పోషక విలువలు కలిగిన పండు అంజీర. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా సాగవుతున్న ఈ పంట సాగు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. హైదరాబాద్ నగరంలో మంచి గిరాకీ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలువురు రైతులు సాగు ప్రారంభించారు. వారిలో ఒకరు విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల క్రితం 4 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన ఆయన.. 3 ఎకరాల్లో పుణే లోకల్ వెరైటీ అంజీర తోటను పది నెలల క్రితం నాటారు.
మహారాష్ట్రతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో అంజీర తోటలను స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకున్న తర్వాత ఆయన సాగు చేపట్టారు. బళ్లారి నుంచి రూ.40ల ఖర్చుతో తీసుకొచ్చిన 1,500 మొక్కలను మూడెకరాల్లో నాటారు. గత ఏడాది జూన్‌లో ఒక ఎకరంలో, సెప్టెంబర్‌లో రెండెకరాల్లో నాటారు. మొదట నాటిన ఎకరం తోటలో ప్రస్తుతం తొలి విడత పండ్ల కోత ప్రారంభమైంది. సాళ్ల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో గుంతకు కిలో వర్మీకంపోస్టు వేసి నాటారు. చిగుళ్లను తుంచి వేయడం వలన సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పిలకలు వచ్చేలా చూసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా రెండు రోజులకొకసారి నీటి తడిని అందిస్తున్నారు.
ప్రతి మూడు నెలలకోసారి చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేశారు. ప్రస్తుతం ప్రతి డ్రిప్పర్ దగ్గర ఐదు కిలోల చొప్పున చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఇటీవలే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని యాదగిరి ఆశిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెరుగుతుండటంతో పురుగు మందుల అవశేషాలు లేని పండ్లను తినేందుకు ఎంత ఖర్చయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే అంజీర పండ్లను యాదగిరి (96528 60030) విక్రయిస్తున్నారు.
– కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్
Comments
Please login to add a commentAdd a comment