సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారని సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ సి.మాండే అన్నారు. సీఎస్‌ఐఆర్ సంస్థలను ఉద్దేశించి ఆయన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, శాస్త్రవేత్తలు సమాజంతో కలసి పనిచేయడం ద్వారా ఆ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తల కృషికి సామాన్యుల జాగ్రత్త కూడా తోడైతే కరోనాను సులువుగా గెలవవచ్చునని చెప్పారు. 10 నెలల సమయంలోనే కోవిడ్ కారక వైరస్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోగలిగారని, తద్వారా వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సరికొత్త పద్ధతులను ఆవిష్కరించగలిగారని వివరించారు.
టీకా తయారీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారని గుర్తు చేశారు. అయితే ఇంకా ఈ వైరస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని స్పష్టంచేశారు. కోవిడ్ మహమ్మారి నిర్ధారణకు సీఎస్‌ఐఆర్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినొమిక్స్ ఫెలుడా పేరుతో చౌకైన డయాగ్నస్టిక్ కిట్‌ను సిద్ధం చేసిందని తెలిపారు. డీసీజీఐ, ఐసీఎంఆర్‌లు ఆమోదించిన ఈ కిట్‌ను ప్రస్తుతం ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. జలుబు మందు ఫావిపిరావిర్‌ను దేశీయంగానే తయారు చేసి ఫార్మా కంపెనీ సిప్లా ద్వారా మార్కెట్‌లోకి తెచ్చామని చెప్పారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానం ద్వారా వ్యాధి చికిత్సకు సంబంధించి చేస్తున్న పరిశోధనల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
రోజుకో కొత్త విషయం..
కరోనా విషయంలో ఇప్పటికీ రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నామని శేఖర్ సి.మాండే తెలిపారు. లక్షణాలు కనిపించని వారిలో కొందరు తమంతట తామే ఎలా కోలుకుంటున్నారు? వ్యాధి 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకు? మధుమేహం, గుండె జబ్బులున్న వారిలో లక్షణాల తీవ్రత ఎక్కువ ఉండేందుకు, ప్రాణాపాయం ఏర్పడేందుకు కారణాలేంటి..? అనే అనేక అంశాలపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవని వివరించారు. కానీ ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చిన్న చిన్న పనులే చాలని తెలియడం మాత్రం ఊరట కలిగించే అంశమని చెప్పారు. ప్రస్తుత పండుగల సీజన్‌లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఇప్పటికీ చెమటోడ్చి పనిచేస్తూనే ఉన్నారని, జాగ్రత్తలు పాటించకుండా వారికి మరింత శ్రమ ఇవ్వరాదని కోరారు.
శాస్త్రవేత్తల కృషి.. సామాన్యుల జాగ్రత్త
Published Thu, Oct 29 2020 2:27 AM | Last Updated on Thu, Oct 29 2020 2:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment