జీవనమే నిత్య పోరాటమైతే వ్యవసాయం అనుక్షణ యుద్ధమే అంటారు ఒంటరి మహిళా రైతు శశికళ. ఎం.ఎ., బీఈడీ చదివిన ఆమె భర్త ఆకస్మిక మృతితో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేపట్టారు. 2005 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆవులంటే ఇష్టంతో గోశాలను ఏర్పాటు చేసి వర్మీ కంపోస్టు, వర్మీ కల్చర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
పచ్చదనాన్ని అమితంగా ఇష్టపడే ఆమె నర్సరీ ఏర్పాటు చేసుకొని లాండ్‌స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయే శశికళ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటు రైతుగా, అటు ఒంటరి మహిళగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
17 ఏళ్లుగా 18.5 ఎకరాల్లో మొక్కవోని దీక్షతో సమీకృత సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్న కర్ర శశికళ స్వగ్రామం (నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం) దుగ్గెపల్లి. సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కల్చర్‌తో బత్తాయి తోటను చీడపీడల నుంచి కాపాడుకోగలగటం ఆమెను దృఢచిత్తంతో సేంద్రియ వ్యవసాయం వైపు తొలి అడుగులు వేయించాయి.
సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టుకు అనేక జీవన ఎరువులు కలిపి తయారు చేసిన ‘వర్మీ కల్చర్’ను ప్రధానంగా శశికళ ఉపయోగిస్తున్నారు. దీనితోనే వరి, బత్తాయి, పశుగ్రాసం తదితర పంటలతో పాటు నర్సరీ మొక్కలను సాగు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను ఇతర రైతులకూ విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
వరి.. రెండేళ్లకో పంట!
తనకున్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తూ ముందడుగు వెయ్యటం శశికళ సేద్యం ప్రత్యేకత. సొంత భూమి 18.5 ఎకరాలకు గాను 6 ఎకరాల్లో బత్తాయి, 5 ఎకరాల్లో వరి పంట, 2 ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దేశీ జాతుల గోశాలను ఏర్పాటు చేసి.. వర్మీ కల్చర్ ఉత్పత్తి చేస్తున్నారు.
పుణేలో శిక్షణ పొంది 3.5 ఎకరాల్లో మూడేళ్లుగా నర్సరీని నిర్వహిస్తూ.. లాండ్‌స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదుగుతున్నారు. అనుదినం 20 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.
పండించిన ధాన్యాన్ని బియ్యం చేసి నేరుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులకు కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఒక సీజన్‌లో పండించిన ధాన్యం నిల్వచేసి రెండేళ్లపాటు బియ్యం విక్రయిస్తుంటారు. రెండేళ్లకు ఒక సీజన్‌లో మాత్రమే వరి పండిస్తారు.
ఉదా.. ప్రస్తుత వానాకాలంలో 5 ఎకరాల్లో 5204 సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. యాసంగిలో గానీ, వచ్చే ఏడాది రెండు సీజన్లలో గానీ వరి పండించరు. ఈ మూడు సీజన్లలో తమ ఆవుల కోసం పశుగ్రాసం పండిస్తారు. మార్కెట్ అవసరం మేరకు ఏ పంటైనా పండించటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని శశికళ అనుభవపూర్వకంగా చెప్తున్నారు.
వరి పంటకు దుక్కి దశలో ఓ సారి, చిరు పొట్ట దశలో మరోసారి వర్మీ కల్చర్‌ను వేస్తున్నారు. దీంతో పాటు ద్రవరూప ఎరువు వర్మీవాష్‌ను పైప్‌లైన్ల ద్వారా అందిస్తున్నారు. వర్మీ కల్చర్ ప్రొడక్ట్ ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నదన్నారు.
70 కిలోల ధాన్యం బస్తాలు ఎకరానికి 35 వరకు పండుతాయన్నారు. పూర్తిస్థాయి శ్రద్ధతో 3 దఫాలు వర్మీకల్చర్, 4 దఫాలు పంచగవ్య వాడటం ద్వారా శ్రీవరిలో ఎకరానికి 55 బస్తాల ధాన్యం దిగుబడి(2008లో) సాధించిన అనుభవం ఆమెది. ప్రస్తుతం నర్సరీ, లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల వరి సాగుపై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నామన్నారు.
6 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటి మూడేళ్లయ్యింది. ఏడాదికి రెండుసార్లు వర్మీకల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. వచ్చే ఏడాది పంట కాపు వస్తుంది. 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు వర్మికల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. కాపు మొదలవుతోంది.
ఏటా 100 టన్నుల వర్మీ కల్చర్
2 ఎకరాల్లో ఏర్పాటైన గోశాలలో 45 దేశీ జాతుల ఆవులు, 25 ఎద్దులు 7 లేగదూడలు ఉన్నాయి. పేడ, మూత్రం, చేపల చెరువు వ్యర్థ జలాలను వర్మీ కల్చర్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఏడాదికి సుమారు 100 టన్నుల వర్మీ కల్చర్‌ను తయారు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను స్వంత వ్యవసాయానికి వినయోగిస్తూ ఇతర రైతులకు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
450 రకాల మొక్కల ఉత్పత్తి
పుణే వెళ్లి 20 రోజులు శిక్షణ పొందిన తర్వాత శశికళ తన వ్యవసాయ క్షేత్రంలోనే 3.5 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. ఇన్‌డోర్, అవుట్ డోర్, బోన్సాయ్ మొక్కలు.. అంటుకట్టిన పండ్లు, పూల మొక్కలు సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయి.
కొన్ని రకాల మొక్కలను పూణె, కోల్‌కత్తా, బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి అంటు మొక్కలను, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడే రకరకాల మొక్కలను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులకు విక్రయిస్తున్నారు.
ప్రైవేటు గృహాల్లో లాండ్‌స్కేపింగ్‌కు వినియో విక్రయిస్తూ శశికళ ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో నిలదొక్కుకోవడంతో పాటు నర్సరీ రైతుగా, లాండ్‌స్కేప్ నిపుణురాలిగా ఎదుగుతున్న శశికళ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తీరికలేని పనంటే ఇష్టం..!
తీరిక లేని పనిలో నిమగ్నం కావటం అంటే ఇష్టం. పరిగెట్టి సంపాయించాలని కాదు. స్వతంత్ర జీవనం పట్ల, పచ్చదనం పట్ల మనసులో ఉన్న ఇష్టం కొద్దీ నర్సరీ–లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రంగం పుంజుకుంటున్నది. అమ్ముడుపోకుండా మిగిలిన మొక్కలను పెద్ద (21 ఇంచ్‌ల) కవర్లలోకి మార్చి తర్వాత నెమ్మదిగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను.
20 మందికి పనికల్పించాను. వ్యవస్థ సజావుగా నడిచే అంత ఆదాయం అయితే వస్తోంది. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చులు అదుపు చేసుకుంటేనే మంచి ఆదాయం వస్తుంది.
ఒకే పంటపై ఆధారపడకుండా నర్సరీ ప్రారంభించాను. కష్టమైనా నష్టమైనా వ్యవసాయంలోనే నాకు సంతృప్తి. అమ్మానాన్న, బాబు సపోర్ట్ ఉండటంతో ఒంటరి మహిళనైనా పట్టుదలతో జీవన పోరాటం సాగిస్తున్నాను. పురుషులకు లేని సమస్యలు మహిళా రైతులను ఇంటాబయటా ఇబ్బంది పెడుతుంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే!
– కర్ర శశికళ (91824 43048), సేంద్రియ రైతు, లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్, దుగ్గెపల్లి, త్రిపురారం మం., నల్లగొండ జిల్లా
చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..
ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు..
Comments
Please login to add a commentAdd a comment