ఏడాది పొడవునా పచ్చని పంటలు! | Special Poly Houses Build In Hyderabad Sagubadi | Sakshi
Sakshi News home page

ఏడాది పొడవునా పచ్చని పంటలు!

Published Tue, Apr 26 2022 7:48 AM | Last Updated on Tue, Apr 26 2022 7:51 AM

Special Poly Houses Build In Hyderabad Sagubadi - Sakshi

ప్రకృతి సిద్ధంగా సమగ్ర పోషణ, సస్య రక్షణ పద్ధతులను అనుసరించటం ద్వారా ఆరుబయట పొలాలతో పాటు పాలీహౌస్‌లలోనూ ఏడాది పొడవునా ఆరోగ్యదాయకమైన వివిధ సేంద్రియ ఉద్యాన పంటలు నిశ్చింతగా పండించవచ్చని ఈ రైతులు నిరూపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రకృతి సాగు చేస్తూ ప్రతిరోజూ నమ్మకమైన దిగుబడులు తీస్తూ, హైదరాబాద్‌ నగరంలో ఎంపికచేసిన చోట్ల నేరుగా ప్రజలకు విక్రయిస్తుండటం విశేషం. 

మేడ్చల్‌–మల్కజ్‌గిరి జిల్లాలో ఆధునిక పద్ధతుల్లో ఆరోగ్యదాయక సేద్యం జరుగుతోంది. హార్ట్ట్‌ ట్రస్టు వ్యవస్థాపకులు, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత సుబ్రమణ్యం రాజు ఆధ్వర్యంలో పలువురు రైతులు సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామంలో మూడు ఎకరాల్లో ఐదు పాలీహౌస్‌లు నిర్మించుకున్న పెన్మెత్స పెద్దిరాజు, గొట్టుముక్కల రాము ఏడాది పొడవునా అనేక రకాల ఆకుకూరలను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు. మండుటెండల్లోనూ పాలీహౌస్‌లలో వీరు ఆకుకూరలను చీడపీడలు, పోషక లోపాలు లేకుండా పండిస్తున్న తీరు ఔరా అనిపించక మానదు.

కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పెరుగు తోటకూర, ఎరుపు తోటకూర, కాడ తోటకూర, గంగవాయిలు, గోంగూర, బచ్చలి కూరలను పాలీహౌస్‌లలో ఎత్తు మడులపై సాగు చేస్తున్నారు. పుదీన, కరివేపాకులను ఆరుబయట మడుల్లో పండిస్తున్నారు. పాలీహౌస్‌లో సాగు చేస్తున్న బీర, సొర, కాకర, కీర పంటలను సైతం వచ్చే నెల నుంచి దిగుబడి వస్తుందన్నారు. 3 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం గల పాలీహౌస్‌లో పశువుల ఎరువు, వర్మీకంపోస్టు మిశ్రమంతో 48 ఎత్తుమడులు ఏర్పాటు చేశారు. ప్రతి మడి 40 చదరపు మీటర్లుంటుంది. 

ట్రైకోడెర్మావిరిడితో విత్తన శుద్ధి చేస్తారు. జీవామృతం, గోకృపామృతం, వేస్ట్‌డీకంపోజర్‌ వంటి ద్రవరూప ఎరువులను ఫైబర్‌ ట్యాంకులలో తయారు చేసుకుంటున్నారు. నిర్ణీత సమయాల్లో ఎయిరేటర్ల ద్వారా ఈ పోషక ద్రావణాలను ఆటోమేటిక్‌గా కలియబెట్టుకుంటూ.. ఆధునిక పద్ధతుల్లో వాల్వుల ద్వారా నేరుగా బెడ్స్‌కు వారానికోసారి డ్రిప్‌ల ద్వారా అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అదే విధంగా ఫిష్‌ అమినో యాసిడ్, పంచగవ్యలను వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. సస్యరక్షణ కోసం బవేరియా, మెటారైజియం, వర్టిసెల్లంలను పిచికారీ చేస్తున్నారు. 

ఆకుకూర మొక్కలను పీకి, వేర్లను కత్తిరించి, 200 గ్రా. కట్టలు కట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్‌ అవసరాలను బట్టి ప్రణాళికా బద్ధంగా విత్తుకోవటం వల్ల ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వస్తోంది. చ.మీ. విస్తీర్ణంలో కొత్తిమీర, మెంతికూర  900 గ్రాములు.. పాలకూర 1.7 కిలోలు.. మిగతావి 1.2 కిలోల దిగుబడి సాధిస్తున్నామని గొట్టుముక్కల రాము (76598 55588) చెప్పారు. చిల్లుల్లేని ఆకులతో కూడిన నాణ్యమైన ఆర్గానిక్‌ ఆకుకూరలను ఉత్పత్తి చేస్తుండటం విశేషం. అంతేకాదు, రసాయన అవశేషాల్లేని నాణ్యమైన ఆకుకూరలను వారానికి మూడు రోజులు (కేబీఆర్‌ పార్క్‌ వద్ద శనివారం ఉదయం, పబ్లిక్‌ గార్డెన్‌లో ఆదివారం ఉదయం, విల్లాల్లో బుధవారం) హైదరాబాద్‌ నగరంలో నేరుగా ప్రజలకు విక్రయిస్తుండటం విశేషం 

పండూరు మామిడిపై ప్రత్యేక శ్రద్ధ 
మేడ్చల్‌ మండలం పూడూరులో 18 ఎకరాల్లో భూపతిరాజు అజయకుమార్‌ (9849033414) వైవిధ్య భరితమైన మామిడి తదితర పండ్ల జాతులను, ప్రత్యేకించి పండూరు మామిడి రకాన్ని, సాగు చేస్తున్నారు. టమాటో, వంగ దేశీయ రకాలను సాగు చేస్తూ విత్తనోత్పత్తి చేపడుతున్నారు. గిర్‌ ఆవుల డెయిరీని నిర్వహిస్తున్నారు. గత ఏడాది పండూరు మామిడి మొక్కలు నాటి మధ్యలో మిరప, కీర, బెండ, నిమ్మ తదితర పంటలను సాగు చేస్తున్నారు. సుబ్రమణ్యం రాజు సూచనల మేరకు వివిధ రకాల ద్రావణాలను పంటలకు నియమబద్ధంగా అందిస్తున్నారు. పండ్ల చెట్లకు సీజన్‌లో నెలకోసారి, కూరగాయలకు పది రోజులకోసారి పిచికారీ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ పంటల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) తోడ్పాటుతో శతృపురుగుల జీవనియంత్రణ కోసం బ్రాకన్‌ రకం మిత్ర పురుగులను పొలాల్లో వదులుతూ మంచి ఫలితాలు పొందుతున్నామని సుబ్రమణ్యం రాజు(7659855588) చెప్పారు. భూమిలో పోషకాల లోపం రాకుండా పోషక ద్రావణాలు ఇస్తూ, సస్యరక్షణకు పిచికారీలు చేస్తూ మిత్ర పురుగులను వృద్ధి చేసుకుంటూ ఉంటే ఉద్యాన రైతులు చక్కని దిగుబడులు తీయవచ్చన్నారు. వాతావరణాన్ని బట్టి అనుదినం అప్రమత్తంగా గమనిస్తూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలు.. పూర్తి ఆర్గానిక్‌ పద్ధతుల్లో ఆరుబయట పొలాల్లోనే కాదు పాలీహౌస్‌లలో కూడా ఏడాది పొడవునా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల దిగుబడులు సాధించవచ్చనటానికి ఈ రైతుల అనుభవాలే నిదర్శనాలు. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement