చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్‌సీడీ డిస్‌ప్లే, ట్రాన్స్‌పరెంట్ మూత ఉంటాయి.
స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది.
అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336).
Comments
Please login to add a commentAdd a comment