Tomato cultivation
-
Tomato Price: దారుణంగా పడిపోయిన టమాట ధర
-
టమాటా ధరలు ఢమాల్
-
స్ట్రైకింగ్ పద్ధతిలో నాణ్యమైన టమాట సాగు దిగుబడి
-
ఆధునిక పద్ధతిలో టమాట సాగు
-
క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే నల్ల టమాటాల గురించి ఈ విషయాలు తెలుసా?
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడికి భారంగా మారిపోయిన టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం. దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి నల్ల టమాటాల గురించి మీకు తెలుసా? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే ఈ బ్లాక్ టమాటాల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎగబాకాయి. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ ధరలను బ్రేక్ చేస్తూ టమాట కిలో ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టమాటాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో బ్లాక్ టమాటాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా టమాటా ఎర్రటి రంగులోమెరిసిపోతుంటుంది. కానీ ఈ బ్లాక్ టమాటాల గురించి మీకు తెలుసా? ఎరుపు, ఊదా రంగు విత్తనాలతో ఈ నల్ల టమాటాలను పండిస్తారట. వీటిని ఇండిగో రోజ్ అని కూడా పిలుస్తారు.హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో ప్రస్తుతం ఈ నల్ల టమాటాలను సాగు చేస్తున్నారు. ఈ బ్లాక్ టామాటాలు క్యాన్సర్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లాక్ టమాటాలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు కూడా చాలా తక్కువ. బ్లాక్ టొమాటోలో ప్రొటీన్, విటమిన్ ఎ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి పోరాడటానికి ఈ బ్లాక్ టమాటాలు దోహదం చేస్తాయి. అందుకే యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్‌ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ టమాటాలు ధరతో పోలిస్తే కాస్త ఎక్కునేనట. -
ఈ సీజన్లో టమోట సాగుచేస్తే మరింత ఆదాయం
-
Tomato Prices: టమాట కేజీ రూ. 300?
నెలన్నర గ్యాప్‌లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది. ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు.. 🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు. 🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు. 🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది. 🍅 జూన్‌లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది. 🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు. 🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట. 🍅 మొత్తంగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు. ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు. 🍅 లోకల్ సర్కిల్స్ అనేది ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. -
ఊరటనివ్వని టమాట!
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో, పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40–10, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది. దిగుబడి ప్రభావమే మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి. ఏడు రాష్ట్రాలకు ఎగుమతులు మదనపల్లె టమాట మార్కెట్ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, జగదల్పూర్, విహిల్, అంబికాపూర్, బవోదాబాద్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్పూర్, పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, గుజరాత్‌లోని జోధ్‌పూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, దేశ రాజధాని ఢిల్లీకి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది. అమావాస్య ప్రభావం కూడా గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు. -
సాగు‘బడి’లో విద్యార్థులు
భైంసారూరల్ : బడిలో ఆటలు ఆడుకోవడానికి విశాలంగా ఉన్న మైదానంలో టమాటా సాగు చేస్తూ విద్యార్థులు చదువులో ముందుకు ‘సాగు’తున్నారు. భైంసా పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో విశాలమైన మైదానం ఉంది. పిచ్చిమొక్కలతో నిండుగా కనిపించే మైదానంలో విషసర్పాలు తిరగకుండా చదును చేశారు. పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో టమాటా సాగుచేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులే కలుపుమొక్కలు తీస్తూ టమాటా పండిస్తున్నారు. అక్కడే టమాటాలు కోసి రోజు వారీ వసతి గృహ భోజనంలో వంటకు వినియోగిస్తున్నారు. తాము పండించిన టమాటాను వసతిగృహ విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఏడాదికాలంగా విద్యార్థులు టమాటా సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారే... గిరిజన ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికం. పంట పొలంలో వేసే టమాటాను పాఠశాలలో సాగు చేస్తూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజు బడిలో పాఠాలు చదువుతూ తీరిక సమయంలో ఇలా సాగు బాటలో శ్రమిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లోనూ ఈ విద్యార్థుల బృందం పాల్గొంటూ పాఠశాల పరిసరాలను శుభ్రం చేసుకుంది. ప్రోత్సహిస్తున్నాం.. విద్యార్థుల్లో టమాటా సాగుపై ఆసక్తిని గమనించాం. అందుకు తగ్గట్లు వారిని ప్రోత్సహిస్తున్నాం. కొంతమంది విద్యార్థులు ఇతర కాయగూరలు సాగుచేద్దామంటున్నారు. ప్రస్తుతమైతే టమాటా సాగు చేశారు. సెలవుదినం ఉంటే అక్కడే ఉంటూ కలుపు మొక్కలు తీస్తూ పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. - అంబారావు, ప్రిన్సిపాల్ -
పశువులకు మేతగా టమాటా
ఇంద్రవెల్లి: టమాటా సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. చేతికొచ్చిన టమాటా పంటకు మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉండి పంట చేతికొచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారు. అమ్మగా మిగిలిన టమాటాలను పశువులకు మేత గా వేస్తున్నారు. పెట్టుబడి అధికం.. మండలకేంద్రంతో పాటు మండలంలోని ఈశ్వర్‌నగర్, అంజీ, ఏమైకుంట, కేస్లాగూడ, కేస్లాపూర్, ముట్నూర్, శంకర్‌గూడ, దన్నోర(బీ), గౌరపూర్, రాంపూర్ తదితర గ్రామాల్లో సుమారు 2వేల,611 ఎకరాలకుపైగా టమాటా సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక నాటిన టమాటా మొక్కలు చనిపోవడంతో రెండు నుంచి మూడు సార్లు అప్పులపాలయ్యారు. గతం కంటే ఈ ఖరీఫ్ సాగుకు రెండింతలు అధిక ఖర్చు చేశారు. ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ప్రస్తుతం చేతికొచ్చిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు చేసే వ్యాపారస్తులు నాణ్యతను చూసి కొనుగోలు చేస్తున్నారు. 25 కిలోల టమాటాకు రూ.100 నుంచి రూ.130 ఉండడం, అందులో ఏరివేయగా మిగిలిన టమాటా పంటను రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. దీంతో చేసిన అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కాక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నష్ట పోయిన టమాటా పంటలపై సర్వే నిర్వహించి పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని మండలంలోని టమాటా రైతులు కోరుతున్నారు. -
లాభాల టమాట
నారుమడుల తయారీ పశువుల ఎరువు, సూపర్‌పాస్పేట్ వేసుకుని నారుమడిని సిద్ధం చేసుకోవాలి. నారుమడి నాలుగు మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, 15 సెం.మీ. ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మడుల మధ్య అర మీటర్ దూరం ఉండేలా ఎకరానికి 10 మళ్లు చేసుకోవాలి. మొలకెత్తే వరకు నారుమడిని ఎండుగడ్డితో కప్పాలి. నారు మొలిచే వరకు రోజుకు రెండు సార్లు నీరు పెట్టాలి. కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి. పంట నాటే పద్ధతి టమాట సాగుకు మురుగు నీటి పారుదల వసతి ఉన్న నేలను ఎంచుకోవాలి. ఎక రా పొలంలో 10నుంచి 12 టన్నుల పశువుల పేడ, 150 కిలోల సూపర్‌పాస్పేట్, 50 కిలోల పొటాష్ వేసుకుని దుక్కిని బాగా దున్నుకోవాలి. పొలంలో బోజెలు కొట్టుకుని సిద్ధం చేసుకోవాలి. కాల్వలకు నీరు పెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో నారును నాటుకోవాలి. నాలుగు నుంచి ఐదు ఆకులు వచ్చిన తర్వాత మొక్కలను నాటాలి. మొక్కలు పెరుగుతున్న దశలో 30,45,60 రోజుల్లో మూడు దఫాలుగా యూరియా వేసి బోజెలు ఎక్కించాలి. నీటి యాజమాన్యం వారం రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి. కాయ వచ్చే దశలో చాలా రోజులు నీరు పెట్టకుండా ఒకే సారి భారీగా నీరందిస్తే కాయ పగుళ్లు వస్తాయి. టమాట పంట నాటిన మొదటి నాలుగైదు వారాల్లోపే కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మొక్క మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. లీటరు నీటిలో 6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ మందును కలిపి పిచికారీ చేయాలి. నారు మడి తెగుళ్లు నారు మడుల్లో ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల నారు మొలకెత్తక ముందే విత్తనాలు, మొలకలు కుళ్లిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో ఒక శాతం బోర్డాక్స్ మిశ్రమం, మెటలాక్సిన్ మందును కలిపి చల్లుకోవాలి. కాండం తొలుచు పురుగు.. కాయ తొలుచు పురుగు తీవ్ర నష్టం కలిగి స్తుంది. ఇది లేత ఆకులు, మొగ్గలు, పూత, కాయలపై గుడ్లు పెడుతుంది. చిన్న పురుగులు లేత ఆకులను పెద్ద పురుగులు కాయలకు రంధ్రాలు చేసి తింటాయి. దీని నివారణకు టమాటలో బంతిని ఎర పంటగా వేసుకోవాలి. టమాటా నాటేకన్నా 15-20రోజుల ముందుగానే బంతి మొలకలు నాటాలి. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల ప్రొఫనోఫాస్ లేదా క్వినాల్ఫాస్ మందును పిచికారీ చేసుకోవాలి. అక్షింతల పురుగు.. ఈ పురుగు పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని తినేస్తుంది. దీంతో ఆకులకు రంధ్రాలు పడుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కార్బరిల్ 50శాతం పొడిని, లేదా కోరాజిన్ మందును కలిపి పిచికారీ చేయాలి. వేరు కుళ్లు.. ప్రతికూల పరిస్థితులు లేదా వేడి వాతావరణం లో ఈ తెగులు సోకుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా ఎండిపోతాయి. భూమి ని అనుకుని ఉండే కాండం మొదలు, భూమిని తాకి ఉండే కణాలు చనిపోయిన సందర్భాల్లో కనిపిస్తాయి. దీనికి నివారణకు కిలో విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి ఫార్ములేషన్ పట్టించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ను నీటిలో కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్లలో చల్లి దీన్ని అరికట్టాలి. -
తీగ సాయంతో టమాట సాగు
తీగల సాయంతో టమాట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు కిషన్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల చీడపీడల బాధ తగ్గుతుందని, పంట వృథా కాదని చెబుతున్నారు. టమాట సాగు గురించి ఆయన మాటల్లోనే.. బాల్కొండ : ‘‘జూన్ మొదటి వారంలో టమాట నా రు పోశాను. తర్వాత అర ఎకరం భూమిలో బో యలు ఏర్పాటు చేశాను. బోయలపై అక్కడక్క డ ఐదు ఫీట్ల ఎత్తు ఉండేలా వెదురు కర్రలను పాతాను. నెల రోజుల తర్వాత బోయలలో మొ క్కలను నాటాను. వెదురు కర్రలకు ఒక కర్ర నుంచి మరో కర్రకు ఫీటు ఎత్తులో స్టీల్ వైరును చుట్టాను. టమాట మొక్క ఫీటు ఎత్తు పెరిగిన తర్వాత దారాలతో తీగకు కట్టాను. మళ్లీ వెదు రు కర్రకు రెండు ఫీట్ల ఎత్తులో వైరు చుట్టాను. మొక్క రెండు ఫీట్ల ఎత్తు పెరగ్గానే దానిని దారాలతో మళ్లీ తీగకు కట్టాను. ఇలా మొక్క నేలపై పడిపోకుంగా జాగ్రత్తలు తీసుకున్నాను. మూ డు, నాలుగు ఫీట్ల ఎత్తులోనూ ఇలాగే చేశాను. దీంతో టమాట తీగలపైనే పారుతోంది. ఈ పం ట మూడో నెలనుంచి చేతి కి వస్తుంది. ప్రస్తు తం కాత దశలో ఉంది. ఆరు నెలల వరకు ట మాట కాస్తూనే ఉంటుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. టమాట సైజు కూడా పెద్దగా ఉందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఖర్చు ఎక్కువే అయినా.. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుందని రైతు తెలిపారు. వెదురు కర్రలు, స్టీల్ వైరు, దారాలకు సుమారు రూ. 15 వేల వరకు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. అయితే సాధార ణ పద్ధతుల్లో సాగు చేసిన టమాట కంటే తీగ ప ద్ధతిలో సాగు చేసిన పంటకు చీడపీడల బాధ తక్కువన్నారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారని పేర్కొన్నారు. సాధారణ పద్ధతుల్లో పంట సాగు చేస్తే వర్షాలు కురిసినప్పుడు టమాటలు కుళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఈ పద్ధతిలో ఆ బాధ ఉండదని వివరించారు. సాధారణ పద్ధతిలో టమాట నేలకు ఆనుతుందని, దీంతో కాయలపై మచ్చలు ఏర్పడతాయని, కాయల సైజు కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తీగ పద్ధతిలో ఆ సమస్యలు లేవన్నారు. ఈ పద్ధతిలో మదనపల్లెకు చెందిన రైతులు టమాట సాగు చేస్తారని, వారిని స్ఫూర్తిగా తీసుకున్నానని రైతు తెలిపారు. ప్రస్తుతం 25 కిలోల టమాట పెట్టె రూ. 350 పలుకుతోందని, ధర ఇలాగే ఉంటే లక్ష రూపాయల వరకు రాబడి వస్తుందని ఆశిస్తున్నానని వివరించారు. -
లాభాల పంట టమాట
ఖమ్మం వ్యవసాయం: టమాట సాగుకుమురుగు నీటి వసతి ఉన్న నేలను ఎంపిక చేసుకోవాలి. దాన్ని 3-4 సార్లు దున్నాలి. చివరి దుక్కిలో 40 కిలోల కుళ్లిన పశువుల ఎరువు, నాలుగు కిలోల సూపర్ పాస్పేట్ను 40 చ.మీ నారుమడికి చేర్చాలి. మడి నాలుగు మీటర్ల పొడవు, మీటర్ వెడల్పుతో 15 సె.మీ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మడుల మధ్య అర మీటర్ దూరంతో ఎకరానికి 10 మళ్లు చేసుకోవాలి. విత్తటం... వరుసల మధ్య 10 సెంటీమీటర్ల దూరంతో 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. విత్తనానికి మధ్య దూరం 1 నుంచి 1.5 సెం.మీలు ఉండాలి. విత్తిన తర్వాత రోజ్క్యాన్తో నీరు పెట్టాలి. మొలకెత్తే వరకు నారుమడిని ఎండుగడ్డితో కప్పాలి. దీనివల్ల భూమిలో విత్తనాలు సక్రమంగా ఉండటమే గాక పక్షుల బారీనపడకుండా ఉంటాయి. మొలకెత్తే వరకు రోజుకు రెండుసార్లు, ఆ తరువాత ప్రతిరోజూ సాయంత్రం కొంచెంగా నీరు పెడుతూ ఉండాలి. కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన తరువాత 4-5 ఆకులు వచ్చే దశ రాగానే నారును పీకి నాటుకోవచ్చు. ఈ దశ రావటానికి 30-35 రోజుల సమయం పడుతుంది. ఐదారు రోజుల ముందు నుంచి నీటి తడులు తగ్గిస్తే నారు దృఢంగా ఉంటుంది. నారు పీకడానికి రెండు గంటల ముందు నీరు పెడితే వేర్లు తెగకుండా ఉంటాయి. నేలను ఎలా సిద్ధం చేయాలి.. నేలను మూడు, నాలుగు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 8-12 టన్నుల కుళ్లిన పశువుల ఎరువును వేయాలి. గత పంట తాలూకు అవశేషాలు తొలగించి తగులబెట్టాలి. నాటు దూరం: మొక్కలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నాటాలి. వరుసల మధ్య 60 సెం.మీలు, మొక్కల మధ్య 40-50 సె.మీ దూరం ఉండాలి. ఎరువుల యాజమాన్యం: మొదటి డోసు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-12 టన్నుల కుళ్లిన పశువుల ఎరువు వేయాలి. 150 కిలోల సూపర్‌పాస్పేట్, 50 కిలోల పొటాష్ కూడా వేసి దుక్కిని కలియ దున్నాలి. మొక్క పెరగుతున్న దశలో 30, 45, 60వ రోజున మూడు దఫాలుగా సమపాళ్లలో 90 కిలోల యూరియా వేసి బోదెలు చేసి నీరు కట్టాలి. నీటి యాజమాన్యం: నాటుకున్న వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. ప్రతి 7 నుంచి 10 రోజులకు ఓసారి నీరు పెడుతూ ఉండాలి. కాయ వచ్చే దశలో చాలా రోజులు నీరు పెట్టకుండా ఒకేసారి నీరు భారీగా పెడితే పంటకు నష్టం వాటిల్లుతుంది. కాయ పగుళ్లు వస్తాయి. అంతర్ కృషి టమాట పంట నాటిన మొదటి నాలుగైదు వారాలలోపే కలుపు మొక్కలు పీకి వేయాలి. మట్టిని మొక్క మొదళ్లకు ఎగదోయాలి. నాటిన రెండు రోజుల తర్వాత కలుపు మందును తడి నేలపై బాగా పిచికారీ చేయాలి. కలుపు మొక్కలను తొలగించేందుకు పెండిమెథిలీన్ను లీటర్ నీటికి 6 మి.లీ కలుపుకొని పిచికారీ చేయాలి. సస్యరక్షణ కాయ తొలుచు పురుగు టమాటాకు తీవ్రనష్టం కలిగించే పురుగు ఇది. ఈ పురుగు లేత ఆకులు, మొగ్గలు, పూత, కాయలపై గుడ్లు పెడుతుంది. వీటి డింబకాలు లేత ఆకులను తింటాయి. పెద్ద పురుగులు కాయకు రంధ్రాలు చేసి తినేస్తాయి. ఈ పురుగులు ముదురు ఆకుపచ్చ, నలుపు లేదా గోధుమరంగుల్లో ఉంటాయి. వీటి జీవన కాలం నాలుగు నుంచి ఆరు వారాలు. కాయపై గుండ్రని రంధ్రాలు కనిపించాయంటే కాయ తొలుచు పురుగు ఆశించినట్టేనని అర్థం చేసుకోవాలి. నివారణ ఎరపంటగా బంతిని వేసుకోవాలి. బంతి నారును టమాటా పంట వేయడానికి 20 రోజుల ముందుగానే నాటాలి. ప్రతి 16 వరుసల టమాటాకు ఒక వరుస బంతి నారును నాటుకోవాలి. నారు వేయగానే ఈ పురుగులు ముందుగా బంతిని ఆశ్రయిస్తాయి. బంతిపై ఈ పురుగును చూడగానే టమాటాపై మందు చల్లుకోవాలి. ఎస్పీవై వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 మి.లీ చొప్పున పిచికారీ చేయాలి. 28, 35వ రోజున ఎండోసల్ఫాన్ లేదా ప్రోఫనోఫాస్ లేదా క్వినాల్ఫాస్ ద్రావణాన్ని లీటరుకు 2 మి.లీ చొప్పున కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. అక్షింతల పురుగు.. డింభకం పెద్ద పురుగు పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని తిని వేస్తుంది. ఇవి తినివేసిన ఆకులు రంధ్రాలతో తెరవలె కనిపిస్తాయి. దీని నివారణకు కార్బరిల్ 50 శాతం పొడిని లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి చల్లాలి. తెగుళ్లు నారుకుళ్లు...ఈ తెగులు నారుమళ్లలోని నారుకు సోకుతుంది. కొన్ని సార్లు నారు రాకముందే ఈ తెగులు సోకి మొదళ్లు కుళ్లి చనిపోతాయి. నారుమడి దశలోనే ఏర్పడే ఈ తెగులు 2-4 రోజుల్లోపే మొత్తం వ్యాపిస్తుంది. ఒకశాతం బోర్డాక్స్ మిశ్రమం లేదా కాఫ్టాన్ 2.5 గ్రాములు, లేదా మెటలాక్సిల్ను లీటరు నీటికి రెండు గ్రాములు కలుపుకొని చల్లుకోవాలి. ప్రతి 8-10 రోజుల వ్యవధిలో ఇలా పిచికారీ చేయాలి. మొదలు కుళ్లు: ప్రతికూల పరిస్థితులు లేదా వేడి వాతావరణంలో ఈ తెగులు సోకుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా ఎండిపోతాయి. భూమిని ఆనుకొని ఉండే కాండం మొదలు, భూమిని తాకి ఉండే కణాలు చనిపోయిన సందర్భాల్లో కనిపిస్తాయి. నివారణ: నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్ కిలో విత్తనానికి పట్టించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్లలో చల్లి దీన్ని అరికట్టాలి.