Anjira
-
అంజీర్ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంజీర్ ఆకులతో టీ వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి. ఎండబెట్టి పొడి చేసుకుని అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు. అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్‌ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. టీబీ నివారణలో అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు. -
సులువులైన చిట్కాలతో చాక్లెట్ సమోసా-అంజీర్ హల్వా
చాక్లెట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 1 కప్పు, పంచదార పొడి – 5 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, డార్క్ చాక్లెట్ పౌడర్ – 1 కప్పు, పిస్తా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ పంచదార పాకం – అభిరుచిని బట్టి (అప్పటికప్పుడు కావాల్సినంత పంచదార, నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, నీళ్లు పోసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని ఓ పావు గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ పౌడర్, పంచదార పౌడర్, పిస్తా ముక్కలు వేసుకుని అటు ఇటుగా కలిపి.. పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఫ్రిజ్‌లోంచి మైదా ముద్దను తీసి.. చిన్న చిన్న పూరీల్లా చేసుకుని.. ప్రతి పూరీలో కొంత చాక్లెట్ మిశ్రమం పెట్టుకుని సమోసాలా చుట్టుకోవాలి. అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని.. ఒకవైపు నూనె కళాయి, మరోవైపు పంచదార పాకం ఉన్న కళాయి పెట్టుకుని సమోసాలను నూనెలో దోరగా వేయించి.. వెంటనే పాకంలో వేసి తీసుకోవాలి. ఒకవేళ పాకంలో వేసుకోవడం ఇష్టం లేకుంటే చాక్లెట్ సాస్ని పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంజీర్ హల్వా కావలసినవి: డ్రై అంజీర్ – 400 గ్రా.(నానబెట్టి, ముక్కలు చేసుకోవాలి) బియ్యప్పిండి/మొక్కజొన్న పిండి – 5 టేబుల్ స్పూన్లు(5 టేబుల్ స్పూన్ల నీళ్లనూ జతచేసి బాగా కలుపుకోవాలి), నెయ్యి – 9 టేబుల్ స్పూన్లు లేదా అంతకు మించి, పచ్చిపాలు – అర కప్పు, పంచదార – అభిరుచిని బట్టి, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్), యాలకుల పొడి – కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి కాగానే.. అందులో బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి మిశ్రమం వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు పోసుకుని చిన్న మంటపైన గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో అంజీర్ ముక్కలు, ఫుడ్ కలర్ వేసుకుని మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొద్దిగా పంచదార వేసుకుని, మిగిలిన నెయ్యి కూడా వేసుకుని గరిటెతో కలుపుతూ దగ్గర పడే సమయంలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు లేదా.. నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌తో కలిసి తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా. -
ఆరోగ్య కోట అంజీర
-
ఒక్కసారి నాటితే 15 ఏళ్లవరకు దిగుబడి.. కిలో రూ.50 నుంచి 100
నల్లగొండ రూరల్: సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేసే ఫలాల్లో అంజీర ముందువరుసలో ఉంటుంది. ఈ పండ్ల తోటలు ఎక్కువగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తాయి. నల్లగొండ మండలంలోని మెళ్లదుప్పలపల్లిలో మూడు ఎకరాల్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు యాదయ్య నాలుగేళ్ల క్రితం పూణె రకం అంజీర సాగు చేపట్టాడు. ఒక్కసారి నాటిన తర్వాత ఆరు నెలల నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. అంజీర పండ్లను వ్యాపారులు తోట వద్దకే వచ్చి కిలో రూ.50 నుంచి రూ.100 చెల్లించి కొనుగోలు చేసేవారు. పండ్లు కావాల్సిన వారు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించేవారు. యాదయ్య తోటలో మరో 15 రోజుల్లో దిగుబడి రానుంది. సేంద్రియ పద్ధతిలో సాగు అంజీర సాగు చేయాలని భావించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య వివిధ ప్రాంతాల్లో ఈ తోటలను పరిశీలించారు. సాగు పద్ధతులు, మార్కెట్ గురించి తెలుసుకున్నాడు. పూణె లోకల్ వెరైటీ అంటు మొక్కలను కర్నాటకలోని బళ్లారి నుంచి చెప్పించాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాడు. ఎక్కువ దిగుబడి కోసం చిగుళ్లను తుంచడం ద్వారా కాండానికి ఇరువైపులా పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. ఈ తోటకు పెద్దగా నీటి తడులు అవసరం లేదు. రెండు రోజులకోసారి డ్రిప్‌ద్వారా తడి అందిస్తున్నారు. ఈ తోటలకు పెద్దగా సస్యరక్షణ చర్యలు అవసరం ఉండవు కానీ పిట్టలు, కోతులు ప్రభావం ఉంటుంది. అయితే ఉద్యానశాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు లేకపోవడంతో తోటల సాగువైపు రైతులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అంజీరతో ప్రయోజనాలు ఎన్నో.. అంజీర పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగు పర్చుతుంది. ఎసిడిటీ, మలబద్ధకాన్ని నిరోధించి రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. పొటాషియం, సోడియం లభిస్తుంది. అధిక బరువును తగ్గించి చెడు కొలస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. మెగ్నిషియం, మాంగనీస్ ఉంటుంది. గుండె సమస్యను నివారించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆసక్తి చూపుతున్నారు పురుగు మందు అవశేశాలు లేని పండ్లు, కూరగాయలు తినేందుకు ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు. తోటలో రెండో దశ దిగుబడి వస్తుంది. చెట్టు ఏపుగా పెరగడంతో కొమ్మలు తొలగిస్తే మళ్లీ దిగుబడి వస్తుంది. – యాదగిరిగౌడ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు -
జీర్ణ వ్యవస్థకు అంజీర్
అంజీర్ రుచి ఎంత బాగుంటుందో... దానివల్ల సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ అంత ఎక్కువగా ఉంటాయి. అంజీర్లతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇక్కడ చెప్పినవి కొన్ని మాత్రమే. చర్మంపై ముడుతలు రావడం వంటి వయసు పెరగడం వల్ల కనిపించే అనర్థాలను నివారించి, అంజీర్ దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది. అంజీర్‌లో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే అంజీర్ తినడం వల్ల మలబద్దకాన్ని తేలిగ్గా తగ్గిస్తుంది. అంతేకాదు... అంజీర్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా శుభ్రం అవుతుంది. నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్యలూ తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తినడం మంచిది. మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటికి వచ్చే అనేక వ్యాధులను నివారిస్తుంది. అంజీర్‌లో కొలెస్ట్రాల్‌తో పాటు కొవ్వులు చాలా తక్కువ. అందువల్ల ఇది చాలా రకాల గుండెజబ్బులను, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులను తగ్గిస్తుంది. కొవ్వులు తక్కువగా ఉండటంతో పాటు ఫీనాల్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాల కారణంగా గుండెజబ్బులు నివారితమవుతాయి. అంజీర్‌తో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ను నివారించే ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. అంజీర్‌లో పొటాషియమ్ ఎక్కువ. సోడియమ్ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో దాని తీవ్రతను తగ్గించడానికి, క్రమంగా నివారించడానికి అంజీర్ బాగా తోడ్పడుతుంది. వీటిల్లో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత (అనీమియా)తో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్‌ను సిఫార్సు చేస్తుంటారు. మూత్రంలో క్యాల్షియమ్ వృధాగా పోవడాన్ని అంజీర్ సమర్థంగా అరికడుతుంది. అంజీర్‌లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది. అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియమ్ వంటి అనేక ఖనిజాలు ఉండటంతో పాటు చాలా మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. -
విస్తరిస్తున్న అంజీర సాగు
పోషక విలువలు కలిగిన పండు అంజీర. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా సాగవుతున్న ఈ పంట సాగు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. హైదరాబాద్ నగరంలో మంచి గిరాకీ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలువురు రైతులు సాగు ప్రారంభించారు. వారిలో ఒకరు విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల క్రితం 4 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన ఆయన.. 3 ఎకరాల్లో పుణే లోకల్ వెరైటీ అంజీర తోటను పది నెలల క్రితం నాటారు. మహారాష్ట్రతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో అంజీర తోటలను స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకున్న తర్వాత ఆయన సాగు చేపట్టారు. బళ్లారి నుంచి రూ.40ల ఖర్చుతో తీసుకొచ్చిన 1,500 మొక్కలను మూడెకరాల్లో నాటారు. గత ఏడాది జూన్‌లో ఒక ఎకరంలో, సెప్టెంబర్‌లో రెండెకరాల్లో నాటారు. మొదట నాటిన ఎకరం తోటలో ప్రస్తుతం తొలి విడత పండ్ల కోత ప్రారంభమైంది. సాళ్ల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో గుంతకు కిలో వర్మీకంపోస్టు వేసి నాటారు. చిగుళ్లను తుంచి వేయడం వలన సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పిలకలు వచ్చేలా చూసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా రెండు రోజులకొకసారి నీటి తడిని అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేశారు. ప్రస్తుతం ప్రతి డ్రిప్పర్ దగ్గర ఐదు కిలోల చొప్పున చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఇటీవలే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని యాదగిరి ఆశిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెరుగుతుండటంతో పురుగు మందుల అవశేషాలు లేని పండ్లను తినేందుకు ఎంత ఖర్చయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే అంజీర పండ్లను యాదగిరి (96528 60030) విక్రయిస్తున్నారు. – కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్ -
ఆరోగ్య ఫలం... అత్తిపండు!
తిండి గోల అత్తిపండంటే తెలంగాణలో అందరికీ అంతగా తెలియదేమోగానీ, అంజీరపండంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అందరికీ తెలుసు. అంజీర అనేది హిందీపదం. ఆంగ్లంలో ఫిగ్స్ అంటారు. మర్రి, మేడి, అత్తి ఒకేజాతికి చెందినవి. అతి పురాతనమైన ఫలవృక్షాలలో అత్తి ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. ఆకులు బొప్పాయి ఆకుల్లా ఉంటాయి. 15-25 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. దాదాపు 150 రకాలున్నప్పటికీ నాలుగైదు రకాలే బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉండి , పక్వానికి వచ్చాక తియ్యగా ఉండే ఈ పళ్లు మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెడతారు. ఎండిన కొద్దీ తియ్యగా ఉంటాయి. పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఎ,ఇ,కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారికి ఇవి తినడం వల్ల తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది హృద్రోగులకు చాలా మంచిది. ఎముకలు ఫెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి. అయితే వీటిని మితంగా తినడమే మేలు...