భైంసారూరల్ : బడిలో ఆటలు ఆడుకోవడానికి విశాలంగా ఉన్న మైదానంలో టమాటా సాగు చేస్తూ విద్యార్థులు చదువులో ముందుకు ‘సాగు’తున్నారు. భైంసా పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో విశాలమైన మైదానం ఉంది. పిచ్చిమొక్కలతో నిండుగా కనిపించే మైదానంలో విషసర్పాలు తిరగకుండా చదును చేశారు. పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆ తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో టమాటా సాగుచేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులే కలుపుమొక్కలు తీస్తూ టమాటా పండిస్తున్నారు. అక్కడే టమాటాలు కోసి రోజు వారీ వసతి గృహ భోజనంలో వంటకు వినియోగిస్తున్నారు. తాము పండించిన టమాటాను వసతిగృహ విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఏడాదికాలంగా విద్యార్థులు టమాటా సాగు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలవారే...
గిరిజన ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికం. పంట పొలంలో వేసే టమాటాను పాఠశాలలో సాగు చేస్తూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజు బడిలో పాఠాలు చదువుతూ తీరిక సమయంలో ఇలా సాగు బాటలో శ్రమిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లోనూ ఈ విద్యార్థుల బృందం పాల్గొంటూ పాఠశాల పరిసరాలను శుభ్రం చేసుకుంది.
ప్రోత్సహిస్తున్నాం..
విద్యార్థుల్లో టమాటా సాగుపై ఆసక్తిని గమనించాం. అందుకు తగ్గట్లు వారిని ప్రోత్సహిస్తున్నాం. కొంతమంది విద్యార్థులు ఇతర కాయగూరలు సాగుచేద్దామంటున్నారు. ప్రస్తుతమైతే టమాటా సాగు చేశారు. సెలవుదినం ఉంటే అక్కడే ఉంటూ కలుపు మొక్కలు తీస్తూ పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. - అంబారావు, ప్రిన్సిపాల్
సాగు‘బడి’లో విద్యార్థులు
Published Tue, Nov 11 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement