సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. వీకెండ్‌ ఫార్మర్‌! | Chittoor: Weekend Farmer Sandra Ravindra | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ ఫార్మర్‌!

Published Mon, Jan 25 2021 3:26 PM | Last Updated on Mon, Jan 25 2021 4:33 PM

Chittoor: Weekend Farmer Sandra Ravindra - Sakshi

ఒకవైపు ఉన్నతోద్యోగాలు చేస్తూనే తీరిక సమయంలో మరోవైపు వ్యవసాయంపై మక్కువ చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసిన పంటలకు మంచి దిగుబడి లభిస్తుండటం, ఆదాయం కూడా అంతేస్థాయిలో ఉంటుండటంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల సిటీ జీవనం నుంచి ఉపశమనం కోసం కూడా కొంతమంది వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. సొంత భూములు ఉన్నవారు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్‌ (శని, ఆదివారాల)లో సేద్యం చేస్తూ పచ్చటి ప్రకృతితో మమేకమవుతున్నారు. ఇదే వరుసలో చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సండ్ర రవీంద్ర కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరికి చెందిన ఈయన వారాంతంలో సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. 

ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవీంద్రకు గోవర్ధనగిరిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2002 వరకు ఆయన తండ్రి ఈ పొలాన్ని సాగు చేశారు. తండ్రి మరణించాక పొలాన్ని రవీంద్ర వేరే రైతులకు కౌలుకిచ్చారు. అయితే స్నేహితుల సలహా మేరకు 2006 నుంచి తానే సాగు చేపట్టి సుమారు 8 ఏళ్లపాటు సొంతంగా చెరకు పండించినా  దక్కిన లాభం పెద్దగా లేదు. ఈ క్రమంలో.. పొరుగు గ్రామమైన రామాపురానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ గంగాధరం.. రవీంద్రకు పరిచయమయ్యారు. ఆయన సూచనలు, సలహాలతో రవీంద్రకు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. 

1.5 గుంటలతో ప్రారంభం..
అప్పటి వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల సారం కోల్పోయిన తన భూమిలో రవీంద్ర మొదట 1.5 గుంటల నేలను ప్రకృతి వ్యవసాయానికి ఎంచుకున్నారు. ఆ భూమిలో కానగ ఆకు, వేపాకు, జిల్లేడు ఆకు వేసి మగ్గబెట్టి 5 కిలోల వరి విత్తనాలు చల్లారు. ఇలా పెరిగిన నారును 1.5 గుంటల భూమిలో అలనాటి దేశీ వరి వంగడం క్రిష్ణ (క్రిష్ణ వ్రీహీ) పంట సాగును ప్రారంభించారు. దేశీ ఆవుపేడ, మూత్రం, ఆకులు, పాలు, మజ్జిగ, బెల్లం, పుట్టమట్టి, వివిధ రకాల ధాన్యాల పిండితో పంటకు ఉపయోగపడే ఘన జీవామృతం, బీజామృతం, జీవామృతం తయారు చేశారు. వేప ద్రావణం, పులియబెట్టిన మజ్జిగ, అగ్నాస్త్రము, సప్త ధాన్యంకుర కషాయాలను సిద్ధం చేసుకొని.. అవసరమైనప్పుడు పైరుకు వాడారు. ఎటువంటి తెగుళ్లు లేవు. పంట నాటి 125 రోజులైంది. నాటిన 5 నెలలకు పంట కోతకొస్తుంది.  
  
మరో 8 ఎకరాల్లో సాగుకు శ్రీకారం..
1.5 గుంటల భూమిలో క్రిష్ణ వంగడం పంట చాలా బాగుండటంతో.. ఈ పంట పూర్తి కాకముందే రవీంద్ర మరో 8 ఎకరాలలో కూడా ఈ వంగడాన్ని సాగు చేయనారంభించటం విశేషం. ఈ పంట నాటి 75 రోజులైంది. అనుకున్న దానికన్నా ఏపుగా, చక్కగా పెరిగింది.రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాధారణ పద్ధతిలో కంటే ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చు అయిందని రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. 

క్రిష్ణ బియ్యంకు భలే గిరాకీ..
ప్రకృతి పద్ధతిలో సాగు చేసే క్రిష్ణ బియ్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ బియ్యం కిలో రూ.300 పలుకుతోంది. దేశంలో క్రిష్ణ బియ్యం పండిస్తున్న రైతులు సంపన్నులుగా మారుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కితాబివ్వడం తెలిసిందే. 

ప్రాచీన భారత వంగడమైన క్రిష్ణ వ్రీహీని పూర్వం యజ్ఞాలు, పండుగల్లో ఉపయోగించేవారు. 100 గ్రాముల క్రిష్ణ బియ్యంలో 8.8 నుంచి 12.5 గ్రాముల ప్రొటీన్లు, 3.33 గ్రాముల లిపిడ్స్, 2.4 మిల్లీగ్రాముల ఐరన్, 24.06 మిల్లీగ్రాముల కాల్షియం, 58.46 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 69 నుంచి 74 మిల్లీగ్రాముల యాంథోసయనిన్స్‌ తదితరాలు ఉంటాయి. దీనిలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరోటిన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయని చెబుతున్నారు. 

క్రిష్ణ బియ్యంతో ఉపయోగాలివే..
∙ఇందులో ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
∙క్యాన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తుంది. 
∙వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 
∙ మధుమేహాన్ని నియంత్రిస్తుంది.  
  – జి. జగన్నాథం, సాక్షి, పిచ్చాటూరు, చిత్తూరు జిల్లా 

రెట్టింపు ఉత్సాహం..
నా తండ్రి మరణించే వరకు నాకు వ్యవసాయం గురించి కనీస అవగాహన కూడా లేదు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు గంగాధరం సూచనలతో దానిపై ఆసక్తి కలిగింది. ఉద్యోగం చేస్తూ సెలవుల్లో వ్యవసాయం చేస్తున్నా. ప్రకృతి సాగు ఫలితాలు నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. 
– సండ్ర రవీంద్ర (93809 42229),  
వారాంతపు రైతు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, గోవర్ధనగిరి, పిచ్చాటూరు మం., చిత్తూరు జిల్లా

యజ్ఞంలా చేస్తున్నారు..
రవీంద్ర క్రిష్ణ ధాన్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో యజ్ఞంలా చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో పని ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యోగం చేస్తూనే వారాంతంలో వ్యవసాయంపై దృష్టి సారించడం విశేషం. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలి. సహాయ సహకారాలు అందించడానికి నా వంటి వాళ్లం సిద్ధంగా ఉన్నాం.
 – డా. కె.గంగాధరం 
(98490 59573), ప్రకృతి వ్యవసాయ నిపుణులు, రామాపురం, చిత్తూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement