Manure
-
ఆవు పేడతో వ్యాపారమా? అని నవ్వి ఊరుకున్నాను.. కానీ, ఇప్పుడు
పాడి లేని ఇల్లు, పేడ లేని చేను లేదు...అనేది పాత సామెత. ‘పేడ ఉన్న చోట పేమెంట్స్ ఉండును’ అనేది సరికొత్త సామెత. దీని లోతు తెలుసుకోవాలంటే ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు వెళ్లాల్సిందే. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ జిల్లా ఇప్పుడు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్... ఇలా రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఆవు పేడ అనేది ఆదాయ వనరుగా మారింది. మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి విగ్రహాలు, మొబైల్ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్... ఒక్కటనేమిటీ తమ సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఒకప్పుడు వీటి మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితం. ఇప్పుడు మాత్రం ఇ–కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయస్థాయికి చేరింది. రోజురోజుకు ఆన్లైన్ మార్కెట్ ఊపందుకోవడం విశేషం. ‘మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెప్పగానే నవ్వి ఊరుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాను’ అంటుంది అంబగోర్ గ్రామానికి చెందిన సబిత. ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాల నుంచి మహిళలు బృందాలుగా వస్తుంటారు. ‘ఈ వ్యాపారం రాబోయే కాలంలోగ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది’ అని చెప్పారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి. ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే లాయర్ తన వృత్తికి స్వప్తి పలికి పేడ వ్యాపారంలోకి దిగారు. గౌతమబుద్ధనగర్ జిల్లాలో పది ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇందులో 120 వరకు ఆవులు ఉన్నాయి. ఈ గోశాల నుంచి వచ్చే పేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ‘ఇది వ్యాపారమే కాదు. ఆవుపేడ ద్వారా అదనపు ఆదాయాన్ని అర్జించవచ్చు...అనే సందేశం ఇవ్వడం కూడా’ అంటున్న అపర్ణ వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ ‘మార్కెట్ ఎలా చేయాలి?’ ‘పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు’... మొదలైన విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. పంజాబ్‌లోని బులందపూర్‌లాంటి ఎన్నో గ్రామాల్లో ఆవుపేడను ఊరవతల వేసే అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు మానుకొని పేడను జాగ్రత్త చేస్తున్నారు. పదిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి. -
ఎండాకులు భలే ఎరువు!
నవంబర్ నుంచి దాదాపు ఏప్రిల్ వరకు మన చుట్టూతా ఉండే చెట్లు ఆకులను రాల్చుతూ ఉంటాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా వాకిలి నిండా, ఇంటి ఆవరణలో, చెట్ల పక్కనున్న ఇంటి పైకప్పుల మీద, కాలనీల్లో రోడ్ల మీద, పార్కుల్లో.. ఎక్కడ చూసినా ఆకులే.. ఆకులు.. రాలిన ఆకులు! ఈ ఆకులను చక్కని కంపోస్టు ఎరువుగా మార్చుకోవచ్చని తెలిసినా.. నిర్లక్ష్యం కొద్దీ ఆకులను కుప్పజేసి నిప్పు పెట్టడమో లేదా చెత్తను మోసుకెళ్లే మున్సిపాలిటీ వాళ్ల నెత్తిన వెయ్యడమో చేస్తున్నాం.. అయితే, స్వల్ప ప్రయత్నంతోనే ఈ ఎండాకులను అమూల్యమైన సహజ ఎరువుగా మార్చుకోవచ్చని ఓ మహిళ ఎలుగెత్తి చాటుతున్నారు. మహారాష్ట్రలోని పుణే నగరవాసి అదితి దేవ్‌ధర్ ‘బ్రౌన్‌లీఫ్’ పేరిట ఏకంగా ఓ సామాజిక ఉద్యమాన్నే ప్రారంభించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఈ స్ఫూర్తి కథనంతో ‘కంపోస్టు కథలు’ సిరీస్‌ను ఈ వారం ప్రారంభిస్తున్నాం.. పచ్చని చెట్లంటే మనందరికీ ఇష్టమే. అందుకే పొలాల గట్లమీద, పడావుభూముల్లో, ఇంటి దగ్గర, ఊళ్లు / కాలనీల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో.. ఇష్టపడి పచ్చని చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే, ఆ చెట్లు రాల్చే ఆకుల్ని ఏం చేయాలి? ఊడ్చి మున్సిపాలిటీ వ్యాన్‌లో వేస్తున్నారు లేదా కుప్ప చేసి నిప్పు పెడుతున్నారు. ఈ రెండూ మంచి పనులు కాదు. పనిగట్టుకొని మొక్కలు నాటి పచ్చని చెట్లని పెంచుతున్న వారు సైతం నాకెందుకులే అనో.. ఓ రకమైన నిరాసక్తతతోనో, నిర్లక్ష్యంతోనో చూస్తూ ఊరుకుంటున్నారు. కానీ, అదితి దేవ్‌ధర్ ఊరుకోలేదు. తమ ఇంటి ఆవరణలో పెద్ద చెట్లు రాల్చే ఆకులు పోగుపడుతూ ఉంటే.. ఆ ఆకులను నిప్పు పెట్టి వాయుకాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యానికి ముప్పు తేవడానికి గానీ, మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చి డంపింగ్ యార్డులో చెత్తదిబ్బలను కొండలుగా పెంచడానికి గానీ ఆమె ఒప్పుకోలేదు. తానే చొరవతో ఎండాకుల సమస్యకు పరిష్కారం వెదికారు. బ్రౌన్‌లీఫ్ ఛాలెంజ్ తీసుకున్నారు. నలుగురినీ కూడగట్టారు. ఒక్క ఎండాకునూ తగులబెట్టనియ్యకూడదని ప్రతిన బూనారు. నాలుగేళ్లుగా ఎండాకులను తగులబెట్టకుండా చూస్తున్నారు. ఎండాకులతో కంపోస్టు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆ కంపోస్టుతో చక్కని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి దోహదం చేస్తూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కంగ్రాట్స్ టు అదితి! ఆకులను తగులబెడితే ఏమవుతుంది? ఎండాకులను తగులబెట్టినప్పుడు ధూళి కణాలు గాలిలో కలుస్తాయి. భూతాపాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సయిన్, మిథేన్ వంటి వాయువులు విడుదలవుతాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులనూ కలిగిస్తాయి. చెట్లు రాల్చే ఆకులు.. భూమికి చెట్లు కృతజ్ఞతగా తిరిగి ఇస్తున్న పోషకాలు. ప్రకృతిలో, అడవిలో రాలిన ఆకులు దొంతర్లుగా పేరుకొని భూమికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాయి. వర్షానికి తడిచిన ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి. కంపోస్టు చేయడం ద్వారా ఈ ప్రక్రియకు దోహదపడటం మన కర్తవ్యం. (వచ్చే వారం: లీఫ్ కంపోస్టర్‌ను తయారు చేసుకోవడంతోపాటు కంపోస్టు మెళకువలు నేర్చుకుందాం) 1 ఆచ్ఛాదన (మల్చింగ్) చెయ్యండి: ఎండాకులను మొక్కలు, చెట్ల దగ్గర నేలపై ఎండ పడకుండా మల్చింగ్ చేయాలి. ఎండ నేరుగా నేలకు తగలకుండా ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములకు మేలు జరుగుతుంది. కాలక్రమంలో ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి. ∙ 2కంపోస్ట్ చెయ్యండి: ఎండాకులను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయండి. కంపోస్టు చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఎ) ఇంటి ఆవరణలో ఒక మూలన గుంత తవ్వి ఆకులను అందులో వేయటం. బి) ఇనుప మెష్‌తో ట్రీగార్డు మాదిరిగా గంపను తయారు చేసి అందులో ఎండాకులు వేసి ఎక్కడికక్కడే కంపోస్టు తయారు చేయడం. సి) ఎండాకులను కుప్పగా పోసి కూడా కంపోస్టు చెయ్యొచ్చు. ఈ మూడు పద్ధతుల్లోనూ ఆకులను తేమగా ఉండేలా నీరు పోస్తుండాలి. పేడనీరు లేదా జీవామృతం లేదా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం లేదా లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ద్రావణం లేదా పుల్లమజ్జిగ వంటి సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవరాశి ఉండే కల్చర్‌ను కలపాలి 3 ఇతరులకివ్వండి: పట్టణాలు, నగరాలలో నివసించే వారు ఇంటి దగ్గర లేదా కాలనీ రోడ్లపై లేదా పార్కుల్లో చెట్లు రాల్చే ఆకులను కంపోస్టు చేసే ఉద్దేశం లేకపోతే వాటిని కంపోస్టు చేసుకోదలచిన వారికి అందించడం ఉత్తమం. పుణే వాసులు ఎండాకులను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా అదితి బ్రౌన్‌లీఫ్ పేరుతో వాట్సప్‌గ్రూప్, ఫేస్బుక్ ఖాతాతోపాటు వివరంగా చర్చించేందుకు వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు. తొలి ఏడాదే 500 బస్తాల ఎండాకులను ప్రజలు ఇతరులకు అందించారట. సోషల్ మీడియా ద్వారా సామాజికోద్యమం ప్రారంభించి ఉండకపోతే ఈ ఆకులన్నిటినీ తగులబెట్టి ఉండేవారని, ఇప్పుడు ఇలా సద్వినియోగం అయ్యాయని ఆమె సంతోషంగా చెబుతారు. అయితే, రెండో ఏడాదికి ఆకులను ఇతరులకిస్తాం అనే వారు లేకుండా పోయారట. అంటే అందరూ కంపోస్టు తయారు చేసుకోవడం, దానితో కుండీలలో సేంద్రియ ఇంటిపంటలు పండించడం ప్రారంభించారన్న మాట! ఆకులను తగులబెట్టడం అనర్థదాయకం ఎండాకులను కంపోస్టు చేసే పద్ధతి -
వంటింటి చెత్తతో ఇంటింటా ఎరువు
వంటింట్లో అన్నం, కూరలు మిగిలిపోయాయా? వంట చేసేటప్పుడు కాయగూర తొక్కలు, గింజలు పారవేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కొంచెం ఒపిక తెచ్చుకుంటే... ఈ చెత్తతో బంగారం పండించగల ఎరువును సిద్ధం చేయవచ్చు. చెత్తను తీసుకెళ్లడం.. తొట్లలో నిల్వ చేయడం.. కుళ్లబెట్టి ఎరువును సిద్ధం చేయడం ఇవన్నీ మనవల్ల కాని పనులు బాబూ అనుకునే వారికి సాయపడేందుకా అన్నట్టు అమెరికన్ కంపెనీ డబ్ల్యూ ల్యాబ్స్ ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని సిద్ధం చేసింది. పేరు జెరా. వంటింటి చెత్తను దీంట్లో పడేసి బటన్ నొక్కడం మాత్రమే మనం చేయాల్సిన పని. రోజు తిరిగేసరికి ఎరువు సిద్ధం. మామూలు పద్ధతుల్లో ఈ పని జరగాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. నిలువెత్తు సైజులో ఉండే ఈ యంత్రంలో వేసిన చెత్త.. వారం రోజులపాటు లోపలే ఉన్నా ఏ మాత్రం కంపు కొట్టదు. వేసిన చెత్తకు కంపెనీ సరఫరా చేసే మరో పొడిలాంటిదాన్ని కలిపేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో ఎరువు సిద్ధమవుతుంది. వేడి చేయడం, ఆక్సిజన్ అందించడం, తగినంత తేమ మాత్రమే ఉండేలా చేయడం వంటి పనులతో ఎరువు వేగంగా సిద్ధమయ్యేలా చేస్తుందీ యంత్రం. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో ఎక్కడి నుంచైనా ఈ యంత్రాన్ని పనిచేయించవచ్చు. ఇంకో విషయం.. దేశంలో రిఫ్రిజిరేటర్ల తయారీ రంగంలో ఉన్న వర్ల్‌పూల్ కంపెనీ గురించి తెలుసుకదా.. ఆ సంస్థకు చెందిందే ఈ డబ్ల్యూ ల్యాబ్స్. కొత్త కొత్త ఐడియాలను ఉత్పత్తులుగా మార్చడం... వాటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకోవడం ఈ కంపెనీ ప్రత్యేకతలు. ఈ క్రమంలో డబ్ల్యూ ల్యాబ్స్ జెరా కోసమూ ఇండిగోపై నిధుల సేకరణ చేపట్టింది. అవసరమైన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. అంతా బాగానే ఉందిగానీ... దీని ఖరీదు ఎంత ఉంటుందో? ప్రస్తుతానికి కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఒక్కో జెరా రూ.40 వేల దాకా ఉంటుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
150 ఎరువుల బస్తాలు స్వాధీనం
మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో అక్రమంగా తరలిస్తోన్న 150 బస్తాల ఎరువులను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాభాల టమాట
నారుమడుల తయారీ పశువుల ఎరువు, సూపర్‌పాస్పేట్ వేసుకుని నారుమడిని సిద్ధం చేసుకోవాలి. నారుమడి నాలుగు మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, 15 సెం.మీ. ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మడుల మధ్య అర మీటర్ దూరం ఉండేలా ఎకరానికి 10 మళ్లు చేసుకోవాలి. మొలకెత్తే వరకు నారుమడిని ఎండుగడ్డితో కప్పాలి. నారు మొలిచే వరకు రోజుకు రెండు సార్లు నీరు పెట్టాలి. కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి. పంట నాటే పద్ధతి టమాట సాగుకు మురుగు నీటి పారుదల వసతి ఉన్న నేలను ఎంచుకోవాలి. ఎక రా పొలంలో 10నుంచి 12 టన్నుల పశువుల పేడ, 150 కిలోల సూపర్‌పాస్పేట్, 50 కిలోల పొటాష్ వేసుకుని దుక్కిని బాగా దున్నుకోవాలి. పొలంలో బోజెలు కొట్టుకుని సిద్ధం చేసుకోవాలి. కాల్వలకు నీరు పెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో నారును నాటుకోవాలి. నాలుగు నుంచి ఐదు ఆకులు వచ్చిన తర్వాత మొక్కలను నాటాలి. మొక్కలు పెరుగుతున్న దశలో 30,45,60 రోజుల్లో మూడు దఫాలుగా యూరియా వేసి బోజెలు ఎక్కించాలి. నీటి యాజమాన్యం వారం రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. కాయ వచ్చే దశలో చాలా రోజులు నీరు పెట్టకుండా ఒకే సారి భారీగా నీరందిస్తే కాయ పగుళ్లు వస్తాయి. టమాట పంట నాటిన మొదటి నాలుగైదు వారాల్లోపే కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మొక్క మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. లీటరు నీటిలో 6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ మందును కలిపి పిచికారీ చేయాలి. నారు మడి తెగుళ్లు నారు మడుల్లో ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల నారు మొలకెత్తక ముందే విత్తనాలు, మొలకలు కుళ్లిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో ఒక శాతం బోర్డాక్స్ మిశ్రమం, మెటలాక్సిన్ మందును కలిపి చల్లుకోవాలి. కాండం తొలుచు పురుగు.. కాయ తొలుచు పురుగు తీవ్ర నష్టం కలిగి స్తుంది. ఇది లేత ఆకులు, మొగ్గలు, పూత, కాయలపై గుడ్లు పెడుతుంది. చిన్న పురుగులు లేత ఆకులను పెద్ద పురుగులు కాయలకు రంధ్రాలు చేసి తింటాయి. దీని నివారణకు టమాటలో బంతిని ఎర పంటగా వేసుకోవాలి. టమాటా నాటేకన్నా 15-20రోజుల ముందుగానే బంతి మొలకలు నాటాలి. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల ప్రొఫనోఫాస్ లేదా క్వినాల్ఫాస్ మందును పిచికారీ చేసుకోవాలి. అక్షింతల పురుగు.. ఈ పురుగు పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని తినేస్తుంది. దీంతో ఆకులకు రంధ్రాలు పడుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కార్బరిల్ 50శాతం పొడిని, లేదా కోరాజిన్ మందును కలిపి పిచికారీ చేయాలి. వేరు కుళ్లు.. ప్రతికూల పరిస్థితులు లేదా వేడి వాతావరణం లో ఈ తెగులు సోకుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా ఎండిపోతాయి. భూమి ని అనుకుని ఉండే కాండం మొదలు, భూమిని తాకి ఉండే కణాలు చనిపోయిన సందర్భాల్లో కనిపిస్తాయి. దీనికి నివారణకు కిలో విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి ఫార్ములేషన్ పట్టించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ను నీటిలో కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్లలో చల్లి దీన్ని అరికట్టాలి.