సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్‌ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా?
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్‌ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్‌ని పంపించారు.
ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది.
శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు.
2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్‌ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్‌గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది.
భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్‌ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు.
ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్‌గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి.
ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు.
ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్‌ని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్‌కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు.
ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్‌కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్‌ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
అరుణ్ కుమార్ గ్రోవర్
మాజీ వైస్ చాన్స్‌లర్, పంజాబ్ యూనివర్సిటీ
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)