Algae
-
రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నివారణకు ఎలాంటి మందు లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్) తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. ఎందుకుంటే ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్‌ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించడం గమనార్హం. సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఆ తాబేళ్లు చనిపోవడానికి కారణం అదే
మెక్సికో :వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు కారణంగా దాదాపు 300 అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు చనిపోయిన ఘటన గురువారం మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాబేళ్లు కొన్నివేళ సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. అయితే ప్రపంచంలోనే అరుదైన జాతుల్లో ఆకుపచ్చ తాబేళ్లు ఒకటి.1.5 మీటర్ల పొడవు పెరిగే అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు సాధారణంగా మెక్సికో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా సముద్ర అడుగుభాగంలోనే ఉంటూ జీవిస్తుంటాయి. కాగా గత కొన్ని రోజులుగా మెక్సికోలోని ఒక్సాకా సముద్రం తీరంలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో రెడ్ టైడల్ మైక్రోఆల్గే విపరీతంగా పెరిగిపోయింది. రెడ్ టైడల్ ఆల్గే సముద్రంలో ఉండే సాల్ప్ అనే చిన్న చిన్న చేపలను తినేస్తుంటుంది. ఇది తాబేళ్లకు చాలా విషపూరితం, గత కొన్ని రోజులుగా మైక్రో ఆల్గేను తింటున్న ఆకుపచ్చ తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. అయితే అరుదుగా కనిపించే ఆకుపచ్చ తాబేళ్లు ఇలా చనిపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ' ఇప్పటివరకు మైక్రోఆల్గే బారీన పడి 297 తాబేళ్లు చనిపోయాయి. అయితే 27 తాబేళ్లను మాత్రం మైక్రోఆల్గే నుంచి కాపాడి తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాము. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేవరకు అక్కడే పెంచుతామని ' పర్యావరణ అధికారులు వెల్లడించారు. -
విస్తరిస్తున్న అంజీర సాగు
పోషక విలువలు కలిగిన పండు అంజీర. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా సాగవుతున్న ఈ పంట సాగు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. హైదరాబాద్ నగరంలో మంచి గిరాకీ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలువురు రైతులు సాగు ప్రారంభించారు. వారిలో ఒకరు విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల క్రితం 4 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన ఆయన.. 3 ఎకరాల్లో పుణే లోకల్ వెరైటీ అంజీర తోటను పది నెలల క్రితం నాటారు. మహారాష్ట్రతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో అంజీర తోటలను స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకున్న తర్వాత ఆయన సాగు చేపట్టారు. బళ్లారి నుంచి రూ.40ల ఖర్చుతో తీసుకొచ్చిన 1,500 మొక్కలను మూడెకరాల్లో నాటారు. గత ఏడాది జూన్‌లో ఒక ఎకరంలో, సెప్టెంబర్‌లో రెండెకరాల్లో నాటారు. మొదట నాటిన ఎకరం తోటలో ప్రస్తుతం తొలి విడత పండ్ల కోత ప్రారంభమైంది. సాళ్ల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో గుంతకు కిలో వర్మీకంపోస్టు వేసి నాటారు. చిగుళ్లను తుంచి వేయడం వలన సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పిలకలు వచ్చేలా చూసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా రెండు రోజులకొకసారి నీటి తడిని అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేశారు. ప్రస్తుతం ప్రతి డ్రిప్పర్ దగ్గర ఐదు కిలోల చొప్పున చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఇటీవలే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని యాదగిరి ఆశిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెరుగుతుండటంతో పురుగు మందుల అవశేషాలు లేని పండ్లను తినేందుకు ఎంత ఖర్చయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే అంజీర పండ్లను యాదగిరి (96528 60030) విక్రయిస్తున్నారు. – కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్ -
‘పాచి’ .. పంచభక్ష పరమాన్నం..!
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచ జనాభా 2050 కల్లా 9.8 బిలియన్లను చేరుతుందని ఓ అంచనా. ఇదే జరిగితే ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. భారీ సంఖ్యలో పెరుగుతున్న జనాభా ఆకలిని తీర్చడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ‘సముద్రాలు’. అవును. భవిష్యత్‌లో సముద్ర ఆహారం పాత్ర చాలా కీలకంగా మారనుంది. 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం తినేవారి శాతం 60కు పైచిలుకు పెరుగుతుందని ఓ అంచనా. కానీ ఇప్పటికే ప్రపంచంలోని 90 శాతం చేపల నిల్వలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. కాలుష్యం, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ సముద్రాలను త్వరగా వేడిక్కిస్తున్నాయి. దీంతో సాగరాల్లోని జీవ సంపద త్వరగా అంతరించిపోతోంది. సముద్ర ఆహార ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద చేపలపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదు. వాతవరణ మార్పు - సముద్ర ఆహారంపై ప్రభావం సాగరాలు వేడెక్కడం అనేది ప్రదేశాన్ని బట్టి మారుతోంది. నీరు ఆమ్లంగా మారటం సముద్ర ఆహార పదార్థాల ఉత్పత్తిపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా పశ్చిమ తీరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ప్రాంతంలోని జీవ జాతులు లార్వా దశలలోనే చనిపోతున్నాయి. చల్లటి నీటి కోసం జీవ జాతులు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు వలస పోతున్నాయి. ‘పాచి’ పంచభక్ష పరమాన్నం..! కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్లు సముద్ర నీటిని వేడెక్కించడం కిరణ జన్య సంయోగ క్రియ జరిగి పాచి, సయానోబాక్టీరియా, ప్లాంక్టాన్ లాంటివి పెరుగుతాయి. వాస్తవానికి వీటిని ఆహారంగా స్వీకరిస్తూ సాగర జీవ జాలం బ్రతుకుతుంటుంది. ఇప్పుడు ఇదే ప్రక్రియ మనకు ఆహార ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారనుంది. పాచిని మానవాళి ఆహారంగా స్వీకరించేలా మార్చుకోవచ్చు. సీ వీడ్ అనే పాచి రకాన్ని వందల ఏళ్లుగా ఆహారంగా స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే, కేవలం 35 దేశాలు మాత్రమే సీ వీడ్‌ను పెంచుతున్నాయి. స్పిరులినా సయానోబాక్టీరియాను ఇప్పటికే ఆహారంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో పాచిలో మిగిలిన రకాలను కూడా ఆహారపు వనరులుగా మార్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. పాచిని ఆహారపు వనరుగా తీసుకురావడం అనేది అంత సులువైన పనేం కాదు. అయితే, పాచిని ప్రత్యామ్నాయంగా వినియోగించగల్గితే ఆహారపు గొలుసుపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు వీలు కల్గుతుంది.