ఇంద్రవెల్లి: టమాటా సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. చేతికొచ్చిన టమాటా పంటకు మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉండి పంట చేతికొచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారు. అమ్మగా మిగిలిన టమాటాలను పశువులకు మేత గా వేస్తున్నారు.
పెట్టుబడి అధికం..
మండలకేంద్రంతో పాటు మండలంలోని ఈశ్వర్‌నగర్, అంజీ, ఏమైకుంట, కేస్లాగూడ, కేస్లాపూర్, ముట్నూర్, శంకర్‌గూడ, దన్నోర(బీ), గౌరపూర్, రాంపూర్ తదితర గ్రామాల్లో సుమారు 2వేల,611 ఎకరాలకుపైగా టమాటా సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక నాటిన టమాటా మొక్కలు చనిపోవడంతో రెండు నుంచి మూడు సార్లు అప్పులపాలయ్యారు. గతం కంటే ఈ ఖరీఫ్ సాగుకు రెండింతలు అధిక ఖర్చు చేశారు.
ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ప్రస్తుతం చేతికొచ్చిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు చేసే వ్యాపారస్తులు నాణ్యతను చూసి కొనుగోలు చేస్తున్నారు. 25 కిలోల టమాటాకు రూ.100 నుంచి రూ.130 ఉండడం, అందులో ఏరివేయగా మిగిలిన టమాటా పంటను రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. దీంతో చేసిన అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కాక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నష్ట పోయిన టమాటా పంటలపై సర్వే నిర్వహించి పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని మండలంలోని టమాటా రైతులు కోరుతున్నారు.
పశువులకు మేతగా టమాటా
Published Fri, Nov 7 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement