లాభాల పంట టమాట | Management practices to maintain high yields | Sakshi
Sakshi News home page

లాభాల పంట టమాట

Published Wed, Aug 20 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

Management practices to maintain high yields

 ఖమ్మం వ్యవసాయం: టమాట సాగుకుమురుగు నీటి వసతి ఉన్న నేలను ఎంపిక చేసుకోవాలి. దాన్ని 3-4 సార్లు దున్నాలి. చివరి దుక్కిలో 40 కిలోల కుళ్లిన పశువుల ఎరువు, నాలుగు కిలోల సూపర్ పాస్పేట్‌ను 40 చ.మీ నారుమడికి చేర్చాలి. మడి నాలుగు మీటర్ల పొడవు, మీటర్ వెడల్పుతో 15 సె.మీ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మడుల మధ్య అర మీటర్ దూరంతో ఎకరానికి 10 మళ్లు చేసుకోవాలి.

 విత్తటం...
 వరుసల మధ్య 10 సెంటీమీటర్ల దూరంతో 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. విత్తనానికి మధ్య దూరం 1 నుంచి 1.5 సెం.మీలు ఉండాలి. విత్తిన తర్వాత రోజ్‌క్యాన్‌తో నీరు పెట్టాలి. మొలకెత్తే వరకు నారుమడిని ఎండుగడ్డితో కప్పాలి. దీనివల్ల భూమిలో విత్తనాలు సక్రమంగా ఉండటమే గాక పక్షుల బారీనపడకుండా ఉంటాయి. మొలకెత్తే వరకు రోజుకు రెండుసార్లు, ఆ తరువాత ప్రతిరోజూ సాయంత్రం కొంచెంగా నీరు పెడుతూ ఉండాలి. కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన తరువాత 4-5 ఆకులు వచ్చే దశ రాగానే నారును పీకి నాటుకోవచ్చు. ఈ దశ రావటానికి 30-35 రోజుల సమయం పడుతుంది. ఐదారు రోజుల ముందు నుంచి నీటి తడులు తగ్గిస్తే నారు దృఢంగా ఉంటుంది. నారు పీకడానికి రెండు గంటల ముందు నీరు పెడితే వేర్లు తెగకుండా ఉంటాయి.

 నేలను ఎలా సిద్ధం చేయాలి..
 నేలను మూడు, నాలుగు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 8-12 టన్నుల కుళ్లిన పశువుల ఎరువును వేయాలి. గత పంట తాలూకు అవశేషాలు తొలగించి తగులబెట్టాలి.

 నాటు దూరం: మొక్కలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నాటాలి. వరుసల మధ్య 60 సెం.మీలు, మొక్కల మధ్య 40-50 సె.మీ దూరం ఉండాలి.
 
ఎరువుల యాజమాన్యం:
  మొదటి డోసు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-12 టన్నుల కుళ్లిన పశువుల ఎరువు వేయాలి. 150 కిలోల సూపర్‌పాస్పేట్, 50 కిలోల పొటాష్ కూడా వేసి దుక్కిని కలియ దున్నాలి. మొక్క పెరగుతున్న దశలో 30, 45, 60వ రోజున మూడు దఫాలుగా సమపాళ్లలో 90 కిలోల యూరియా వేసి బోదెలు చేసి నీరు కట్టాలి.

 నీటి యాజమాన్యం: నాటుకున్న వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. ప్రతి 7 నుంచి 10 రోజులకు ఓసారి నీరు పెడుతూ ఉండాలి. కాయ వచ్చే దశలో చాలా రోజులు నీరు పెట్టకుండా ఒకేసారి నీరు భారీగా పెడితే పంటకు నష్టం వాటిల్లుతుంది. కాయ పగుళ్లు వస్తాయి.

 అంతర్ కృషి
 టమాట పంట నాటిన మొదటి నాలుగైదు వారాలలోపే కలుపు మొక్కలు పీకి వేయాలి. మట్టిని మొక్క మొదళ్లకు ఎగదోయాలి. నాటిన రెండు రోజుల తర్వాత కలుపు మందును తడి నేలపై బాగా పిచికారీ చేయాలి. కలుపు మొక్కలను తొలగించేందుకు పెండిమెథిలీన్‌ను లీటర్ నీటికి 6 మి.లీ కలుపుకొని పిచికారీ చేయాలి.

 సస్యరక్షణ కాయ తొలుచు పురుగు
 టమాటాకు తీవ్రనష్టం కలిగించే పురుగు ఇది. ఈ పురుగు లేత ఆకులు, మొగ్గలు, పూత, కాయలపై గుడ్లు పెడుతుంది. వీటి డింబకాలు లేత ఆకులను  తింటాయి. పెద్ద పురుగులు కాయకు రంధ్రాలు చేసి తినేస్తాయి. ఈ పురుగులు ముదురు ఆకుపచ్చ, నలుపు లేదా గోధుమరంగుల్లో ఉంటాయి. వీటి జీవన కాలం నాలుగు నుంచి ఆరు వారాలు. కాయపై గుండ్రని రంధ్రాలు కనిపించాయంటే కాయ తొలుచు పురుగు ఆశించినట్టేనని అర్థం చేసుకోవాలి.

 నివారణ
 ఎరపంటగా బంతిని వేసుకోవాలి. బంతి నారును టమాటా పంట వేయడానికి 20 రోజుల ముందుగానే నాటాలి. ప్రతి 16 వరుసల టమాటాకు ఒక వరుస బంతి నారును నాటుకోవాలి. నారు వేయగానే ఈ పురుగులు ముందుగా బంతిని ఆశ్రయిస్తాయి. బంతిపై ఈ పురుగును చూడగానే టమాటాపై మందు చల్లుకోవాలి. ఎస్‌పీవై వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 మి.లీ చొప్పున పిచికారీ చేయాలి. 28, 35వ రోజున ఎండోసల్ఫాన్ లేదా ప్రోఫనోఫాస్ లేదా క్వినాల్‌ఫాస్ ద్రావణాన్ని లీటరుకు 2 మి.లీ చొప్పున కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.

 అక్షింతల పురుగు..
 డింభకం పెద్ద పురుగు పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని తిని వేస్తుంది. ఇవి తినివేసిన ఆకులు రంధ్రాలతో తెరవలె కనిపిస్తాయి. దీని నివారణకు కార్బరిల్ 50 శాతం పొడిని లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి చల్లాలి.

 తెగుళ్లు
 నారుకుళ్లు...ఈ తెగులు నారుమళ్లలోని నారుకు సోకుతుంది. కొన్ని సార్లు నారు రాకముందే ఈ తెగులు సోకి మొదళ్లు కుళ్లి చనిపోతాయి.  నారుమడి దశలోనే ఏర్పడే ఈ తెగులు 2-4
 
 
 రోజుల్లోపే మొత్తం వ్యాపిస్తుంది. ఒకశాతం బోర్డాక్స్ మిశ్రమం లేదా కాఫ్టాన్ 2.5 గ్రాములు, లేదా మెటలాక్సిల్‌ను లీటరు నీటికి రెండు గ్రాములు కలుపుకొని చల్లుకోవాలి. ప్రతి 8-10 రోజుల వ్యవధిలో ఇలా పిచికారీ చేయాలి.

 మొదలు కుళ్లు: ప్రతికూల పరిస్థితులు లేదా వేడి వాతావరణంలో ఈ తెగులు సోకుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా ఎండిపోతాయి. భూమిని ఆనుకొని ఉండే కాండం మొదలు, భూమిని తాకి ఉండే కణాలు చనిపోయిన సందర్భాల్లో కనిపిస్తాయి.

 నివారణ: నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్ కిలో విత్తనానికి పట్టించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా బ్లైటాక్స్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదళ్లలో చల్లి దీన్ని అరికట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement