లాభాల టమాట
నారుమడుల తయారీ
పశువుల ఎరువు, సూపర్‌పాస్పేట్ వేసుకుని నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
నారుమడి నాలుగు మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, 15 సెం.మీ. ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
మడుల మధ్య అర మీటర్ దూరం ఉండేలా ఎకరానికి 10 మళ్లు చేసుకోవాలి.
మొలకెత్తే వరకు నారుమడిని ఎండుగడ్డితో కప్పాలి.
నారు మొలిచే వరకు రోజుకు రెండు సార్లు నీరు పెట్టాలి.
కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి.
పంట నాటే పద్ధతి
టమాట సాగుకు మురుగు నీటి పారుదల వసతి ఉన్న నేలను ఎంచుకోవాలి.
ఎక రా పొలంలో 10నుంచి 12 టన్నుల పశువుల పేడ, 150 కిలోల సూపర్‌పాస్పేట్, 50 కిలోల పొటాష్ వేసుకుని దుక్కిని బాగా దున్నుకోవాలి.
పొలంలో బోజెలు కొట్టుకుని సిద్ధం చేసుకోవాలి.
కాల్వలకు నీరు పెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో నారును నాటుకోవాలి.
నాలుగు నుంచి ఐదు ఆకులు వచ్చిన తర్వాత మొక్కలను నాటాలి.
మొక్కలు పెరుగుతున్న దశలో 30,45,60 రోజుల్లో మూడు దఫాలుగా యూరియా వేసి బోజెలు ఎక్కించాలి.
నీటి యాజమాన్యం
వారం రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.
కాయ వచ్చే దశలో చాలా రోజులు నీరు పెట్టకుండా ఒకే సారి భారీగా నీరందిస్తే కాయ పగుళ్లు వస్తాయి.
టమాట పంట నాటిన మొదటి నాలుగైదు వారాల్లోపే కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
మొక్క మొదళ్లకు మట్టిని ఎగదోయాలి.
లీటరు నీటిలో 6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ మందును కలిపి పిచికారీ చేయాలి.
నారు మడి తెగుళ్లు
నారు మడుల్లో ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల నారు మొలకెత్తక ముందే విత్తనాలు, మొలకలు కుళ్లిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో ఒక శాతం బోర్డాక్స్ మిశ్రమం, మెటలాక్సిన్ మందును కలిపి చల్లుకోవాలి.
కాండం తొలుచు పురుగు..
కాయ తొలుచు పురుగు తీవ్ర నష్టం కలిగి స్తుంది. ఇది లేత ఆకులు, మొగ్గలు, పూత, కాయలపై గుడ్లు పెడుతుంది. చిన్న పురుగులు లేత ఆకులను పెద్ద పురుగులు కాయలకు రంధ్రాలు చేసి తింటాయి. దీని నివారణకు టమాటలో బంతిని ఎర పంటగా వేసుకోవాలి. టమాటా నాటేకన్నా 15-20రోజుల ముందుగానే బంతి మొలకలు నాటాలి. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల ప్రొఫనోఫాస్ లేదా క్వినాల్‌ఫాస్ మందును పిచికారీ చేసుకోవాలి.
అక్షింతల పురుగు..
ఈ పురుగు పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని తినేస్తుంది. దీంతో ఆకులకు రంధ్రాలు పడుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కార్బరిల్ 50శాతం పొడిని, లేదా కోరాజిన్ మందును కలిపి పిచికారీ చేయాలి.
వేరు కుళ్లు..
ప్రతికూల పరిస్థితులు లేదా వేడి వాతావరణం లో ఈ తెగులు సోకుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా ఎండిపోతాయి. భూమి ని అనుకుని ఉండే కాండం మొదలు, భూమిని తాకి ఉండే కణాలు చనిపోయిన సందర్భాల్లో కనిపిస్తాయి. దీనికి నివారణకు కిలో విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి ఫార్ములేషన్ పట్టించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బ్లైటాక్స్‌ను నీటిలో కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్లలో చల్లి దీన్ని అరికట్టాలి.