విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు.
బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు.
2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు.
రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు.
చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment