కోనేటి శైలజ
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్‌బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం
ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్‌లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్‌వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ.
శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్‌లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది.
ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు.
శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు.
మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు
శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు.
ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్‌వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే.
‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ.
గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే!
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన.
– కోనేటి శైలజ, (9912197746),ఎస్‌బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా
కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం.
– తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి.
ఫొటోలు: కేతారి మోహన్‌కృష్ణ
నిర్వహణ: పంతంగి రాంబాబు
చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా?
Comments
Please login to add a commentAdd a comment