ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్‌వేర్‌ యువ జంట | Software Engineering Couple Doing Organic Farming Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్‌వేర్‌ యువ జంట

Published Mon, Mar 22 2021 7:44 AM | Last Updated on Mon, Mar 22 2021 7:45 AM

Software Engineering Couple Doing Organic Farming Karimnagar - Sakshi

వనరాజా కోళ్ల సంరక్షణ పనుల్లో మల్లికార్జునరెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు 

ఏడేళ్ళ క్రితం ఈ యువ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు. సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్‌ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు.  సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు..  

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు ఇటీవల జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్షా్మరెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్‌ రెడ్డి బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో స్టాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా మూడేళ్ళు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్‌ జబ్బుపాలైంది. అదేవిధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్‌ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అదే కాలంలో పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్‌రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు.

విద్యార్థినులతో మల్లికార్జునరెడ్డి 
తినేవన్నీ సేంద్రియంగా పండించుకున్నవే.. 
మల్లిఖార్జున్‌ రెడ్డి, సంధ్యారెడ్డి  సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య.

ఎకరానికి రూ. లక్ష నికరాదాయం
మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు.

పొలంలో మల్లికార్జునరెడ్డి, పశువులకు మేత వేస్తూ..
ఎకరంన్నరలో వస పంట సాగు
ఎరంన్నరలో వస కొమ్ములను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నల్ల నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా దీని సాగుకు అనుకూలం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల విభాగంతో (క్వింటా రూ. 9 వేలు) కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు రావచ్చని ఆశిస్తున్నారాయన. పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ–ఢిల్లీ) బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ జాతీయ అవార్డును ఇటీవలఅందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం. 
– వెల్మ విజేందర్‌ రెడ్డి, సాక్షి, చొప్పదండి

వద్దన్న వారే అభినందిస్తున్నారు
ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుండి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. 
– మావురం సంధ్యారెడ్డి, పెద్దకూర్మపల్లి

వరి విస్తీర్ణం తగ్గిస్తా
సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్‌.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం. 
– మావురం మల్లికార్జునరెడ్డి (97040 90613), 
ఐఎఆర్‌ఐ ఉత్తమ ఇన్నోవేటివ్‌ రైతు అవార్డు గ్రహీత,
పెద్దకూర్మపల్లి, చొప్పదండి 
మం, కరీంనగర్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement