ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వమూ ఈ బాటకు వచ్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ రంగంలోకి వచ్చాక ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాలతో, ఇన్నాళ్లూ రసాయనిక సేద్యంపైనే దృష్టి పెట్టిన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలన్నీ.. ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని చేపడుతున్నాయి. వ్యవసాయ కోర్సుల్లో ప్రకృతి సేద్య పాఠ్య ప్రణాళిక రచనకు సైతం పీజేటీఎస్‌ఏయూ వీసీ డా. ప్రవీణ్‌రావు సారధ్యంలో శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యవసాయ రంగ ప్రముఖుల అభిప్రాయాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం..
కమిటీలో ప్రకృతి వ్యవసాయదారులకూ చోటివ్వాలి
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. రసాయనిక వ్యవసాయం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు భూతాపోన్నతి సమస్యకు కూడా ఇది సరైన పరిష్కారం. అయితే, వ్యవసాయ విద్య కోసం సిలబస్ తయారు చేయడానికి ప్రకృతి వ్యవసాయంలో బొత్తిగా అనుభవం లేని విద్యావేత్తలతోనే కమిటీ వేయటం సరికాదు.
మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రైతులే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇది ప్రజా ఉద్యమం. దీనికి నాయకత్వం వహిస్తున్న వారికి ఈ కమిటీలో భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, సెనెగల్, క్యూబా వంటి దేశాల్లో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో డా. పాలేకర్, డా. నమ్మాళ్వార్, దీపక్ సచ్‌దే, భాస్కర్ సావే, సుభాష్ శర్మ, చింతల వెంకటరెడ్డి, భరత్ మనసట, కపిల్ షా.. ఆస్ట్రేలియాకు చెందిన డా. వాల్టర్ యన వంటి వారెందరో శాస్త్ర విజ్ఞానాన్ని సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విశేష కృషి చేశారు.. చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వెనుక సార్వత్రికమైన సైన్స్ ఉంది. ప్రిన్సిపుల్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సాగు పద్ధతులే ప్రాంతాన్ని బట్టి వైవిధ్యపూరితంగా ఉంటాయి. పాఠ్యప్రణాళిక తయారు చేసే కమిటీలో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న రైతులు, రైతు సంస్థలతోపాటు ఆం.ప్ర., హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రభుత్వాల ప్రతినిధులకూ చోటు ఉండాలి.
– టి. విజయకుమార్
ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గుంటూరు
vjthallam@gmail.com
మహిళా సంఘాల పాత్ర కీలకం
ఇది వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాల్లో ఐసిఎఆర్ అనుబంధ సంస్థలు కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు సాగినా.. ప్రకృతి వ్యవసాయం విస్తరణ వీళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రకృతి వ్యవసాయం ఆచరణ ఇప్పటికే ముందుకు వెళ్లింది. దీని వెనకాల సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. పర్వాలేదు. విస్తరణ ముఖ్యంగా రైతు నుంచి రైతుకు, మహిళా రైతుల నుంచి మహిళా రైతులకు ఎలా ముందుకు పట్టుకెళ్లాలి అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏపీసిఎన్‌ఎఫ్ ప్రభుత్వ కార్యక్రమంలో ఆచరించి, సత్ఫలితాలను చూపటం జరుగుతోంది. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే మంచిదని మా అభిప్రాయం.
అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయం ముందరికి వెళ్లాలీ అంటే.. ఒక్కొ క్క రైతుతోటి వ్యక్తిగతంగా పనిచేయ వలసి వచ్చిన పాత నమూనా ప్రకారం కాకుండా.. క్షేత్ర స్థాయి సామాజిక సంస్థల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు పట్టుకెళ్లాలి. ఏపీలో కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఇలాంటి కృషి జరుగుతోంది. ఇదే మాదిరి మహిళా సంఘాల వ్యవస్థను రూరల్ లైవ్‌లీహుడ్స్ మిషన్‌లో దేశమంతా రకరకాల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గతంలోనే నెలకొల్పటం జరిగింది. కాబట్టి, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలంటే.. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలపైనే ఆధారపడకుండా.. కమ్యూనిటీ సంస్థలను ముఖ్యంగా క్షేత్ర స్థాయి మహిళా సంఘాలను ఆధారం చేసుకొని కృషి చేయాలి. వేరే రాష్ట్రాల్లో కూడా అందరి రైతులకూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేయాలంటే ఏపీలో మాదిరిగా చేయాలి.
– కవిత కురుగంటి
సమన్వయకర్త, అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా), బెంగళూరు
kavitakuruganti@gmail.com
సేంద్రియ నిపుణులకూ కమిటీలో చోటివ్వాలి
మంచి ప్రయత్నం. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ విద్యలో మార్పు తేవటానికి మేము, ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేసినా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అడ్డుపడుతూ వస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఇప్పుడు ఒక ప్రయత్నం చేయటానికి కమిటీ వేయటం అభినందించాల్సిన విషయం. అయితే, ఈ కమిటీలో చాలా మంది ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల పైన పనిచేసిన వాళ్ళు కాదు.. దాంతో ఫలితం ఎంత అన్నది అనుమానమే. అలాగే కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచే కాకుండా, సేంద్రియ వ్యవసాయం పైన పనిచేస్తున్న ఇతరులను కూడా ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తే బావుంటుంది.
– డా. జీ వీ రామాంజనేయులు
స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్
ramoo@csaindia.org
ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం
వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసి, పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆనందదాయకం. సేంద్రియ వ్యవసాయంపై ఎం.ఎస్.సి. కోర్సు చేయదలచిన విద్యార్థులకు పాఠ్య ప్రణాళికను ఐ.సి.ఎ.ఆర్. ఇప్పటికే తయారు చేసింది. డిసెంబర్ 3న కేంద్ర వ్యవసాయ మంత్రి దీన్ని విడుదల చేశారు. సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం – ఇటువంటి పలు రకాల పేర్లతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు.
ఒక్కొ క్క అడుగూ ముందుకు వేయడమే సరైన యోజన అవుతుంది. విధానాలు వేరైనా, రసాయనాలు వేయని పంటలు మంచివి అనేది మొదట అడుగు. ఒక్కొక్క విధానంపై పరిశోధనా ఫలితాలు అందిన తర్వాత మరొక అడుగు ముందుకు వేయవచ్చు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అధ్యక్షతన నియామకమైన కమిటీ ఈ విషయమై పరిశోధన జరిపి, ఆచరణయోగ్యమైన ఒక కార్యక్రమ రూపాన్ని (రోడ్ మ్యాప్‌ను) ఇవ్వగలదని ఆశిద్దాం.
– పి. వేణుగోపాల్‌రెడ్డి
చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్
pvg@ekalavya.net
సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ
వెంకటరామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సేంద్రియ సాగు వ్యవసాయ విధానాలను వివిధ ఉద్యాన పంటల్లో పరిశీలించి స్థిరీకరించాం. ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’ పేరుతో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి పాఠ్య ప్రణాళికను, నియమ నిబంధనలను సిద్ధం చేశాం. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సేంద్రియ సాగు విధానాలపై 25 రోజుల శిక్షణ నిర్వహించాం. ‘ఉద్యాన పంటలలో సేంద్రియ సాగు విధానాలు’ పుస్తకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచాం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కె.వి.కె.ల ద్వారా వివిధ పంటల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు పద్ధతులను నిర్వచించి, తగు రీతిన ప్రచారం చేసేలా నెలవారీ ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రతి కె.వి.కె.లో ఒక ఎకరం ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేసి.. రైతులకు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించబోతున్నాం. వివిధ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం జరిగే క్షేత్రాలను శాస్త్రవేత్తలు సందర్శిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు, సలహాల కోసం విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా స్థానాలు, కె.వి.కె.లను రైతులు సంప్రదించవచ్చు.
– డా. టి. జానకిరామ్
ఉప కులపతి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం vc@drysrhu.edu.in
వ్యవసాయ అనుబంధ రంగాలకూ వర్తింపజేయాలి
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, విద్యారంగంలో కూడా ఇందుకు అనుగుణంగా మార్పు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైన దిశగా ముందడుగు. హరిత విప్లవ ప్రారంభం అయినప్పటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సాగు నీటిని విచక్షణారహితంగా వాడి భూసారాన్ని క్షీణింపజేసుకున్నాం. భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటికైనా సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ప్రారంభించాలి.
వివిధ పంటలు, ఉద్యాన తోటలు, పశుపోషణ, చేపలు, రొయ్యల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం ఇప్పటి అవసరం. ఖర్చు తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలి. పంటల మార్పిడి ద్వారా, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, పోషకాల సాంద్రతతో కూడిన వైవిధ్యపూరితమైన సమతుల ఆహారాన్ని ప్రజలకు అందించటం సాధ్యమవుతుంది.
– డా. విలాస్ కె తొనపి
సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ director.millets@icar.gov.in
ప్రయోగాల ఫలితాలను రైతులకు అందిస్తాం
మా విశ్వవిద్యాలయ పరిశోధనా క్షేత్రంతో పాటు రైతుల క్షేత్రాల్లో సమగ్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి వివిధ పంటలపై పరిశోధనాత్మక సాగును సమదృష్టితో చేపడతాం. ఆ క్షేత్రాల్లో గడించే అనుభవాల ఆధారంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం.
– డా. ఎ. విష్ణువర్ధన్‌రెడ్డి
ఉప కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు vicechancellor@angrau.ac.in
Comments
Please login to add a commentAdd a comment