పశువుల పునరుత్పత్తిలో పోషణ ప్రాముఖ్యత
మన దేశంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా ఉత్పాదక శక్తి తక్కువ. జన్యుపరమైన, హార్మోను, వ్యాధి, పోషణ సంబంధమైన అంశాలే ఇందుకు కారణం.
దూడలకు చిన్న వయసు నుంచే విటమిన్ ఏ, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మేత మేపాలి. అప్పుడు త్వరగా ఎదిగి, ఎదకు వస్తాయి. గర్భసంచి, ఓవరీస్ బాగా ఎదగ డానికి భాస్వరం తగినంత అందించాలి.చూడి పశువుకు పోషణ సరిగ్గా అందకపోతే.. తల్లి తన శరీర పోషక నిల్వల నుంచి, గర్భంలోని దూడ నుంచి కూడా పోషకాలను గ్రహిస్తుంది. రాగి లోపం ఉంటే పిండం మరణాలు సంభవిస్తాయి.విటమిన్ ఏ, ఈ అయోడిన్, మాంగనీసు లోపం వల్ల చూడి పశువులు ఈసుకుపోతాయి. పోషణ లోపం లేకుండా జనేంద్రియాలు బాగా అభివృద్ధి చెందితే ఈత సమస్యలు రావు.
పోషణ మరీ ఎక్కువైతే పశువు వెనుక కొవ్వు పెరిగి ఈత ఇబ్బందులెదురవుతాయి. ఈనిన తర్వాత 4-6 వారాల్లో అధిక పాల ఉత్పత్తికి చేరుకుంటుంది. ఈ దశలో పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే పాల ఉత్పత్తి కోసం శరీర నిల్వలను వాడుకుంటుంది. దీని వల్ల ఎదకు రావడం కష్టమవడం, తిరగపొల్లడం వంటి సమస్యలొస్తాయి.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా