వంటింటి చెత్తతో ఇంటింటా ఎరువు
వంటింట్లో అన్నం, కూరలు మిగిలిపోయాయా? వంట చేసేటప్పుడు కాయగూర తొక్కలు, గింజలు పారవేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కొంచెం ఒపిక తెచ్చుకుంటే... ఈ చెత్తతో బంగారం పండించగల ఎరువును సిద్ధం చేయవచ్చు. చెత్తను తీసుకెళ్లడం.. తొట్లలో నిల్వ చేయడం.. కుళ్లబెట్టి ఎరువును సిద్ధం చేయడం ఇవన్నీ మనవల్ల కాని పనులు బాబూ అనుకునే వారికి సాయపడేందుకా అన్నట్టు అమెరికన్ కంపెనీ డబ్ల్యూ ల్యాబ్స్ ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని సిద్ధం చేసింది.
పేరు జెరా. వంటింటి చెత్తను దీంట్లో పడేసి బటన్ నొక్కడం మాత్రమే మనం చేయాల్సిన పని. రోజు తిరిగేసరికి ఎరువు సిద్ధం. మామూలు పద్ధతుల్లో ఈ పని జరగాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. నిలువెత్తు సైజులో ఉండే ఈ యంత్రంలో వేసిన చెత్త.. వారం రోజులపాటు లోపలే ఉన్నా ఏ మాత్రం కంపు కొట్టదు. వేసిన చెత్తకు కంపెనీ సరఫరా చేసే మరో పొడిలాంటిదాన్ని కలిపేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో ఎరువు సిద్ధమవుతుంది.
వేడి చేయడం, ఆక్సిజన్ అందించడం, తగినంత తేమ మాత్రమే ఉండేలా చేయడం వంటి పనులతో ఎరువు వేగంగా సిద్ధమయ్యేలా చేస్తుందీ యంత్రం. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో ఎక్కడి నుంచైనా ఈ యంత్రాన్ని పనిచేయించవచ్చు. ఇంకో విషయం.. దేశంలో రిఫ్రిజిరేటర్ల తయారీ రంగంలో ఉన్న వర్ల్‌పూల్ కంపెనీ గురించి తెలుసుకదా.. ఆ సంస్థకు చెందిందే ఈ డబ్ల్యూ ల్యాబ్స్. కొత్త కొత్త ఐడియాలను ఉత్పత్తులుగా మార్చడం... వాటిని మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకోవడం ఈ కంపెనీ ప్రత్యేకతలు.
ఈ క్రమంలో డబ్ల్యూ ల్యాబ్స్ జెరా కోసమూ ఇండిగోపై నిధుల సేకరణ చేపట్టింది. అవసరమైన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. అంతా బాగానే ఉందిగానీ... దీని ఖరీదు ఎంత ఉంటుందో? ప్రస్తుతానికి కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఒక్కో జెరా రూ.40 వేల దాకా ఉంటుంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్