సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నివారణకు ఎలాంటి మందు లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్)
తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. ఎందుకుంటే ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్‌ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించడం గమనార్హం. సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment