
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్‌సేద్యంపై శిక్షణ
దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్‌లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు.
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్‌పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.
నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి.
ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment