పొద్దున విజిల్ సౌండ్ వినిపించగానే ‘అదిగో బండొచ్చింది’ అని ఇంట్లోని వంటగది వ్యర్థాలను (కిచెన్‌వేస్ట్) తీసుకొని పరుగులు తీస్తాం. మున్సిపాలిటి బండిలో మన చెత్త పడగానే ‘హమ్మయ్య... ఇవ్వాటికో పని అయిపోయింది’ అనుకుంటాం. ‘కాస్త ఆగండి. ఎప్పుడైనా ఒకసారి మీ ఇంట్లోని చెత్తను పరిశీలనగా చూడండి. ఆ చెత్త ఏదో చెప్పబోతున్నట్లుగానే కనిపిస్తుంది కదా! నన్ను బండిలో పారేసి చేతులు దులుపుకోకండి. దయచేసి నన్ను వాడుకోండి. పచ్చగా జీవించండి..అని మనకు చెబుతుంది చెత్త’ అంటున్నారు సవిత హిర్మట్.
బెంగళూరుకు చెందిన ఈ జర్నలిస్ట్ ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మెనేజ్‌మెంట్’ను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సవిత తల్లి క్యాన్సర్‌తో చనిపోయారు. తల్లి జ్ఞాపకాలు రోజూ ఆమెను పలకరిస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం....వంటగది వ్యర్థాలను ఆమె బయట పారేసేవారు కాదు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి పెద్దగా అవగాహనలేని ఆ రోజుల్లోనే ఆమె కంపోస్ట్ తయారు చేసేవారు. దీనితో మొక్కల పెంపకం, కూరగాయలు పండించడం చేసేవారు.
తల్లి బాటలో నడవాలనుకున్నారు సవిత. ఇది తనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావించారు.‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్’ గురించి రెండు సంవత్సరాలు అధ్యయనం చేశారు. అయితే అంతర్జాల సమాచారం మనదేశ పరిస్థితులకు కుదరదు అనే విషయం అర్థమై ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు.తాను తెలుసుకున్న విషయాలను సమాజంతో పంచుకోవాలన్న నిర్ణయంలో భాగంగా ఇరుగుపొరుగు వారితో కలిసి జీరో–వేస్ట్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశారు.
దేశ, విదేశ నిపుణులతో మాట్లాడి సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్లాగింగ్ చేస్తున్నారు. తన పరిశోధన సారాంశాన్ని ‘ఎండ్‌లెస్ గ్రీన్’ పేరుతో పుస్తకంగా రాశారు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన వ్యవహారంలా కాకుండా నైతిక ఉద్యమం స్థాయిలో చూస్తున్నారు సవిత.‘మన దేశంలో లక్షలాది అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అందులో 70 నుంచి 80 శాతం మంది వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించినా కాలుష్యాన్ని ఎంతో కొంత కట్టడి చేయవచ్చు. మన ఇంటి నుంచే మొదలవ్వాలి... అని ఎవరికి వారు అనుకుంటే అది ఉద్యమస్థాయికి చేరుతుంది’ అంటున్నారు సవిత.
‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీ ఖరీదైన వ్యవహారమేమీ కాదు. పెద్దగా సమయం కూడా తీసుకోదు. మన ఇంట్లోనే ఏదో మూల వృథాగా పడి ఉన్న బకెట్ చాలు. కంపోస్ట్‌కు వాడే పదార్థాలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. పైగా ఇదొక రిలాక్సేషన్ ప్రక్రియ...’ ‘కొబ్బరి చిప్పలు కంపోస్ట్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది’‘పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 60 నుంచి 65 శాతం కిచెన్‌వేస్ట్ పోగవుతుంది’‘పదివేల సంవత్సరాల క్రితమే ఇరాన్‌లో, ఆరువేల సంవత్సరాల క్రితం చైనా,జపాన్‌లలో సేంద్రియ పద్ధతుల మూలాలు ఉన్నాయి’‘ఇప్పటికీ మన దేశంలో ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో ఆహారవ్యర్థాలను కంపోస్ట్ చేసే ప్రాచీన పద్దతులను అనుసరిస్తున్నారు. ఉదా: గొయ్యి తవ్వి వ్యర్థాలు పాతి పెట్టడం’... ఒక్కటా రెండా... సవిత గొంతు విప్పితే గలగమని ఎన్నో ఉపయోగకరమైన విషయాలు వరుస కడతాయి. ఒక మూల బిక్కముఖం వేసుకొని కనిపించే అన్‌వాంటెడ్ వేస్ట్, హైలీ న్యూట్రీషియన్ కంపోస్ట్‌గా మారే అద్భుతాన్ని ఆమె మాటల్లో దర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment