సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీపీసీసీ చీఫ్‌గా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తూనే, మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే విజయం సాధించింది.
మిగతా ఆరింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూరులలో బీజేపీ గెలుపొందగా, బీఆర్‌ఎస్ బోథ్, ఆసిఫాబాద్‌లలో విజయం సాధించింది. కాగా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్ అన్ని సభల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, చివరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ జరపాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
ఓటర్లను ఆకర్షించేలా మరో రెండు పథకాలు!
ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా మరో రెండు గ్యారంటీల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అందులో ఒకటి రూ.500కే గ్యాస్ సిలిండర్ కాగా, మరొకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
అయితే సబ్సిడీపై సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్‌మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం. కాగా రూ.500కే సిలిండర్‌ను నేరుగా తెచ్చినప్పుడే ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రూ.500కే గ్యాస్ వచ్చిన భావన మహిళలకు కలుగుతుందని, ఇది ఎన్నికల్లో ఉపకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.
ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి
Published Mon, Jan 29 2024 12:36 AM | Last Updated on Mon, Jan 29 2024 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment