
ఫిన్లాండ్‌లో లోన్లీనెస్ బాధితులు ఎక్కువ
పోటీతత్వంలోనూ భారతీయులు ముందుంటారు
అనుబంధాల్లో భారత్ నెంబర్ వన్ : ఫిన్లాండ్ వనిత
దేశాన్ని వదిలినా సంతోషంగానే ఉన్నానని స్పష్టీకరణ
‘సాక్షి’ సంభాషణలో హ్యాపీనెస్‌లో నెం1 అయిన ఫిన్లాండ్ దేశపు మహిళ, తెలుగింటి కోడలు, నగరవాసి రైతా
బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించుకోకపోవచ్చు.. కానీ యేటా మార్చి నెల్లో మాత్రం కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. అదే క్రమంలో తాజా హ్యాపీ నెస్ ఇండెక్స్‌లోనూ ఫిన్లాండ్ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశపు మహిళ.. మన తెలుగింటి కోడలు రైతా ముచ్చర్ల ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఫిన్లాండ్..‘హ్యాపీ’ బ్రాండ్..
మా దేశంలో పేద ధనిక గొప్ప తారతమ్యాలు ఉండవు. వాటికి చిన్నవయసులోనే పాతరేస్తారు.. దాదాపు 90 శాతం విద్యావ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్కూల్స్‌లో, కాలేజీల్లో డబ్బుల్ని బట్టి, హోదాల్ని బట్టి విద్యార్థులను విభజించడం ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఈక్వాలిటీ అనేది బాగా నాటుకుంటుంది. దీని వల్ల 100 శాతం అక్షరాస్యత సాధించగలిగారు. అలాగే చదువుతో పాటు ప్రతి నగరంలోనూ శిక్షణా సంస్థలు ఉంటాయి. విభిన్న రకాల కళలు, సామర్థ్యాలలో రాణించాలనుకునేవారు ఎవరైనా సరే వయసుతో ప్రమేయం లేకుండా నామమాత్రపు రుసుముతోనే నేరి్పంచే శిక్షణా సంస్థలు ఉంటాయి.
అభిరుచులే.. ఆనంద మార్గాలు..
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి/హాబీ మా దేశంలో తప్పకుండా ఉంటుంది. అక్కడ కూడా సినిమాలు ఉంటాయి కానీ.. వాటికన్నా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి. దానికి కళల పట్ల, కళారంగాల పట్ల వ్యక్తుల్లో ఉన్న అభిరుచే కారణం కావచ్చు.
హరితం.. లంచాల రహితం..
పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచడానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ప్రతి నగరానికీ ఆనుకుని ఒక అడవి ఉంటుంది. అందులో నెలకు ఒక్క రోజైనా పిల్లలను స్వేచ్ఛగా విహరించేలా చూస్తారు. రాజకీయాలు సంపాదనకు మార్గంగా భావించడం ఉండదు. రాజకీయాలనే కాదు, ఏ రంగమైనా సరే లంచగొండితనం జీరో అని చెప్పొచ్చు. తద్వారా ఒకరిని ఒకరు దోపిడీ చేస్తారనే భయాలు ఉండవు. అలాగే ఏ అర్ధరాత్రయినా సరే భద్రంగా సంచరించవచ్చు.. దొంగతనాలు, నేరాల రేటు కూడా అత్యంత స్వల్పం. ఒకరినొకరు అనుమానించుకోవడం, అపనమ్మకాలతో బంధాలు వంటివి అక్కడ కనపడవు.
అన్నీ బాగున్నా.. అనుబంధాల్లో మీరే మిన్న..
ఫిన్లాండ్.. చాలా విషయాల్లో బాగున్నా.. అనుబంధాల్లో మాత్రం భారత దేశంతో పోలిస్తే వెనుకబడే ఉందని అనుభవపూర్వకంగా చెప్పగలను. తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నగరానికి వచి్చన యువతిగా.. ఈ దేశపు అనుబంధాలు నాకు ఆశ్చర్యానందాలను కలిగించాయి. పరస్పరం కేరింగ్ ఇక్కడ ఎక్కువ. వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఇక్కడ ఇస్తున్నంత విలువ అక్కడ కనపడదు. అక్కడ విడాకుల సంఖ్య కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా ఉండడం వల్ల 20 నిమిషాల్లో పెళ్లి తంతు ముగించినట్టుగానే బంధాలకూ అంతే వేగంగా, సులభంగా వీడ్కోలు పలుకుతారు. దీనివల్లే అక్కడ ఒంటరితనం బాధితులు ఎక్కువగా కనబడతారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నంత పోటీ తత్వం కూడా అక్కడ ఉండదు. అన్ని రకాలుగానూ ఇతరుల్ని మించి ఎదగాలనే తపన, ఆరాటం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ క్రమంలోనే తమ హోదాలు, అంతస్తులు.. వగైరాలను ప్రదర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. అక్కడ ఇలాంటివి ఏ మాత్రం కనిపించవు.
Comments
Please login to add a commentAdd a comment