Kitchen garbage
-
చెత్తను పడేయకండి.. పచ్చగా వాడుకోండి
పొద్దున విజిల్ సౌండ్ వినిపించగానే ‘అదిగో బండొచ్చింది’ అని ఇంట్లోని వంటగది వ్యర్థాలను (కిచెన్వేస్ట్) తీసుకొని పరుగులు తీస్తాం. మున్సిపాలిటి బండిలో మన చెత్త పడగానే ‘హమ్మయ్య... ఇవ్వాటికో పని అయిపోయింది’ అనుకుంటాం. ‘కాస్త ఆగండి. ఎప్పుడైనా ఒకసారి మీ ఇంట్లోని చెత్తను పరిశీలనగా చూడండి. ఆ చెత్త ఏదో చెప్పబోతున్నట్లుగానే కనిపిస్తుంది కదా! నన్ను బండిలో పారేసి చేతులు దులుపుకోకండి. దయచేసి నన్ను వాడుకోండి. పచ్చగా జీవించండి..అని మనకు చెబుతుంది చెత్త’ అంటున్నారు సవిత హిర్మట్. బెంగళూరుకు చెందిన ఈ జర్నలిస్ట్ ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మెనేజ్మెంట్’ను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సవిత తల్లి క్యాన్సర్‌తో చనిపోయారు. తల్లి జ్ఞాపకాలు రోజూ ఆమెను పలకరిస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం....వంటగది వ్యర్థాలను ఆమె బయట పారేసేవారు కాదు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించి పెద్దగా అవగాహనలేని ఆ రోజుల్లోనే ఆమె కంపోస్ట్ తయారు చేసేవారు. దీనితో మొక్కల పెంపకం, కూరగాయలు పండించడం చేసేవారు. తల్లి బాటలో నడవాలనుకున్నారు సవిత. ఇది తనకు ఇచ్చే నిజమైన నివాళిగా భావించారు.‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్’ గురించి రెండు సంవత్సరాలు అధ్యయనం చేశారు. అయితే అంతర్జాల సమాచారం మనదేశ పరిస్థితులకు కుదరదు అనే విషయం అర్థమై ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు.తాను తెలుసుకున్న విషయాలను సమాజంతో పంచుకోవాలన్న నిర్ణయంలో భాగంగా ఇరుగుపొరుగు వారితో కలిసి జీరో–వేస్ట్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశారు. దేశ, విదేశ నిపుణులతో మాట్లాడి సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్లాగింగ్ చేస్తున్నారు. తన పరిశోధన సారాంశాన్ని ‘ఎండ్లెస్ గ్రీన్’ పేరుతో పుస్తకంగా రాశారు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన వ్యవహారంలా కాకుండా నైతిక ఉద్యమం స్థాయిలో చూస్తున్నారు సవిత.‘మన దేశంలో లక్షలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 70 నుంచి 80 శాతం మంది వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినా కాలుష్యాన్ని ఎంతో కొంత కట్టడి చేయవచ్చు. మన ఇంటి నుంచే మొదలవ్వాలి... అని ఎవరికి వారు అనుకుంటే అది ఉద్యమస్థాయికి చేరుతుంది’ అంటున్నారు సవిత. ‘కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీ ఖరీదైన వ్యవహారమేమీ కాదు. పెద్దగా సమయం కూడా తీసుకోదు. మన ఇంట్లోనే ఏదో మూల వృథాగా పడి ఉన్న బకెట్ చాలు. కంపోస్ట్‌కు వాడే పదార్థాలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. పైగా ఇదొక రిలాక్సేషన్ ప్రక్రియ...’ ‘కొబ్బరి చిప్పలు కంపోస్ట్ కావడానికి చాలా సమయం తీసుకుంటుంది’‘పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 60 నుంచి 65 శాతం కిచెన్వేస్ట్ పోగవుతుంది’‘పదివేల సంవత్సరాల క్రితమే ఇరాన్లో, ఆరువేల సంవత్సరాల క్రితం చైనా,జపాన్లలో సేంద్రియ పద్ధతుల మూలాలు ఉన్నాయి’‘ఇప్పటికీ మన దేశంలో ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో ఆహారవ్యర్థాలను కంపోస్ట్ చేసే ప్రాచీన పద్దతులను అనుసరిస్తున్నారు. ఉదా: గొయ్యి తవ్వి వ్యర్థాలు పాతి పెట్టడం’... ఒక్కటా రెండా... సవిత గొంతు విప్పితే గలగమని ఎన్నో ఉపయోగకరమైన విషయాలు వరుస కడతాయి. ఒక మూల బిక్కముఖం వేసుకొని కనిపించే అన్వాంటెడ్ వేస్ట్, హైలీ న్యూట్రీషియన్ కంపోస్ట్‌గా మారే అద్భుతాన్ని ఆమె మాటల్లో దర్శించవచ్చు. -
వంటింటి వ్యర్ధాలతో బయోగ్యాస్
గచ్చిబౌలి: కిచెన్ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు బయోగ్యాస్ మిషన్‌లో కిచెన్ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్ సర్కిల్లో పోర్టబుల్ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు. ప్రయోజనాలెన్నో.. బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్ బయో గ్యాస్‌ను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు అరుణ శేఖర్ చందానగర్ సర్కిల్–20లో పోర్టబుల్ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్లను అమర్చుకోచ్చు. ఇలా పని చేస్తుంది.. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను కిచెన్ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్ లెస్ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్ బయో గ్యాస్ మిషన్ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది. -
వంటింటి చెత్తతో ఇంటింటా ఎరువు
వంటింట్లో అన్నం, కూరలు మిగిలిపోయాయా? వంట చేసేటప్పుడు కాయగూర తొక్కలు, గింజలు పారవేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కొంచెం ఒపిక తెచ్చుకుంటే... ఈ చెత్తతో బంగారం పండించగల ఎరువును సిద్ధం చేయవచ్చు. చెత్తను తీసుకెళ్లడం.. తొట్లలో నిల్వ చేయడం.. కుళ్లబెట్టి ఎరువును సిద్ధం చేయడం ఇవన్నీ మనవల్ల కాని పనులు బాబూ అనుకునే వారికి సాయపడేందుకా అన్నట్టు అమెరికన్ కంపెనీ డబ్ల్యూ ల్యాబ్స్ ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని సిద్ధం చేసింది. పేరు జెరా. వంటింటి చెత్తను దీంట్లో పడేసి బటన్ నొక్కడం మాత్రమే మనం చేయాల్సిన పని. రోజు తిరిగేసరికి ఎరువు సిద్ధం. మామూలు పద్ధతుల్లో ఈ పని జరగాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. నిలువెత్తు సైజులో ఉండే ఈ యంత్రంలో వేసిన చెత్త.. వారం రోజులపాటు లోపలే ఉన్నా ఏ మాత్రం కంపు కొట్టదు. వేసిన చెత్తకు కంపెనీ సరఫరా చేసే మరో పొడిలాంటిదాన్ని కలిపేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో ఎరువు సిద్ధమవుతుంది. వేడి చేయడం, ఆక్సిజన్ అందించడం, తగినంత తేమ మాత్రమే ఉండేలా చేయడం వంటి పనులతో ఎరువు వేగంగా సిద్ధమయ్యేలా చేస్తుందీ యంత్రం. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో ఎక్కడి నుంచైనా ఈ యంత్రాన్ని పనిచేయించవచ్చు. ఇంకో విషయం.. దేశంలో రిఫ్రిజిరేటర్ల తయారీ రంగంలో ఉన్న వర్ల్‌పూల్ కంపెనీ గురించి తెలుసుకదా.. ఆ సంస్థకు చెందిందే ఈ డబ్ల్యూ ల్యాబ్స్. కొత్త కొత్త ఐడియాలను ఉత్పత్తులుగా మార్చడం... వాటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకోవడం ఈ కంపెనీ ప్రత్యేకతలు. ఈ క్రమంలో డబ్ల్యూ ల్యాబ్స్ జెరా కోసమూ ఇండిగోపై నిధుల సేకరణ చేపట్టింది. అవసరమైన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. అంతా బాగానే ఉందిగానీ... దీని ఖరీదు ఎంత ఉంటుందో? ప్రస్తుతానికి కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఒక్కో జెరా రూ.40 వేల దాకా ఉంటుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్