వ్యర్థాలనుంచి కంపోస్ట్ ప్రచారంలో అమితాబ్
న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు 'వేస్ట్ టు కంపోస్ట్' ( వ్యర్థాలనుంచి ఎరువులు) ప్రచారంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. చెత్తను సేకరించి ఎరువుల కంపెనీలకు అమ్మకాలు చేపట్టడం, వ్యర్థాలనుంచి ఎరువుల తయారీ వంటి విషయాలపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిగ్ బీ ముందుకొచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార కార్యక్రమంలో అమితాబచ్చన్ ప్రధాన పాత్ర వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా నగరాల్లో పేరుకునే వ్యర్థాలను ఎరువులుగా మార్చి పొలాలకు ఉపయోగించే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. ఈ సందర్భంలో నగరాల్లోని చెత్తను కంపోస్ట్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మీరు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జూన్ 20న పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బిగ్ బీ కి ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తను కంపోస్ట్ గా మార్చి, ఇళ్ళలోని గార్డెన్లలో వినియోగించేందుకు ప్రజలకు, నర్సరీల యజమానులకు, ఉద్యానవన సంస్థలు, ఏజెన్సీలకు రేడియో, టీవీ ప్రకటనలు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించడంలో వ్యక్తిగతంగానూ, వాయిస్ ద్వారానూ భాగం పంచుకొంటూ.. స్వచ్ఛభారత్ ప్రచారంలో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మంత్రిత్వ శాఖ సదరు లేఖలో తెలిపింది.
అత్యధిక చెత్త ఏర్పడే అవకాశం ఉన్న హోటల్స్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి సేంద్రీయ వ్యర్థాలను విడివిడిగా వేయాలన్న విజ్ఞప్తుల ద్వారా పౌరులను ప్రోత్సహించడంలోనూ, బహుళ వేదికల ద్వారా సమాచార ప్రచారాన్ని చేరవేయడంలోనూ అమితాబ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ళ గడువులోగా దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.