స్పీడ్‌ బ్రీడింగ్‌ పద్ధతుల్లో.. అర్బన్‌ అన్నదాత! | Hyderabad Company Urban Kisan Has Developed Its Own Technologies For Urban Cultivation | Sakshi
Sakshi News home page

Sagubadi: స్పీడ్‌ బ్రీడింగ్‌ పద్ధతుల్లో.. అర్బన్‌ అన్నదాత!

Published Tue, May 21 2024 8:48 AM | Last Updated on Tue, May 21 2024 8:48 AM

Hyderabad Company Urban Kisan Has Developed Its Own Technologies For Urban Cultivation

అర్బన్‌ సాగు కోసం సొంత టెక్నాలజీలను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ సంస్థ ‘అర్బన్‌ కిసాన్‌’

అర్బన్‌ సాగుకు అనుగుణంగా స్పీడ్‌ బ్రీడింగ్‌ పద్ధతుల్లో అనేక కూరగాయలు, పండ్ల వంగడాల రూపుకల్పన

పూర్తిగా సొంత టెక్నాలజీతోనే దేశ విదేశాల్లో హైబ్రిడ్‌ స్మార్ట్‌ అర్బన్‌ ఫామ్స్‌ను భాగస్వామ్య పద్ధతిలో నెలకొల్పుతోంది

విస్తారమైన పొలాల్లో ఆరుబటయ సాగేది సంప్రదాయ వ్యవసాయం అయితే.. నియంత్రిత వాతావరణంలో అత్యాధునిక సాంకేతికతలతో చేసేదే అర్బన్‌ వ్యవసాయం. మట్టిలో కాకుండాపోషకాలతో కూడిన నీటిలో వర్టికల్‌ స్ట్రక్చర్లలో లేదా కొబ్బరి పొట్టుతో కూడిన గ్రోబాగ్స్‌లో అర్బన్‌ సాగు జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాగు వ్యవస్థలతోపాటు ప్రత్యేకంగా బ్రీడింగ్‌ చేసిన వంగడాలు కూడా అవసరమే అంటోంది ‘అర్బన్‌ కిసాన్‌’. మానవాళి రేపటి ఆహారపు, పర్యావరణ అవసరాలు తీర్చటం కోసం స్పీడ్‌ బ్రీడింగ్‌ తదితర పద్ధతుల్లో పరిశోధనలు చేపట్టి చక్కని పురోగతి సాధిస్తోంది. ఈ హైదరాబాద్‌ సంస్థ విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సహా పలు సంస్థల భాగస్వామ్యంతో అర్బన్‌ సాగు ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది.  

పట్టణీకరణ తామరతంపరగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతలతో కూడిన అర్బన్‌ ఫార్మింగ్‌ పద్ధతులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనివే హైడ్రోపోనిక్స్, సాయిల్‌ లెస్‌ ఫార్మింగ్, వర్టికల్‌ ఫార్మింగ్, ఇండోర్‌ ఫార్మింగ్‌ వంటివి. ఈ సాగు వ్యవస్థలను ముఖ్యంగా అర్బన్‌ రైతులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌ సమీపంలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది ‘అర్బన్‌ కిసాన్‌’. శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తూ అర్బన్‌ కిసాన్‌ అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ పండించిన లెట్యూస్, ఇటాలియన్‌ బసిల్‌ తదితర ఆకుకూరలు, రంగురంగుల కాప్సికం తదితర కూరగాయలతో తయారైన సలాడ్స్‌ను ఫార్మ్‌బౌల్‌ పేరుతో హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తోంది.

అర్బన్‌ సాగు కోసం ప్రత్యేక వంగడాలు..
హైదరాబాద్‌ నగర శివారు మేడ్చల్‌ మల్కజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లిపారిశ్రామికవాడలో అర్బన్‌ కిసాన్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. విహారి కానుకొల్లు, డాక్టర్‌ సాయిరాం రెడ్డిపాలిచర్ల కొందరు మిత్రులతోపాటు అర్బన్‌ కిసాన్‌ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. విహారి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, డా. సాయిరాం రెడ్డి, డా. నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్‌ ఫార్మింగ్‌ వ్యవస్థలను శీతల గదిలో,పాలీహౌస్‌లో, మేడపైన..  ఇలా అనేక వాతావరణ పరిస్థితుల్లో మట్టి లేకుండా వివిధ పంటలు పండించటంపై వారు లోతైన పరిశోధనలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ నగర శివారు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లి  పారిశ్రామికవాడలోని అర్బన్‌ కిసాన్‌ పరిశోధన కేంద్రంలో హైడ్రోపోనిక్స్‌ సాగు దృశ్యాలు

పొలాల్లో వాడే సాధారణ వంగడాలను నియంత్రిత వాతావరణంలో, పరిమిత స్థలంలో సాగు చేయటం అనేక ఇబ్బందులతో కూడిన పని. అందుకే అర్బన్‌ సాగుకు అవసరమైన ప్రత్యేక వంగడాల రూపుకల్పన  కృషికి అర్బన్‌ కిసాన్‌ శ్రీకారం చుట్టింది. మన దేశపు 150 రకాల కూరగాయలు, ఆకుకూరలపై ప్రయోగాలు చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పండటంతోపాటు.. వేర్ల పొడవు, మొక్క సైజు, ఆకారం తదితర అంశాల్లో అర్బన్‌ ఫార్మింగ్‌కు అనువుగా చిన్న సైజులో ఉండేలా అనేక సరికొత్త వంగడాలను రూపొందించామని డా. సాయిరాం రెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఇవి తిరిగివాడుకోదగిన సూటి రకాలేనని, వీటిని నియంత్రిత వాతావరణంలో ఏ దేశంలోనైనా పండించవచ్చన్నారు.

చెప్పినంత దిగుబడి..!
హైడ్రోపోనిక్స్‌ సాగు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే, ఎవరి దగ్గరా కంప్లీట్‌ టెక్నాలజీ లేదు. మా దగ్గర తప్ప. మేం వాడుతున్నది స్వయంగా మేం దేశీయంగా పరిశోధనల ద్వారా రూపొందించుకున్న పరిపూర్ణమైన, సమగ్ర సాంకేతికత ఇది. అందుబాటులో ఉన్న టెక్నాలజీలతోపోల్చితే 60% ఖర్చుతోనే మా టెక్నాలజీని అర్బన్‌ ఫార్మర్స్‌ పొందవచ్చు. దీని ద్వారా చెప్పినంత దిగుబడి కచ్చితంగా ఇస్తుంది. ప్రపంచంలో ఎవరైనా టెక్నాలజీ అమ్ముతారు లేదా ్రపొడక్టు అమ్ముతారు. మేం అలాకాదు. ఇతర సంస్థలతో కలిసి భాగస్వామ్యంలో యూనిట్లు నెలకొల్పి ఉత్పత్తి చేసి విక్రయించి లాభాలు పంచుకుంటాం. ఈ పద్ధతిలోనే అనేక దేశాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాం. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే హైడ్రోపోనిక్‌ కూరగాయలు, ఆకుకూరలను ప్రీమియం ప్రైస్‌తో అమ్మగలగాలి. మానవాళి భవిష్యత్తు ఆహారపు అవసరాలు తీర్చగలిగిన శక్తిసామర్థ్యాలున్న టెక్నాలజీ ఇది.

– డాక్టర్‌ సాయిరాం రెడ్డి, పాలిచర్ల, అర్బన్‌ కిసాన్‌ పరిశోధనా కేంద్రం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా sai@urbankisaan.com

2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలు..
బెండ, టొమాటో, పచ్చిమిర్చి వంగ తదితర కూరగాయల్లో ఒక్కో రకానికి సంబంధించి 2–3 రకాల వంగడాలను రూపొందించారు.  ఫంగస్‌ సోకని బేసిల్‌ (ఇటాలియన్‌ తులసి)ను రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ, కాండం తెల్లగా ఆకు గ్రీన్‌గా ఉండే రకరకాల తోటకూర రకాలను రూపొందించారు.పాలకూర, కొత్తిమీర, గోంగూరలో కూడా కొత్త వంగడాలను రూపొందించారు.  కీరదోస, సొర, కాకర వంటి తీగజాతులు పొలినేషన్‌ అవసరం లేకుండా దిగుబడినిచ్చే విధంగా రూపొందిస్తున్నాం అన్నారు డా. సాయిరాం. సాధారణంగా ఒక కొత్త వంగడాన్ని బ్రీడింగ్‌ చేయాలంటే 6–7 ఏళ్లు పడుతుంది. స్పీడ్‌ బ్రీడింగ్‌ పద్ధతిలో తాము 2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలను రూపొందించగలిగామన్నారు.

95 శాతం నీటి ఆదా..!
వేగవంతమైన నగరీకరణ నేపథ్యంలో నగరాల్లో ఏడాది పొడవునా అర్బన్‌ప్రాంతీయులకు తాజా ఆకుకూరలు, కూరగాయలు అందించడానికి ద్రవరూప ఎరువులతో చేసే వర్టికల్‌ ఫార్మింగ్‌ ఉపయోగపడుతోంది. హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో పంటలు పండించటం వల్ల కలిగే ప్రయోజనాలను భారత్‌తోపాటు ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. సాధారణ వ్యవసాయంలో వాడే నీటితోపోల్చితే ఈ పద్ధతిలో 95% ఆదా అవుతుంది. పొలంలో పంటతోపోల్చితే నిర్దిష్టమైన స్థలంలో 30 రెట్లు అధిక దిగుబడి సాధించడానికి హైడ్రోపోనిక్స్‌ ఉపయోగపడుతుందని, అందులోనూ ఈ సాంకేతికతను దేశీయంగానే అభివృద్ధి చేశామని అర్బన్‌ కిసాన్‌ చెబుతోంది. 

సాగులో ఉన్న పంటల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగాపోషకాల మోతాదు, పిహెచ్‌ స్థాయిలు, వాతావరణంలో తేమ, కార్బన్‌డయాక్సయిడ్‌ స్థాయి, కాంతి తీవ్రత వంటి అనేక ఇతర అంశాలన్నిటినీ ఒక యాప్‌ ద్వారా నియంత్రిస్తుండటం విశేషం. వర్టికల్‌ ఫార్మింగ్‌ వ్యవస్థల్లో కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను ఉపయోగిస్తూ ఫార్మింగ్‌ ఆటోమేషన్‌లో అర్బన్‌ కిసాన్‌ తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోపోనిక్స్‌ సాగు జరుగుతున్నా ఇందులో అన్ని దశలకు సంబంధించిన సంపూర్ణ సాంకేతికత ఒకే చోట అందుబాటులో లేదు. అర్బన్‌ కిసాన్‌ పూర్తిగా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం విశేషం.

మధ్యప్రాచ్య దేశాల్లో ఆదరణ..
అర్బన్‌ కిసాన్‌ ఇండోర్‌ హైడ్రోపోనిక్స్‌ యూనిట్లలో పూర్తిస్థాయిలో ఆటోమేషన్‌ చేస్తారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కృత్రిమ మేథ, సెన్సార్ల ఆధారంగానే ఫామ్‌ యాజమాన్యం ఉంటుంది. దుబాయ్, ఒమన్, ఖతార్‌ దేశాల్లో మూడేళ్ల క్రితం 50% భాగస్వామ్యంతో హైడ్రోపోనిక్స్‌ యూనిట్‌ను నెలకొల్పాం. అదే మాదిరిగా బహామాస్‌ దేశంలోనూ 50% భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యూనిట్‌ను కూడా తాము ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నామని డా. సాయిరాం రెడ్డి వివరించారు. అక్కడ ఆకుకూరల ధర కిలో 12 డాలర్లు. మా యూనిట్లలో కిలో 5 డాలర్లకే ఆకుకూరలను ఉత్పత్తి చేస్తున్నాం. అమెరికా, కెనడా, నార్వే దేశాల్లో కూడా జాయింగ్‌ వెంచర్లు ఏర్పాటు చేయబోతున్నాం.

మన దేశంలో హైడ్రోపోనిక్స్‌ యూనిట్లకు పారిశ్రామిక విద్యుత్తు చార్జీలు వర్తిస్తుండటం ఈ హైటెక్‌ సాగు విస్తరణకు ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికైతే ఇది కాస్త ఖరీదైన ప్రత్యామ్నాయ ఆహారోత్పత్తి పద్ధతే. కానీ,పోషక విలువలున్న, పురుగుమందుల్లేని ఆహారాన్ని అందించే ఈ పద్ధతి ఏదో ఒక రోజున మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వస్తుందని అర్బన్‌ కిసాన్‌ ఆశాభావంతో ముందడుగు వేస్తోంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇవి చదవండి: కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement