ఆరోగ్య ఫలం... అత్తిపండు!
తిండి గోల
అత్తిపండంటే తెలంగాణలో అందరికీ అంతగా తెలియదేమోగానీ, అంజీరపండంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అందరికీ తెలుసు. అంజీర అనేది హిందీపదం. ఆంగ్లంలో ఫిగ్స్ అంటారు. మర్రి, మేడి, అత్తి ఒకేజాతికి చెందినవి. అతి పురాతనమైన ఫలవృక్షాలలో అత్తి ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. ఆకులు బొప్పాయి ఆకుల్లా ఉంటాయి. 15-25 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. దాదాపు 150 రకాలున్నప్పటికీ నాలుగైదు రకాలే బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి.
లేత ఆకుపచ్చ రంగులో ఉండి , పక్వానికి వచ్చాక తియ్యగా ఉండే ఈ పళ్లు మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెడతారు. ఎండిన కొద్దీ తియ్యగా ఉంటాయి. పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఎ,ఇ,కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారికి ఇవి తినడం వల్ల తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది హృద్రోగులకు చాలా మంచిది. ఎముకలు ఫెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి. అయితే వీటిని మితంగా తినడమే మేలు...