పాచి
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచ జనాభా 2050 కల్లా 9.8 బిలియన్లను చేరుతుందని ఓ అంచనా. ఇదే జరిగితే ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. భారీ సంఖ్యలో పెరుగుతున్న జనాభా ఆకలిని తీర్చడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ‘సముద్రాలు’. అవును. భవిష్యత్‌లో సముద్ర ఆహారం పాత్ర చాలా కీలకంగా మారనుంది. 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం తినేవారి శాతం 60కు పైచిలుకు పెరుగుతుందని ఓ అంచనా.
కానీ ఇప్పటికే ప్రపంచంలోని 90 శాతం చేపల నిల్వలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. కాలుష్యం, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ సముద్రాలను త్వరగా వేడిక్కిస్తున్నాయి. దీంతో సాగరాల్లోని జీవ సంపద త్వరగా అంతరించిపోతోంది. సముద్ర ఆహార ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద చేపలపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదు.
వాతవరణ మార్పు - సముద్ర ఆహారంపై ప్రభావం
సాగరాలు వేడెక్కడం అనేది ప్రదేశాన్ని బట్టి మారుతోంది. నీరు ఆమ్లంగా మారటం సముద్ర ఆహార పదార్థాల ఉత్పత్తిపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా పశ్చిమ తీరం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ప్రాంతంలోని జీవ జాతులు లార్వా దశలలోనే చనిపోతున్నాయి. చల్లటి నీటి కోసం జీవ జాతులు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు వలస పోతున్నాయి.
‘పాచి’ పంచభక్ష పరమాన్నం..!
కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్‌లు సముద్ర నీటిని వేడెక్కించడం కిరణ జన్య సంయోగ క్రియ జరిగి పాచి, సయానోబాక్టీరియా, ప్లాంక్‌టాన్ లాంటివి పెరుగుతాయి. వాస్తవానికి వీటిని ఆహారంగా స్వీకరిస్తూ సాగర జీవ జాలం బ్రతుకుతుంటుంది. ఇప్పుడు ఇదే ప్రక్రియ మనకు ఆహార ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారనుంది. పాచిని మానవాళి ఆహారంగా స్వీకరించేలా మార్చుకోవచ్చు.
సీ వీడ్ అనే పాచి రకాన్ని వందల ఏళ్లుగా ఆహారంగా స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే, కేవలం 35 దేశాలు మాత్రమే సీ వీడ్‌ను పెంచుతున్నాయి. స్పిరులినా సయానోబాక్టీరియాను ఇప్పటికే ఆహారంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో పాచిలో మిగిలిన రకాలను కూడా ఆహారపు వనరులుగా మార్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. పాచిని ఆహారపు వనరుగా తీసుకురావడం అనేది అంత సులువైన పనేం కాదు. అయితే, పాచిని ప్రత్యామ్నాయంగా వినియోగించగల్గితే ఆహారపు గొలుసుపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు వీలు కల్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment