'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇక‌పై చెక్‌! ఎలాగో తెలుసా? | If This Is Done, There Will Be No More Pollution Of Poultry Farms | Sakshi
Sakshi News home page

'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇక‌పై చెక్‌! ఎలాగో తెలుసా?

Published Tue, Dec 12 2023 1:05 PM | Last Updated on Tue, Dec 12 2023 1:05 PM

If This Is Done, There Will Be No More Pollution Of Poultry Farms - Sakshi

కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

లేయర్, బ్రీడర్‌ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్‌.

బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై (బిఎస్‌ఎఫ్‌) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్‌ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్‌ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్‌ఎఫ్‌ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు.

కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్‌ఎఫ్‌ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. 

లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్‌)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు:
► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు.
► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది.
► కోళ్ల ఫారంలో ఆక్సిజన్‌ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్‌డి సమస్య తగ్గుతుంది.
► విసర్జితాలను బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది.
► సున్నం, బ్లీచింగ్‌ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది.
► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి
► ఆర్గానిక్‌ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను  రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్‌ఎఫ్‌ లార్వా ఉపయోగపడుతుంది.
► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది.
► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్‌ఎఫ్‌ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది.

మరోన్నో ఉపయోగాలు..
► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్‌ఎఫ్‌ పురుగులు బతికి ఉండగానే లేయర్‌ కోళ్లకు, బ్రాయిలర్‌ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు.
► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్‌ఎఫ్‌ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు.
► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్‌ఎఫ్‌ లార్వాను మేపవచ్చని రమేష్‌ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959
- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఇవి చ‌ద‌వండి: మల్బరీ తోటలో.. స‌రికొత్త ప‌రిక‌రం గురించి మీకు తెలుసా!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement