నెక్రమ్ మిశ్రా, చెరువాయల్ రామన్, డాక్టర్ ఖాదర్ వలి, పతయత్ సాహు, మోదడుగు విజయ్ గుప్తా, తులారామ్ ఉపేతి
2023 పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో వ్యవసాయంతో సంబంధం ఉన్న వారంతా (ప్రసిద్ధ ఆక్వా శాస్త్రవేత్త డా. విజయ్‌గుప్తా మినహా) దేశీ వంగడాలతో ప్రకృతి, సేంద్రియ తరహా సేద్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారే. అంతేకాదు, నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్) 9 పంటల మిశ్రమ ప్రకృతి సాగు చేస్తున్నారు.
పతయత్ సాహు (ఒడిషా) ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. చెరువాయల్ రామన్ (కేరళ) దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు. తులారామ్ ఉపేతి (సిక్కిం) 80 ఏళ్లుగా వారసత్వ సేంద్రియ సేద్యం చేస్తున్న కురువృద్ధుడు కావటం విశేషం.
పురాతన ‘అటవీ కృషి’ పద్ధతిని పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన డా. ఖాదర్ వలి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరులో జన్మించినా మైసూరులో స్థిరపడినందున కర్ణాటక కోటాలో ఎంపికయ్యారు. వీరి కృషి గురించి రేఖామాత్రంగా...
తొమ్మిది పంటల మిశ్రమ సేద్యం
నెక్రమ్ శర్మ (59).. మంచు కొండల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు. ఈ ఏడాది ఆ రాష్ట్రం నుంచి పద్మశ్రీకి ఎంపికైంది ఆయనొక్కరే. ప్రభుత్వ ఉద్యోగం కోసం విఫలయత్నం చేసిన ఆయన తదనంతరం సేద్యాన్నే వృత్తిగా ఎంచుకున్నారు.
నాలుగున్నర ఎకరాల వారసత్వ భూమిలో 38 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతింటున్నదని గుర్తించి, 22 ఏళ్ల క్రితమే సుభాష్ పాలేకర్ బాటలో ప్రకృతి సేద్యంలోకి మళ్లారు.
కనీసం 3 డజన్ల పంటలకు చెందిన దేశీ విత్తనాలను ఆయన పరిరక్షిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. పది వేల మంది రైతులకు ఆయన ఉచితంగా దేశీయ విత్తనాలు పంచిన ఘనత ఆయనిది.
‘నౌ అనజ్’ (9 పంటలు) అనే పురాతన ప్రకృతి సేద్య పద్ధతిని శర్మ పునరుద్ధరించారు. పొలంలో కనీసం 9 రకాల పంటలు కలిపి మిశ్రమ సాగు చేస్తున్నారు. తిండి గింజలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, తీగజాతి పంటలను కలిపి ఒకే పొలంలో సాగు చేస్తారు. వానాకాలంలో 9 పంటలు, శీతాకాలంలో మరో 9.. ఏటా 18 పంటలను ఆయన సాగు చేస్తున్నారు.
20 ఏళ్లుగా దేశీ విత్తన పరిరక్షణపై కృషి చేస్తున్నారు. 8 రకాల చిరుధాన్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకృతి సాగు వల్ల 50% నీటి అవసరం తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. దేన్నీ బయట నుంచి తెచ్చి వేసే అవసరం లేదంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నానని, మంచి ఆహారాన్ని ఇష్టపడే స్నేహితులే తనకు బలమని అన్నారు. ‘రోజుకు 14 గంటలు పనిచేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు బాధ్యతను పెంచింది. ఇక 18 గంటలు పనిచేస్తా’నంటున్నారు నెక్రమ్ శర్మ వినమ్రంగా.
పగలు సేద్యం.. రాత్రి వైద్యం
పతయత్ సాహు (67).. విశిష్ట వ్యవసాయ వైద్యుడు. ఒడిషాలోని కలహండి జిల్లా నందోల్ ఆయన స్వగ్రామం. 40 ఏళ్లుగా దాదాపు 3 వేల ఔషధ మొక్కలను తన ఎకరంన్నర భూమిలో పూర్తి సేంద్రియంగా పెంచుతూ.. ఆ మూలికలతోనే ప్రజలకు వైద్యం చేస్తున్నారు.
ప్రతి మొక్క గుణగణాల గురించి తడుముకోకుండా అనర్ఘళంగా చెప్పగలరాయన. పగలు ఔషధ మొక్కల తోట పనులు స్వయంగా చేసుకుంటూ బిజీగా గడిపే సాహు.. రాత్రిపూట ప్రజలకు వైద్యం చేస్తారు. ఇంతని ఫీజు అడగరు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. యుక్తవయసులోనే ఆసక్తితో ఔషధ మొక్కలు సేకరించి పెంచటం అలవాటు. తాత ఆయుర్వేద వైద్యుడు.
చదువు అయ్యాక తాత దగ్గరే సంప్రదాయ ఆయుర్వే వైద్యం నేర్చుకున్నారు. ఇప్పుడున్న 3 వేల జాతుల ఔషధ మొక్కల్లో చాలా వరకు స్వరాష్ట్రంలో అరణ్యాల్లో నుంచి అటవీ అధికారులతో పాటు వెళ్లి ఎన్నో అరుదైన మొక్కలను సేకరించారు. 500 రకాలను ఒడిషా ఔషధ మొక్కల బోర్డు తోడ్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి సంరక్షిస్తున్నారు. ఔషధ మొక్కల జీవవైవిధ్యానికి ఆయన క్షేత్రం నిలయంగా మారింది.
వ్యవసాయంతో వైద్యంతో అనుసంధానం చేయటం విశేషం. అరుదైన ఔషధులను పరిరక్షిస్తూ వాటి ప్రయోజనాలను అక్షరబద్ధం చేసి కొత్త తరానికి అందించటం గొప్ప సంగతి.
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
డాక్టర్ ఖాదర్ వలి (65).. సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కడు కృషి) పునరుద్ధరించి సిరిధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త. కమతం చిన్నదైనా అందులో 20% విస్తీర్ణంలో అడవిని పెంచుకుంటూ.. మిగతా స్థలంలో సీజనల్ పంటలు సాగు చేయటమన్నది ‘అటవీ కృషి’లో ఒక అంశం.
‘కడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువును రూపొందించారు. రసాయనాల్లేకుండా వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే మనకు, ప్రకృతికి మేలు చేసే సేద్యమని ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి ‘సిరిధాన్యాలు’ తింటూ హోమియో/ఆయుర్వేద మందులు వాడుతుంటే.. మధుమేహం నుంచి కేన్సర్ వరకు ఏ జబ్బయినా 6 నుంచి 2 ఏళ్లలోగా తగ్గిపోతాయంటారు డా. ఖాదర్.
వరి, గోధుమలకు బదులు రోజువారీ ప్రధాన ఆహారంగా సిరిధాన్యాలను ఒక్కో రకాన్ని రెండు, మూడు రోజులు మార్చి మార్చి తినాలి. కొత్తగా అలవాటు చేసుకునే వారు 6 వారాల పాటు అన్నంగా కాకుండా అంబలి రూపంలో, కూరలు నంజుకుంటూ, తాగాలన్నది ఆయన సూచన. ఐదేళ్ల క్రితం డా. ఖాదర్‌ని ‘సాక్షి సాగుబడి’ తెలుగువారికి తొలిసారి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
నీలి విప్లవ మార్గదర్శి
మోదడుగు విజయ్ గుప్తా (83).. ఆక్వాకల్చర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శాస్త్రవేత్త. సముద్రతీర ప్రాంత పట్టణం బాపట్లలో జన్మించారు. మత్స్యకారుల జీవితాల్లో మార్పు తేవాలన్న ఆసక్తితో కృషి చేసి అంతర్జాతీయ స్థాయి మత్స్యశాస్త్రవేత్తగా ఎదిగారు. ఆగ్నేయాసియాలో నీలి విప్లవానికి మార్గదర్శకుడిగా పేరుగాంచారు.
22 దేశాల్లోని చిన్న రైతులు, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చేపల పెంపకం పద్ధతులను రూపొందించారు. మలేషియాలోని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫిష్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని చేపల వినియోగాన్ని తలసరిన 5 కిలోల నుంచి 15 కిలోలకు పెంపొందించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చని విజయ్ గుప్తా సూచిస్తున్నారు. ఆక్వా శాస్త్రవేత్తగా ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (2005)ని, మొదటి సన్‌హాక్ శాంతి బహుమతి(2015)ని గెలుచుకున్నారు.
సేంద్రియ సేద్య కురువృద్ధుడు
తులారామ్ ఉపేతి.. 98 ఏళ్లు ఉపేతి గత 80 ఎనభయ్యేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 2023లో పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యవసాయదారుల్లోకెల్లా ఈయనే పెద్ద. సిక్కిం తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అక్కడి రైతులు ముఖ్యపాత్ర పోషించారు.
ఐదో తరగతి చదివిన ఉపేతి చిన్నతనం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగించారు. ఇతర రైతులకు మార్గనిర్దేశం చేశారు.
సిక్కిం భారత్‌లో కలవక ముందు టిబెట్‌లోని యటుంగ్‌కు భుజాలపై మోసుకెళ్లి ధాన్యం, మొక్కజొన్నలను అమ్మేవారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తులారామ్ ఐదారేళ్ల క్రితం వరకు స్వయంగా పొలానికి వెళ్లి పనులు చేయించేవారు.
దేశీ వరి వంగడాలే ప్రాణం!
చెరువాయల్ రామన్(72).. కేరళకు చెందిన ఆదివాసీ సేంద్రియ రైతు. దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారుడు కూడా. వయనాడ్ ప్రాంతంలో మనంతవాడి పంచాయతీలోని కమ్మన గ్రామంలో ఆయన నివశిస్తారు. రామన్ 150 ఏళ్ల నాటి వారసత్వ పూరింట్లోనే, విత్తనాల కుండల మధ్యనే, ఇప్పటికీ నివాసం ఉంటున్నారు.
స్థానికంగా ‘గార్డియన్ ఆఫ్ నేటివ్ పాడీ’గా ప్రసిద్ధి చెందారు. రామెట్టన్ అని కూడా ఆయన్ను పిలుస్తారు. ఔషధ గుణాలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే గుణం వంటి ప్రత్యేకతలు కలిగిన స్వదేశీ వరి రకాలు శతాబ్దాలుగా మన దేశంలో వాడుకలో ఉన్నాయి. అయితే, హైబ్రిడ్, జన్యుమార్పిడి వరి రకాల రాకతో దేశీ రకాలు చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చెరువాయల్ రామన్ తన 4 ఎకరాల పొలంలో 1.5 ఎకరాలను 22 ఏళ్ల క్రితం దేశీ వరి సాగుకు కేటాయించారు (మిగతా పొలంలో ఇతర పంటలు పండిస్తున్నారు). 54 దేశవాళీ రకాల వరిని ప్రతి ఏటా పండిస్తూ సంరక్షిస్తున్నారు. తన జీవితాన్ని దేశీ విత్తనాల పరిరక్షణకే అంకితం చేశారు. వయనాడ్ ప్రాంతంలో కురిచ్య గిరిజన జాతిలో పుట్టిన ఆయన ఆసుపత్రి వార్డెన్‌గా ఉద్యోగం చేసేవారు.
అయితే, తమ గిరిజన కుటుంబాలు పురాతన దేశీ వరిసేద్యానికి క్రమంగా స్వస్తి చెబుతుండటాన్ని గుర్తించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. 2004 నుంచి దేశీ వరి రకాలను ఉద్యమ స్ఫూర్తితో తాను సాగు చేయటమే కాదు. ఆ ప్రాంతంలో రైతులను కూడగట్టి సంఘంగా ఏర్పరిచి దేశీ వరి సాగును విస్తృతం చేశారు.
అపురూపమైన దేశీ వరి విత్తనాలు డబ్బు కన్నా విలువైనవని ఆయన భావన. అందుకే విత్తనాలను అమ్మరు. ఉచితంగా ఇస్తారు. పండించిన తర్వాత అంతే పరిమాణంలో విత్తనాలను తనకు తిరిగి ఇవ్వాలి. అదొక్కటే షరతు. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘జీనోమ్ సేవియర్ పురస్కారం’ ప్రదానం చేసి గౌరవించింది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్!
Comments
Please login to add a commentAdd a comment