2537 రకం విత్తనాలు 1200 క్వింటాళ్లు మినహా మరే ఇతర వంగడాలు ఇంకా జిల్లాకు చేరలేదు. పదేళ్ల లోపు వంగడాలైన ఎంటీయూ 1061, 1064, 1075, ఎన్‌ఎల్‌ఆర్ 34449, 33892 రకాల విత్తనాలు 4740 క్వింటాళ్ల కోసం ఇండెంట్ పెడితే ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ విత్తనం కూడా జిల్లాకు చేరలేదు. పదేళ్ల లోపు రకాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

 
ఇక వేరుశనగ, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, రాగులు, నువ్వులకు సంబంధించి 32,405 క్వింటాళ్లు కావాలని ఇండెంట్ పెట్టగా అన్నీ కలిపి పట్టుమని నాలుగైదువందల క్వింటాళ్లు కూడా రాలేదు.  వేరుశనగ 80 క్వింటాళ్లు, కందులు 75, పెసర 10, మినుము 20,రాగులు 25, నువ్వులు ఒక క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. మొక్కజొన్నయితే ఒక్క క్వింటాలు కూడా జిల్లాకు రాలేదు.

 
ఎరువుల పరిస్థితీ అంతే..

రియా 2014-15లో 45,253 మెట్రిక్ టన్నులు వాడితే 2015-16లో 42,130 ఎంటీలకు తగ్గింది. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం యూరియా 50,342 ఎంటీలు, డీఏపీ 12,334 ఎంటీలు, ఎంవోపీ 12,096 ఎంటీలు, ఎస్‌ఎస్‌పీ 11,670 ఎంటీలు, కాంప్లెక్స్ ఎరువులు 10,889 ఎంటీలు ఇండెంట్ పెట్టారు.జింకు 300 ఎంటీలు, జిప్సం 400 ఎంటీలు, బోరాన్ ఐదు ఎంటీలు కావాలని ఇండెంట్ పెట్టారు. కానీ  ఏ రకం ఎరువు కూడా  ఇంకా జిల్లాకు చేరలేదు.  గతేడాది రూ. 8.49 కోట్ల విలువైన 7,200 వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేస్తే ఈ ఏడాది 12.52 కోట్లతో 8,750 పరికరాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతిపాదనల దశకూడా దాటలేదు.

 

ఈసారి కొరత రానీయం.. జేడీ
ఖరీఫ్ కసరత్తు పూర్తయింది. విత్తనాల కోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టాం. ఇటీవలే ఏపీ సీడ్స్ అధికారులను పిలిపించి ఇండెంట్ విషయమై చర్చించాం. ఇండెంట్ మేరకు జిల్లాకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్ అధికారులు హామీ ఇచ్చారు. నెలాఖరుకల్లా 50 శాతం విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. మిగిలిన విత్తనాలను వచ్చే నెలాఖరులోగా వచ్చేలా చేస్తామని చెప్పారు. ఈసారి  విత్తనాలు, ఎరువుల కొరత రానీయకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 - వి.సత్యనారాయణ, జేడీ, వ్యవసాయ శాఖ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement