ఎంచక్కా ఎర్రల ఎవుసం! | Adilabad Farmer Turns Organic Farming | Sakshi
Sakshi News home page

ఎంచక్కా ఎర్రల ఎవుసం!

Published Tue, Jun 30 2020 8:12 AM | Last Updated on Tue, Jun 30 2020 8:12 AM

Adilabad Farmer Turns Organic Farming - Sakshi

వర్మీ బెడ్‌లో కంపోస్టును పరిశీలిస్తున్న పాటిల్‌

మట్టిని నమ్ముకొని మనుగడ సాగించే వాడు రైతు. కేవలం తన ఆదాయం గురించే కాకుండా.. పొలంలో మట్టి బాగోగుల గురించి కూడా పట్టించుకునే రైతే నిజమైన కృషీవలుడు. నేలతల్లి అనారోగ్యాన్ని పసిగట్టి, రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్థి చెప్పి సేంద్రియ వ్యవసాయం చేపట్టిన ఆదర్శ రైతులు ఇప్పుడు తెలుగు నాట చాలా మందే కనిపిస్తున్నారు. అయితే, ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచే సేంద్రియ సేద్య బాటన ఆయన తొలి అడుగులు వేశారు. పదిహేడేళ్ల క్రితం నుంచే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటూ ఆర్థికంగానూ పురోగమిస్తున్న ఓ తెలుగు రైతు విజయగాథ ఇది..  

‘ఎర్రల ఎరువు’ (వర్మీ కంపోస్టు)తో ఆర్జునే దయానంద్‌ పాటిల్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయనది ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధనోర–బి గ్రామం. గత 17 ఏళ్లుగా వర్మీ కంపోస్టుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పి సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు తీస్తున్నారు. పంట వ్యర్థాలతోపాటు పశువుల పేడ ముడిపదార్థాలుగా వేసి భూమిని సారవంతం చేయగల వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. తన పొలంలో వాడటంతో పాటు ఆసక్తి కలిగిన ఇతర రైతులకూ వర్మీ కంపోస్టును అందుబాటులోకి తెస్తున్నారు. 

2003లో శ్రీకారం
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దయానంద్‌ పాటిల్‌కు 8 ఎకరాల 19 గుంటల పొలం ఉంది. నల్ల నేల. స్వగ్రామం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో ఆ రాష్ట్రం వెళ్లి వస్తూ ఉంటారు. ఆయనకు ఊహ తెలిసిన నాటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం జరుగుతూ ఉంది. అయితే, తమ భూమిలో సారం ప్రతి ఏటా తగ్గుతున్నట్లు గుర్తించారు పాటిల్‌. మహారాష్ట్ర వెళ్లినప్పుడు ఒక చోట వర్మీ కంపోస్టు గురించి 2002లో తెలిసింది. భూమిని సారవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో చిన్నపాటి వర్మీ కంపోస్టు యూనిట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి వర్మీ కంపోస్టును పాటిల్‌ వదిలిపెట్టలేదు. వర్మీ కంపోస్టు అతని భూమిని సారవంతం చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని, అంతకుమించిన గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. అధిక దిగుబడులు సాధించడంతో జిల్లా కలెక్టర్‌ దగ్గరి నుంచి రాష్ట్ర కమిషనర్‌ వరకు ఆయన సేంద్రియ పంటలను స్వయంగా వచ్చి చూసి ప్రశంశలు కురిపించారు. 

పత్తి, మిర్చి, జొన్న, కూరగాయ పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తుండడంతో 2006లో ఆయనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ పిలిపించి, రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డుతో పాటిల్‌ను సత్కరించారు. భుజం తట్టి ప్రశంసించారు. ఆ తర్వాత మరింత శ్రద్ధతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పాటిల్‌ ‘సాక్షి’తో చెప్పారు. 

ఉల్లి పంటను చూపుతున్న సేంద్రియ రైతు పాటిల్‌ 

వర్మీ కంపోస్టు ఉత్పత్తి ఇలా.. 
పాటిల్‌ పొలం దగ్గర షెడ్ల కింద ఇప్పుడు 8 బెడ్స్‌లో వర్మీ కంపోస్టు ఉత్పత్తి అవుతున్నది. బెడ్‌ 3 అడుగుల లోతు ఉండేలా నిర్మించాలి. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రధాన ముడి సరుకు పశువుల పేడ, పంట వ్యర్థాలు. త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉన్న సోయా కట్టె, శనగ కట్టె, కంది కట్టెను ముక్కలు చేసి బెడ్స్‌లో వేస్తారు. పంటల్లో తీసిన కలుపు మొక్కల్ని కూడా వేస్తారు. 20 వరకు నాటు ఆవులు ఉన్నాయి. వాటి పేడను వేసి.. ఆస్ట్రేలియా జాతికి చెందిన ఇసానియా ఫోటిడా రకం వానపాములను బెడ్స్‌లో వదులుతారు. ప్రతి రోజూ పొద్దున పేడ నీటిని బెడ్స్‌పైన చల్లాలి. సాయంత్రం మామూలు నీరు చల్లాలి. పిట్టలు, కోళ్లు బెడ్స్‌ వైపు రాకుండా చూడాలి.  
3 వేల బస్తాలు

ఏటా 3 వేల బస్తాల వర్మీ కంపోస్టు (బస్తా = 40 కిలోలు) ఉత్పత్తి చేస్తానని, తమ పొలంలో ఎకరానికి ఏటా పది క్వింటాళ్ల వరకు వేస్తామని పాటిల్‌ వివరించారు. రైతులకు బ్యాగ్‌ రూ. 300 చొప్పున అమ్ముతున్నానన్నారు. బెడ్‌లో నెల రోజుల్లో 200 బస్తాల (బస్తా 40 కిలోలు) వర్మీ కంపోస్టు సిద్ధం అవుతుందని పాటిల్‌ వివరించారు. బెడ్‌లో సిద్ధమైన వర్మీ కంపోస్టు మొత్తాన్నీ ఒకేసారి తీసెయ్యరు. సగం మేరకే తీస్తారు. సగం వైపు నీరు చల్లటం రెండు రోజులు ఆపితే.. వానపాములన్నీ తేమ ఉండే వైపు వెళ్తాయి. అప్పుడు ఈ వైపున వర్మీ కంపోస్టును తీస్తారు. ఆ మేరకు మళ్లీ గడ్డీ గాదం, పేడ వేస్తారు. సిద్ధమైన వర్మీ కంపోస్టును జల్లించి కుప్ప పోస్తారు. రోజూ కుప్పపై తగుమాత్రంగా నీరు చల్లుతూ ఉంటారు. ఎవరైనా కావాలన్నప్పుడు బస్తాల్లో నింపి అమ్ముతారు. బస్తాల్లో నింపిన తర్వాత రెండు నెలల్లోగా పొలాల్లో వేసుకోవాలి. వేసవిలో తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా పొలాల్లో వేసుకోవచ్చు. వర్మీ కంపోస్టులో వానపాముల గుడ్లు ఉంటాయి. ఎండాకాలం పొలాల్లో వేస్తే గుడ్లు చనిపోతాయి.   

పంట ఏదైనా చీడపీడల బెడదే లేదు!
ఖరీఫ్‌లో పాటిల్‌ వ్యవసాయం అంతా వర్షాధారంగానే సాగుతుంది. పంటల మార్పిడి పాటిస్తారు. ఈ ఏడాది పత్తి వేసిన పొలంలో వచ్చే ఏడాది టమాటో/సోయా/మిర్చి తదితర పంటలు వేస్తారు. జొన్న వేసిన పొలంలో వచ్చే ఏడాది సోయా తదితర పంటలు వేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 5 ఎకరాల్లో బీటీ పత్తిని సేంద్రియంగానే సాగు చేశారు. ఎకరానికి పది క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేస్తారు. రెండేసి సార్లు వేపనూనె(1000 పిపిఎం), గోమూత్రం (200 లీ. నీటిలో 5 లీ. గోమూత్రం) పిచికారీ చేస్తారు. గోమూత్రం వేప నూనెకు ముందు లేదా వెనుక లేదా దానితో కలిపి కూడా అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తారు. ఇక అంతే. పత్తికి ఎటువంటి చీడపీడల బెడదా ఉండదు. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. గులాబీ పురుగు, రసంపీల్చే పురుగుల బెడదే ఉండదు అని పాటిల్‌ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఎకరానికి 14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది (రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు 10 క్వింటాళ్లే వచ్చింది). ఖర్చులు పోను రూ. లక్షన్నర నికరాదాయం వచ్చిందని పాటిల్‌ వివరించారు. ఎకరంన్నరలో హైబ్రిడ్‌ టమాటో సాగు చేశారు. ఎకరానికి పది టన్నుల దిగుబడితో రూ. లక్షన్నర నికరాదాయం పొందానన్నారు. 

ఏటా రూ. 7 లక్షల నికరాదాయం
పాటిల్‌ తన భూమిలో 13 బోర్లు వేసినా ఒక్క బోరులో కూడా నీరు రాలేదు. రబీలో సోదరుడి పొలంలో బోరు, బావి నుంచి నీరు తీసుకొని పరిమితంగా పంటలు సాగు చేస్తారు. ముప్పావెకరం ఉల్లి, ముప్పావెకరం గోధుమ, ఎకరం పెద్ద జొన్న, సొర సాగు చేస్తున్నారు. నాటు రకం సొర కాయలు 12.5 కిలోలు తూగాయని చెప్పారు. ఈ ఏడాది వానలు బాగా పడటంతో పంటలు బాగా పండాయని పాటిల్‌ సంతోషంగా చెప్పాడు. ఇతర ఖర్చులు, ముగ్గురు జీతగాళ్ల జీతాలు పోను పంటల మీద, వర్మీ కంపోస్టు మీద ఈ ఏడాది రూ. 7 లక్షల నికరాదాయం వచ్చిందన్నారు. పాటిల్‌కు ఆదాయంపై చింత లేదు. చీడపీడలు లేని సేంద్రియ పంటల దిగుబడి పొందటంలో పెద్ద సమస్యలు ఉండవు. దీంతోపాటు వర్మీ కంపోస్టుపై ఆదాయం కూడా వస్తుంది. సొంత వనరులతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు దీర్ఘకాలంలో ఎంత నిశ్చింతగా, నిబ్బరంగా ఉండవచ్చో చెప్పాలంటే దయానంద్‌ పాటిల్‌ పేరు చెప్పవచ్చు!

ఏడాది చాలు!
నేను 17 ఏళ్లుగా వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటూ సేంద్రియ పంటలు నిశ్చింతగా పండిస్తున్నా. పత్తి, మిర్చి తదితర పంటల్లో కూడా వేపనూనె, గోమూత్రం పిచికారీతో చీడపీడల బెడద లేకుండా సాగు చేస్తున్నా. ఏకవల్య ఫౌండేషన్, ధాన్‌ ఫౌండేషన్, కేవీకే తదితర సంస్థల మీటింగ్‌లలో రైతులకు శిక్షణ ఇస్తుంటాను. రైతులు వచ్చి వర్మీ కంపోస్టు కొనుక్కెళ్తుంటారు. అయితే, సొంతంగా ఎవరూ వర్మీ కంపోస్టు తయారు చేసుకోవటం లేదు. ఉదయం పేడ నీరు, సాయంత్రం మామూలు నీరు పిచికారీ చేయాలి. పక్షులు, కోళ్లు వానపాములను తినెయ్యకుండా కాపలా కాయాలి. ఈ మాత్రం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఉపయోగం ఉందని తెలిసినా కష్టపడటానికి రైతులు ఎవరూ ఇష్టపడటం లేదు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతులు సేంద్రియ వ్యవసాయంలోకి మారడానికి ఒక ఏడాది చాలు. తొలి ఏడాది మాత్రం.. ఎకరానికి పది క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వేసి, రసాయనిక ఎరువులు కూడా 25 శాతం వరకు వేయాలి. రెండో ఏడాది నుంచి వర్మీ కంపోస్టు వేస్తే చాలు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. సబ్సిడీ ఇస్తే వేప నూనె తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుందామని అనుకుంటున్నా. – ఆర్జునే దయానంద్‌ పాటిల్‌ (94415 28383),దనోర–బి, ఇంద్రవెల్లి మం., ఆదిలాబాద్‌ జిల్లా  
– ఆత్రం జగదీశ్,సాక్షి, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement