తువ్వదొడ్డి సమీపంలో సాగు చేసిన దానిమ్మ తోట
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే ఓ యువకుడు సాగు బాట పట్టాడు. వ్యవసాయంపై ఆసక్తితో సొంతూరిలోనే ఉద్యాన పంటలు పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో దానిమ్మ, మామిడి తోటలు సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధుకేశవరెడ్డి విజయగాథ ఇదీ.
చదవండి: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే!
తుగ్గలి(కర్నూలు జిల్లా): ప్రకృతి వైపరీత్యాలు.. మార్కెట్ మాయాజాలం..రెక్కల కష్టానికి దొరకని ప్రతిఫలం.. వెరసి వ్యవసాయం వద్దనుకుంటున్న రోజుల్లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాగు బాట పట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన రేమట చిన్న తిమ్మారెడ్డి లక్ష్మిదేవమ్మల కుమారుడు మధుకేశవరెడ్డి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని మిన్నెసోటా స్టేట్‌లో ఎంఎస్(మాస్టర్ ఆఫ్‌సైన్స్) చేసి, ఎన్‌రిచ్ కన్సల్టింగ్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
వ్యవసాయంపై ఇష్టం
మధుకేశవరెడ్డి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, ఆ తరువాత కోడుమూరు మండలం లద్దగిరిలో చదివాడు. ఆ సమయంలో వ్యవసాయంపై ఇష్టం పెంచుకున్నాడు. చదువుకుంటూనే పొలానికి వెళ్లి వ్యవసాయ పద్ధతులను తెలుసుకునేవాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఫ్లోరిడాలో పనిచేస్తున్నాడు. టెక్సాస్ తదితర ప్రాంతాల్లో వ్యవసాయ విధానం ఎలా ఉందో అధ్యయనం చేశాడు.
మామిడి తోట..
సొంతూరిపై మమకారంతో..
అమెరికా నుంచి ప్రతి సంవత్సరం స్వగ్రామానికి వచ్చేవాడు. ఇక్కడ ఉన్న పొలాలను పరిశీలించి పండ్లతోటల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఐదేళ్ల క్రితం సోదరులు మద్దిలేటి రెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టాడు. దానిమ్మ సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాడు.
శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ..
అమెరికాలో ఉంటూనే ఎప్పటికప్పుడు దానిమ్మ, మామిడి ఇతర పంటలపై శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటున్నాడు. అక్కడి నుంచే సోదరులకు ఆన్‌లైన్ వీడియో కాల్ చేసి సాగుకు అవసరమైన సూచనలిస్తూ వచ్చాడు. పది ఎకరాల మామిడి తోట నుంచి రూ.20 లక్షల ఆదాయం పొందాడు. అనుకూలిస్తే దానిమ్మ కూడా ఆశించిన దిగుబడులు రావచ్చని చెబుతున్నాడు.
సేంద్రియ పద్ధతులతో..
సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేస్తున్నారు. ఇందు కోసం 30కి పైగా ఆవులను పెంచుతున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువు వాడుతున్నారు. ఊర్లో పలువురు రైతులకు మధుకేశవరెడ్డి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వచ్చి ఏటా రెండు నెలలు పాటు ఇక్కడే ఉంటూ పండ్ల తోటల సాగులో నిమగ్నమై ఎంతో అనుభూతిని పొందుతున్నాడు. ఈయన ప్రోత్సాహంతో గ్రామంలో పలువురు పండ్ల తోటల సాగువైపు వెళుతున్నారు.
హార్టికల్చర్ హబ్‌గా కర్నూలు
మాది ఆది నుంచి వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నన్నాళ్లు సేద్యం ఎంతో బాగా చేశాడు. చదువుకునే రోజుల్లో నేను కూడా సెలవుల్లో ఇంటికి వస్తే సేద్యం చేసేవాడిని. వర్షాధారమైన ఈ ప్రాంతంలో రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. దీంతో నేను పండ్ల తోటల సాగు చేసి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నా. భూమి అనుకూలించి, నీటి వసతి బాగా ఉంటే దానిమ్మ సాగులో మంచి లాభాలు ఆర్జించవచ్చు.
అయితే శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పంటపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తోంది. పెట్టుబడులు పెట్టడం ముఖ్యం కాదు. నిరంతరం పర్యవేక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ చేసుకోవడం ముఖ్యం. మా తోటలు చూసి తెలంగాణకు చెందిన నా స్నేహితుడు కూడా ఉద్యాన పంటల సాగు చేపట్టాడు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా హార్టికల్చర్ హబ్‌గా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. నా విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది.
– రేమట మధుకేశవరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తువ్వదొడ్డి
Comments
Please login to add a commentAdd a comment